క్వాడ్ శిఖరాగ్రానికి భారత్ కు ట్రంప్ రానట్టే?
ఇటీవల రష్యా ఆయిల్ కొనుగోలు సాకుతో భారత్‌పై భారీగా టారిఫ్‌ల భారం మోపడం, ఆ సమస్యపై చర్చలు ఎక్కడా కొలిక్కి రాకపోవడం… సంబంధాలు మరింత దిగజారడానికి కారణమయ్యాయి.
By: A.N.Kumar | 1 Sept 2025 12:20 AM ISTభారత్–అమెరికా సంబంధాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఈ ఏడాది చివర్లో భారత్ ఆతిథ్యమిచ్చే క్వాడ్ శిఖరాగ్ర సమావేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యే అవకాశాలు లేవని న్యూయార్క్ టైమ్స్ విశ్లేషించింది. ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, భారత్ దేశాధినేతలు పాల్గొనే ఈ సమావేశం నవంబర్‌లో జరగనుంది. అయితే, అమెరికా–భారత్ అధికార వర్గాలు మాత్రం ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
- మోదీ–ట్రంప్ సంబంధాల క్షీణత
ఇటీవల నెలలుగా ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ మధ్య సంబంధాలు సరిగా లేవన్నది ఆ పత్రిక వ్యాఖ్య. భారత్–పాకిస్తాన్‌ల మధ్య నాలుగు రోజులపాటు కొనసాగిన ఉద్రిక్తత తన జోక్యంతోనే ముగిసిందని ట్రంప్ పదేపదే చెప్పుకోవడం, భారత్ మాత్రం దీనిని ఖండించడం… ఇద్దరి మధ్య విభేదాలను మరింత పెంచిందని విశ్లేషించింది.
అలాగే పాకిస్తాన్ తనను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం చూసి, భారత్ కూడా అలా చేస్తుందేమోనని ట్రంప్ ఆశించినా, అది జరగకపోవడం ఆయనను నిరాశకు గురిచేసిందని పేర్కొంది. ఈ అంశం కూడా ఇద్దరి మధ్య అంతరాన్ని పెంచిందని చెప్పింది.
- టారిఫ్‌ల వివాదం
ఇటీవల రష్యా ఆయిల్ కొనుగోలు సాకుతో భారత్‌పై భారీగా టారిఫ్‌ల భారం మోపడం, ఆ సమస్యపై చర్చలు ఎక్కడా కొలిక్కి రాకపోవడం… సంబంధాలు మరింత దిగజారడానికి కారణమయ్యాయి. పలు మార్లు ట్రంప్ స్వయంగా మోదీకి ఫోన్ చేసినా, స్పందన రాకపోవడం వలన అమెరికా వైపు అసహనం పెరిగిందని ఆ కథనం పేర్కొంది.
ట్రంప్–మోదీ సంబంధాలు కేవలం రష్యా ఆయిల్ కొనుగోలుతోనే దెబ్బతిన్నవి కావని, అంతకుమించిన అనేక అంశాలు నేపథ్యంలో ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. క్వాడ్ వంటి కీలక వేదికలో ట్రంప్ గైర్హాజరీ కూడా ఆ ఉద్రిక్తతలకు సంకేతంగా పరిగణిస్తున్నారు.
మొత్తానికి, భారత్–అమెరికా సంబంధాలు కొత్త దశలోకి వెళ్తున్నాయి. మోదీ–ట్రంప్ మధ్య పెరిగిన విభేదాలు రాబోయే అంతర్జాతీయ వేదికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
