ఎర్రకోట పైనుంచి పాకిస్థాన్‌కు మోదీ హెచ్చరిక
దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఢిల్లీలోని ఎర్రకోటలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ జెండాను ఎగురవేశారు.
By: A.N.Kumar | 15 Aug 2025 9:36 AM ISTదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఢిల్లీలోని ఎర్రకోటలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రధానమంత్రిగా ఇది ఆయనకు 12వ సారి కావడం విశేషం. ఈ ప్రసంగంలో మోడీ గారు పాకిస్తాన్‌కు, పరోక్షంగా అమెరికాకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా దేశంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులపైనా పరోక్షంగా వ్యాఖ్యానించారు.
-ఉగ్రవాదంపై కఠిన వైఖరి
మోడీ తన ప్రసంగంలో ఉగ్రవాదం పట్ల తమ ప్రభుత్వం అనుసరించే కఠిన వైఖరిని స్పష్టం చేశారు. "ఉగ్రవాదానికి సహకరించే వారికి గట్టి సమాధానం చెబుతాం. మన సైన్యానికి పూర్తిస్థాయిలో స్వేచ్ఛనిచ్చాం. న్యూక్లియర్ బెదిరింపులకు భయపడేది లేదు. దేశ సౌభాగ్యం కోసం ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేసేది లేదు. మన దేశం జోలికి వస్తే ఎవరినైనా వదిలిపెట్టేది లేదు" అని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా "దాయాది దేశం మనల్ని కవ్విస్తే, వారి దేశంలోకి వెళ్లి ఉగ్రవాదులను మట్టుపెట్టాం" అని గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ ను గుర్తు చేశారు. "ఉగ్రవాదులకు, వారికి మద్దతు ఇచ్చే వారికి మధ్య మేము తేడా చూడము" అని స్పష్టం చేశారు.
-సింధు నదిపై కీలక వ్యాఖ్యలు
సింధు నది జలాల విషయంలో పాకిస్తాన్ కు గట్టి షాకిచ్చారు. "రక్తం, నీళ్లు ఎప్పుడూ కలిసి ప్రవహించవు. సింధు నదిపై భారతదేశానికి పూర్తి హక్కులు ఉన్నాయి. ఈ నదీ జలాలను నూటికి నూరు శాతం వినియోగించుకుంటాం. ఇందులో ఏ శక్తి మాకు వ్యతిరేకంగా ఉండదు. ఒకవేళ ఉంటే అడుగడుగునా తొక్కేస్తాం" అని మోడీ తీవ్రంగా హెచ్చరించారు. భారత దేశ రైతుల ప్రయోజనాలను కాపాడటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ కు మాత్రమే కాకుండా, అమెరికాకు కూడా పరోక్ష హెచ్చరికలుగా భావించవచ్చు. ఎందుకంటే ఇటీవలే పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అసిఫ్ మునీర్ అమెరికా పర్యటనలో సింధు నదిపై డ్యామ్‌లు కడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
-దేశీయ రాజకీయాలపై స్పందన
మోడీ తన ప్రసంగంలో దేశీయ రాజకీయాలపై కూడా పరోక్షంగా స్పందించారు. "కొంతమంది వ్యక్తులు మన దేశ రాజ్యాంగాన్ని కించపరుస్తున్నారు. మన దేశ వ్యవస్థలను ప్రపంచ వేదికల మీద విమర్శిస్తున్నారు. ఇటువంటి విధానాలను భారత్ చూస్తూ ఊరుకోదు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడే రోజులు పోయాయి" అని ఆయన అన్నారు. ఇది ఇటీవలి కాలంలో 'ఓటు చోరీ' అంటూ వివాదం సృష్టించిన రాహుల్ గాంధీ వంటి ప్రతిపక్ష నాయకులకు గట్టి జవాబుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
-ఆత్మనిర్భర్ భారత్ పై నమ్మకం
భారత్ ఇప్పుడు బలహీనమైన దేశం కాదని, ఏ దేశం మీద ఆధారపడదని మోడీ స్పష్టం చేశారు. "డాలర్ల మీద, పౌండ్ల మీద భారతదేశం ఆధారపడదు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా స్వీయ సమృద్ధి సాధించాం" అని పేర్కొన్నారు. ఇది భారత్ ఆర్థిక స్వావలంబనను, స్వతంత్ర విదేశాంగ విధానాన్ని నొక్కి చెబుతుంది. మొత్తం మీద మోడీ గారి ప్రసంగం దేశ భద్రత, ఆర్థిక స్వావలంబన, అంతర్జాతీయ సంబంధాలపై భారత ప్రభుత్వం యొక్క దృఢమైన వైఖరిని స్పష్టం చేసింది.
