తగ్గేదేలే... మోడీ ఇమేజ్ ఇప్పుడు గ్లోబల్ రేంజ్ కు!
జాగ్రత్తగా గమనిస్తే.. అరాచకం అంతకంతకూ ఎక్కువైన ప్రతిసారీ.. దానికి చెక్ చెప్పే కొత్త శక్తి ఒకటి ఆవిర్భవిస్తుంది.
By: Garuda Media | 8 Aug 2025 10:25 AM ISTజాగ్రత్తగా గమనిస్తే.. అరాచకం అంతకంతకూ ఎక్కువైన ప్రతిసారీ.. దానికి చెక్ చెప్పే కొత్త శక్తి ఒకటి ఆవిర్భవిస్తుంది. ఇక్కడే ఒక ప్రశ్న రావొచ్చు. అసలు అరాచకం ఎందుకు ఉండాలి? దానికి చెక్ చెప్పే పరిస్థితి ఎందుకు రావాలి అని. కాలం ఎప్పుడూ ఒకేలా ప్లాట్ గా ఉండటం సాధ్యం కాదు కదా? అందులోనూ కాలం చెప్పాల్సిన పాఠాలు చాలానే ఉంటాయి కదా? భవిష్యత్తుకు గతం ఒక పాఠంగా చెప్పటం.. దాని నుంచి బుద్ధి తెచ్చుకొని మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మానవాళికి కాలం ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది. అయితే.. అన్నిసార్లు..అందరూ దాన్ని అర్థం చేసుకునే పరిపక్వత ఉండదన్న విషయం తెలిసిందే.
చరిత్ర పాఠాల్ని తిప్పి చూస్తే.. తనకు మించిన శక్తివంతుడు ఉండరన్నట్లుగా తల ఎగరేసిన సామ్రాజ్యవాదులకు కాలం సరైన సమాధానం చెబుతూనే వస్తోంది. కాకుంటే.. బాధాకరమైన అంశం ఏమంటే.. ఈ ప్రాసెస్ లో బలహీనులు మాత్రమే బలి అవుతుంటారు. అదే క్రమంలో బలవంతుడు సైతం దెబ్బ తినటం స్పష్టంగా కనిపిస్తుంది. అత్యంత శక్తివంతుడికి బుద్ధి చెప్పేందుకు లక్షలాది బలహీనులు బలి కావాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న. బలహీనుల పక్షం నుంచి చూసినప్పుడు అన్యాయంగా కనిపించినప్పటికీ.. ఈ తురహా ఘర్షణ నుంచే కదా కొత్త ప్రపంచం పుట్టుకు వచ్చేదన్న సత్యం మనసుకు అర్థమవుతుంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా తీరు ఈ కోవలోకే వస్తుంది. సుంకాల పేరుతో అగ్రరాజ్య అధినేత ప్రదర్శించాల్సిన అహంకారానికి మించి ఆయన వ్యవహరిస్తున్నారు. తన చేతిలో ఆయుధంగా ఉన్న ఆర్థిక ఆంక్షల్ని నిర్మోహమాటంగా ఆయన అమలు చేస్తున్నారు. అయితే.. అత్యంత శక్తివంతమైన వారు ఎలా ఉండాలి? తాను పాలకుడిగా ఉన్న సమూహానికి తనే తీరుతో తాను చేస్తున్న మేలు ఏమిటి? కీడు ఏమిటి? అన్నది చాలా ముఖ్యం. ప్రపంచ జనాభా 820 కోట్లు. అందులో అగ్రాజ్యమైన అమెరికా జనాభా 34.72 కోట్లు మాత్రమే. అంటే ప్రపంచ జనాభాలో అమెరికా వాటా అక్షరాల 4.5 శాతం మాత్రమే. కాకుంటే ప్రపంచ సంపదలో ఆ దేశం అగ్రస్థానంలో ఉండటమే దాని వ్యవహరశైలికి కారణంగా చెప్పాలి.
ప్రపంచంలోని మొత్తం సంపదలో అమెరికా వాటా 34 శాతం. అంతేకాదు ప్రపంచంలోని మిలియనీర్లలో 37 శాతం మంది అమెరికాలోనే నివసిస్తున్నారు. సాధారణంగా బలవంతుడు బలహీనుడి మీద తన అధిక్యాన్ని.. అధిపత్యాన్ని ప్రదర్శింస్తుంటాడు. తన ప్రయోజనాలు మాత్రమే ముఖ్యమనే ధోరణి తప్పించి.. బలహీనుల గురించి ఆలోచించే పని చేయడు. అందునా ట్రంప్ లాంటి బిలియనీర్ పాలకుడికి ఆ ఆలోచన కూడా ఉండదు. సహజసిద్ధంగా వ్యాపారి అయిన ట్రంప్.. ఇప్పుడు ప్రపంచానికి పెద్దన్న అమెరికాకు అధినేతగా ఉన్నప్పుడు.. అతగాడి మానసిక ధోరణి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
అందునా.. రెండోసారి అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు అతగాడు పడిన కష్టం అంతా ఇంతా కాదు. ప్రపంచ చరిత్రలో తన మార్క్ ఒకటి ఉండాలని.. అమెరికా చరిత్రలో తాను ఎప్పటికి ఒక చర్చగా నిలిచిపోవాలన్న ధోరణి ఆయనకు ఎక్కువే. అందునా.. ప్రపంచ శాంతి కోసం పాటు పడిన ప్రముఖుడికి ఇచ్చే నోబెల్ శాంతి పురస్కారాన్ని సొంతం చేసుకోవాలన్న ఆశ ఎక్కువ. దీని కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఇలాంటి వేళలో భారతదేశం నుంచి ఆయనకు అనూహ్యమైన ఇబ్బంది ఎదురైంది.
అందులో ప్రధానమైనది భారత్ తో తాను చేయాలనుకున్న వ్యాపారానికి ఒకనాటి తన మిత్రుడైన మోడీ మోకాలు అడ్డటం. అమెరికా ప్రయోజనాల కోసం ట్రంప్ ఎంతలా అయితే తపిస్తారో.. భారత ప్రయోజనాల కోసం మోడీ అంతే మొండిగా ఉంటారన్న విషయం తెలిసిందే. అందులోనూ.. తన పాలన ముందు వరకు ప్రపంచ దేశాలతో.. ముఖ్యంగా సంపన్న దేశాలతో భారత్ వ్యవహరించే తీరుకు భిన్నంగా వ్యవహరించటం.. తగ్గి ఉండటం.. ఒద్దికగా వ్యవహరించటం.. సంపన్న దేశాల పట్ల భయభక్తుల్ని ప్రదర్శించటం లాంటి వాటిని చాప చుట్టేసి.. భారత్ స్వయంశక్తిగా.. తనకంటూ ఒక ప్రత్యేక లక్షణం ఉన్న దేశమన్న ఇమేజ్ ను తెచ్చి పెట్టే ప్రయత్నంలో ఉన్నారు.
ఇలా తమ దేశాల్ని అమితంగా అభిమానించి.. ఆరాధించే ఇద్దరు పాలకుల మధ్య అనూహ్య రీతిలో మొదలైన పోరుకు నిదర్శనంగా వర్తమాన పరిస్థితులుగా చెప్పాలి. పాలకుడు ఎవరైనా తాను పాలించే దేశాన్ని ప్రేమించటం.. దాని ప్రయోజనాల కోసం శ్రమించటం మామూలే. అందుకు నిలువెత్తు నిదర్శనంగా మోడీ నిలిస్తే. ఈ తీరుకు భిన్నంగా తన దేశ ప్రయోజనాల కోసం మిగిలిన దేశాలన్నితాను చెప్పినట్లు.. తన దేశ ప్రయోజనాల కోసం మాత్రమే పని చేయాలని భావించటం.. దాన్ని బలంగా నమ్ముతూ.. నమ్మని వారిపై సుంకాల షాక్ ఇస్తానని చెప్పటంలోనే ఇబ్బంది. ఈ తీరుకు నిలువెత్తు రూపంగా ట్రంప్ నిలుస్తారు.
బలవంతుడికి బెదిరించటం అలవాటు. బలహీనుడికి అలాంటి బెదిరింపులకు భయపడటం మామూలే. కానీ.. కొన్నిసార్లు బలవంతుడి బెదిరింపులకు బలహీనుడు భయపడకుండా ప్రశ్నిస్తారు. అలాంటప్పుడు కొత్త చరిత్ర తెర మీదకు వస్తుంది. ట్రంప్ తీరుకు మోడీ వ్యవహరిస్తున్న తీరు ఇంతకాలం కాస్త కన్ఫ్యూజన్ కు గురి చేయగా.. తాజాగా బయటకు వస్తున్న అంశాలు ఇప్పుడు ఆయన ఇమేజ్ అంతకంతకూ పెరిగిపోయేలా చేస్తోంది. త్వరలో మోడీ జరిపే చైనా పర్యటన.. రష్యాతో మరింత మైత్రిబంధాన్ని బలపర్చుకోవటం లాంటి అంశాల్ని పరిగణలోకి తీసుకుంటే.. అగ్రరాజ్య అధినేత ట్రంప్ మొండితనానికి మోడీ తనదైన మౌనంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా కనిపిస్తోంది.
అగ్రరాజ్య అధినేతగా అత్యంత శక్తివంతుడైన ట్రంప్ ను ప్రశ్నించటమే పెద్ద సాహసం. అలాంటి సాహసాన్ని ఇప్పటికే పూర్తి చేసిన మోడీ.. ట్రంప్ తెంపరితాన్ని.. భారత్ పట్ల ఆయన కక్కుతున్న వ్యతిరేక విషాన్ని సరైన రీతిలో నిలువరిస్తూ.. కొత్త జట్టు కట్టే దిశగా అడుగులు వేయటం.. అదే సమయంలో తాను చేస్తున్నది గొప్ప పనో.. అమెరికాకు వ్యతిరేకమనో అన్నట్లు కాకుండా.. ట్రంప్ తీరును..అతగాడి అహంకారాన్ని ప్రశ్నించే ధోరణి.. ప్రపంచానికి కొత్త హీరో అన్న ఇమేజ్ ను మోడీకి తెచ్చి పెడుతుందని మాత్రం చెప్పకతప్పదు.
