లొంగము.. ఆధారపడం.. ఎర్రకోటపై చైనా, పాకిస్తాన్, అమెరికా కు ఇచ్చిపడేసిన మోడీ
దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి.
By: A.N.Kumar | 15 Aug 2026 9:31 AM ISTదేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. భారత రాజధాని దిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి.. జాతిని ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. జెండా ఆవిష్కరణ సమయాన భారత వాయుసేనకు చెందిన హెలికాప్టర్లు కురిపించిన పూలవర్షం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలకంటే ముందు ప్రధాని రాజ్‌ఘాట్ చేరుకుని మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఎర్రకోట వద్ద త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన ప్రధాని, వేడుకలను అధికారికంగా ప్రారంభించారు.
ఎర్రకోట సాక్షిగా దేశ భవిష్యత్ ప్రగతికి, వికసిత్ భారత్ సంకల్పానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఇకపై ఏ ఇతర దేశంపై ఆధారపడే ప్రసక్తే లేదని, ప్రపంచంలో స్వయం సమృద్ధి సాధించడమే మన ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి భారతీయుడి హృదయంలో వందేమాతరం మార్మోగుతోందని, సరికొత్త సంకల్పాలతో, అపరిమితమైన ఉత్సాహంతో దేశం ముందుకు సాగుతోందని అన్నారు. స్వాతంత్ర్యం అనేది ఎందరో వీరుల త్యాగాల ఫలితమని గుర్తుచేస్తూ, దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎర్రకోట వేడుకల్లో వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఆలపించినట్లు తెలిపారు.
2047 నాటికి వికసిత్ భారత్..
భారత్ ఇకపై చిన్న చిన్న లక్ష్యాలతో ముందుకు వెళ్లే పరిస్థితి లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 140 కోట్ల మంది భారతీయులు తమ ఆలోచనా పరిధిని విస్తృతం చేసుకుని, ఉన్నత ఆశయాలను నిర్దేశించుకోవాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలు జరుపుకొనే నాటికి భారత్‌ను సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా.. వికసిత్ భారత్‌గా అవతరింపజేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, అతిపెద్ద ఆర్థిక శక్తులలో ఒకటిగా ఎదిగే దిశగా వేగంగా పయనిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు ఎంతో ఆశగా.. గౌరవంగా చూస్తున్నాయని అన్నారు.
సెమీకండక్టర్ రంగంపై ప్రత్యేక దృష్టి
భవిష్యత్తు డిజిటల్ , టెక్నాలజీ ప్రపంచంలో సెమీకండక్టర్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాని వివరించారు. ఈ ఆధునిక చిప్‌ల ప్రాధాన్యతను భారత్ సరిగ్గా అర్థం చేసుకుందని.. అందులో భాగంగానే దేశంలో మూడు సెమీకండక్టర్ ప్లాంట్ల ఏర్పాటుకు ఇప్పటికే వేగంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సమీప భవిష్యత్తులో మరిన్ని ప్లాంట్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. టెక్నాలజీ, తయారీ రంగాల్లో సంపూర్ణ స్వయం సమృద్ధి సాధించడం ద్వారా ప్రపంచ సరఫరా వ్యవస్థలో భారత్ కీలక నిలయంగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు..
గత కొన్నేళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలితంగా సుమారు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధాని మోదీ తెలిపారు. పేదరిక నిర్మూలనతో పాటు దేశ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని చెప్పారు. స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులను భారతీయులు ప్రోత్సహించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ‘వోకల్ ఫర్ లోకల్’ స్ఫూర్తితో దేశీయ ఉత్పత్తులకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.
ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో సంభవించిన ప్రకృతి విపత్తుల వల్ల తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలను ఓదారుస్తూ బాధితులకు యావత్ భారతదేశం అండగా నిలుస్తుందని ప్రధాని భరోసా ఇచ్చారు. 140 కోట్ల మంది భారతీయుల దృఢ సంకల్పాన్ని, దేశ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. సాంకేతిక పురోగతి, ఆర్థిక వ్యవస్థ బలోపేతం, దేశ ప్రజల సమైక్యతతో భారత్ భవిష్యత్తులో ప్రపంచ పటంలో 'వికసిత్ భారత్'గా అత్యున్నత శిఖరాలకు చేరుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు.
