Begin typing your search above and press return to search.

బంగారం కొనుగోళ్లు ఆపాడు.. మోడీ సాధించాడు..

తాను గతంలో ఇచ్చిన పిలుపునకు దేశ ప్రజలు సానుకూలంగా స్పందించారని, ఫలితంగా గతంతో పోలిస్తే బంగారం కొనుగోళ్లు తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.

By:  A.N.Kumar   |   28 Jun 2026 2:52 PM IST
బంగారం కొనుగోళ్లు ఆపాడు.. మోడీ సాధించాడు..
X

దేశంలో బంగారం కొనుగోళ్లు తగ్గడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం ప్రసారమైన తన రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' లో ఆయన మాట్లాడుతూ.. తాను గతంలో ఇచ్చిన పిలుపునకు దేశ ప్రజలు సానుకూలంగా స్పందించారని, ఫలితంగా గతంతో పోలిస్తే బంగారం కొనుగోళ్లు తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.

ఆర్థిక భద్రత.. పెట్టుబడులపై అవగాహన

బంగారంపై విపరీతంగా ఖర్చు చేయడం కంటే.. దేశాభివృద్ధికి, కుటుంబ ఆర్థిక భద్రతకు ఉపయోగపడే ఇతర పొదుపు, పెట్టుబడి మార్గాల వైపు ప్రజలు దృష్టి సారించాలని ప్రధాని సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమని ఆయన పేర్కొన్నారు. కేవలం బంగారంపైనే ఆధారపడకుండా కుటుంబాల భవిష్యత్తు కోసం విభిన్న పెట్టుబడి మార్గాలను పరిశీలించాలని కోరారు. ప్రజల్లో ఈ రకమైన ఆర్థిక అవగాహన పెరగడం శుభపరిణామమన్నారు.

క్రీడలే కెరీర్.. నాగాలాండ్ చిన్నారులపై ప్రశంసలు

యువతను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ.. క్రీడలను కేవలం వినోదంగా మాత్రమే కాకుండా ఒక అద్భుతమైన కెరీర్ అవకాశంగా ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. కష్టపడి సాధన చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గొప్ప విజయాలు సాధించవచ్చని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నాగాలాండ్‌లో నిర్వహిస్తున్న చిన్నారుల ఫుట్‌బాల్ లీగ్‌ను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. గ్రామీణ ప్రాంతాల్లో దాగున్న క్రీడా ప్రతిభ వెలుగులోకి రావడం అభినందనీయమన్నారు.

పర్యావరణ పరిరక్షణ.. పక్షుల సంరక్షణ మన బాధ్యత

నగరాల్లో పెరుగుతున్న కాలుష్యంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ చిన్న చిన్న మార్పులు చేసుకోవాలని సూచించారు. "నగరాల్లో ద్విచక్రవాహనాలు, కార్ల వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించి.. ప్రజా రవాణా, సైకిళ్లు, లేదా నడక వంటి పర్యావరణహిత మార్గాలను అలవాటు చేసుకోవాలి. దీనివల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది." అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

అలాగే ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో పక్షుల పాత్ర ఎంతో కీలకమని, వాటి సంరక్షణకు ప్రతి పౌరుడు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రకృతిని రక్షించడం మన బాధ్యతని.. మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాలే దేశ భవిష్యత్తుపై గొప్ప ప్రభావం చూపుతాయని ప్రధాని మోదీ తన ప్రసంగంలో స్పష్టం చేశారు.