ప్రధాని మోదీ 'యాంగ్రీ అంకుల్స్' దాడి వెనుక కారణమేంటి?
ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశ అభివృద్ధికి అడ్డుపడే విమర్శకులపై తనదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు
By: A.N.Kumar | 7 Sept 2026 7:51 AM ISTన్యూఢిల్లీ వేదికగా శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశ అభివృద్ధికి అడ్డుపడే విమర్శకులపై తనదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ప్రతీ కొత్త ఆలోచనను.. సత్సంకల్పాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకునే కొంతమందిని ఆయన సరదాగా ‘యాంగ్రీ అంకుల్స్’ లేదా ‘నారాజ్ ఫూఫా’ అని అభివర్ణించారు. దేశంలో ఏ చిన్న కొత్త ప్రాజెక్టు ప్రారంభమైనా.. ఏ పెద్ద సంస్కరణ వచ్చినా.. ఇలాంటి మనస్తత్వం ఉన్నవారు వెంటనే ముఖం ముడుచుకుని అసంతృప్తి వ్యక్తం చేయడం అలవాటుగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా "ఇది మనకు ఇప్పుడు నిజంగా అవసరమా?" అనే ఒక్కటే ప్రశ్నను వీరు పదే పదే వేస్తుంటారని మోదీ విమర్శించారు.
గతంలో దేశంలో చేపట్టిన అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను ఉదాహరణగా చూపిస్తూ ఈ యాంగ్రీ అంకుల్స్ మనస్తత్వాన్ని ప్రధాని ఎండగట్టారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' నిర్మిస్తున్నప్పుడు.. దేశంలో హైస్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులు ప్రారంభించినప్పుడు.. లేదా డిజిటల్ విప్లవానికి బాటలు వేసిన యూపీఐ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు కూడా ఈ వర్గం నుంచి తీవ్ర ప్రతికూల వ్యాఖ్యలు వచ్చాయని గుర్తుచేశారు. చివరికి సెమీకండక్టర్ రంగానికి శ్రీకారం చుట్టినా నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించినా వీరు వ్యతిరేకిస్తూనే ఉన్నారని అన్నారు. అయితే ఇలాంటి విమర్శలు.. అనుమానాలు ఎన్ని ఎదురైనప్పటికీ భారత పురోగతి ఏనాడూ ఆగలేదని.. నాడు వ్యతిరేకించిన ఆ ప్రాజెక్టులే నేడు దేశ ఆర్థిక, సాంకేతిక వ్యవస్థలకు వెన్నుముకగా మారాయని గర్వంగా ప్రకటించారు.
తన ప్రసంగంలో 2013 నాటి భారత పరిస్థితులను నేటి స్థాయితో పోల్చి చూపిన ప్రధాని.. నాటి పాలనా లోపాలు, ఆర్థిక అస్థిరత నుంచి నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపాంతరం చెందిందని చెప్పారు. 2013తో పోలిస్తే ప్రస్తుతం దేశం ఆర్థికంగానే కాకుండా సామాజికంగా.. అంతర్జాతీయంగా ఎంతో దృఢమైన స్థానంలో ఉందని స్పష్టం చేశారు.
చివరగా యువతకు దిశానిర్దేశం చేస్తూ.. ఇలాంటి నెగెటివిటీని పట్టించుకోకుండా తమ దృష్టిని పెద్ద లక్ష్యాల వైపు మళ్లించాలని పిలుపునిచ్చారు. కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారిగా మిగిలిపోకుండా.. కొత్త ఆవిష్కరణలు చేస్తూ వేలాది మందికి ఉపాధి కల్పించే 'ఉద్యోగ ప్రదాతలు'గా మారాలని ఆకాంక్షించారు. మాటలతో కన్నా తాము సాధించిన ఫలితాలతోనే విమర్శకులకు సమాధానం చెప్పాలని, 'వికసిత భారత్' కల నెరవేర్చడంలో జెన్ జీ తరం అత్యంత కీలక పాత్ర పోషించాలని ప్రధాని ఉద్బోధించారు.
