Begin typing your search above and press return to search.

హలో ట్రంప్....హలో మోడీ...ఇదే నిజం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నడూ లేనంత బలవంతుడిగా ప్రపంచం ముందు కనిపిస్తున్నారు.

By:  Raja Ch   |   10 Jan 2026 9:46 AM IST
హలో ట్రంప్....హలో మోడీ...ఇదే నిజం
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నడూ లేనంత బలవంతుడిగా ప్రపంచం ముందు కనిపిస్తున్నారు. దానికి కారణం తాజాగా ఆయన వెనిజులా మీద సైనిక దాడి చేసి మరీ అధ్యక్షుడు నికొలస్ మదురోని పట్టి తెచ్చి తమ న్యూయార్క్ కోర్టు ముందు నిలబెట్టడం. ఆ మీదట ట్రంప్ దూకుడు వేరే లెవెల్ లో ఉంది అన్నది విశ్లేషణ. ఇదిలా ఉంటే అమెరికాతో వాణిజ్య ఒప్పందాలకు భారత్ నుంచి సరైన స్పందన రాలేదని ఆ దేశం తాజాగా ఒక ఘాటు విమర్శ చేసింది. అయితే దానికి భారత్ నుంచి ధీటైన జవాబే వచ్చింది. ఒకటి కాదు ఏకంగా ఎనిమిది సార్లు మోడీ ట్రంప్ ల మధ్య ఫోన్ సంభాషణలు జరిగాయని భారత్ చెబుతోంది.

ఇద్దరూ మాట్లాడుకున్నారు :

ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. విస్తృత భాగస్వామ్యం కోసం ఇరు దేశాల్ అమధ్య వివిధ అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత సంవత్సరం ఎనిమిది సార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నారని ఆయన నొక్కి చెబుతున్నారు. అంతా మామూలుగానే ఉందని కూడా ఆయన అంటున్నారు. పరస్పరం ఆధారితంగా ఉండే రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య ఉభయ ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందంపై భారతదేశం అమెరికా ఆసక్తితో ఉన్నాయని ఆయన అంటున్నారు. దానిని పూర్తి చేయడానికి ఇరు దేశాలూ ఎదురుచూస్తున్నాయని ఆయన అంటున్నారు.

ఏడాది క్రితమే డీల్ :

ఇదిలా ఉంటే గత సంవత్సరం ఫిబ్రవరి 13 నాటికే అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరపడానికి భారతదేశం అమెరికా కట్టుబడి ఉన్నాయని రణధీర్ జైస్వాల్ చెప్పడం విశేషం. సమతుల్యమైన పరస్పరం ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందానికి రావడానికి ఇరుపక్షాలు అనేక రౌండ్ల చర్చలు సైతం జరిపాయని ఆయన గుర్తు చేస్తున్నారు. ఇక రెండు దేశాలు చాలా సందర్భాలలో ఒప్పందానికి దగ్గరగా వచ్చాయని ఆయన తెలియజేశారు. అమెరికా వాణిజ్య కార్యదర్శి ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రణధీర్ జైస్వాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

చర్చలే పరిష్కారం :

ప్రపంచంలో అనేక సమస్యలకు చర్చలే పరిష్కారం అన్నది భారత్ విధానంగా రణధీర్ జైస్వాల్ చెప్పుకొచ్చారు. వివిధ అంతర్జాతీయ సంస్థలు ఐక్యరాజ్యసమితి సంస్థల నుండి వైదొలగుతున్నట్లు యునైటెడ్ స్టేట్స్ చేసిన ప్రకటనపై ఆయన ఈ విధంగా స్పందించారు. భారతదేశం అందరితో చర్చలకు అన్ని అభిప్రాయాలను మధింపు చేసి మంచి పరిష్కారానికి కట్టుబడి ఉందని చెప్పారు. ప్రపంచ సమస్యలకు అన్ని దేశాల సంప్రదింపులు సహకార చర్యలు అవసరమని భారత్ విశ్వసిస్తుందని రణధీర్ జైస్వాల్ అంటున్నారు. ఈ విషయంలో భారతదేశం తన లక్ష్యాలను ముందుకు తీసుకువెళుతుందని ఆయన అన్నారు.

అమెరికా అధిక సుంకాలు :

మరో వైపు చూస్తే రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై అధిక సుంకాలు విధించాలని ప్రతిపాదిస్తున్న అమెరికా కాంగ్రెస్ బిల్లుపై భారత్ నిశితంగా గమనిస్తోందని రణధీర్ జైస్వాల్ చెప్పారు. ఇంధన వనరుల సేకరణ విషయంలో భారతదేశ వైఖరి అందరికీ తెలిసిందేనని ఆయన పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచ మార్కెట్‌లోని మారుతున్న పరిస్థితులను గమనంలోకి తీసుకుంటూ దానికి అనుగుణంగా తన ఆలోచనలను చేస్తుందని అన్నాఉర్. ఇక 140 కోట్ల మంది దేశ ప్రజల ఇంధన భద్రతా అవసరాలను తీర్చడానికి విభిన్న వనరుల నుండి సరసమైన ఇంధనాన్ని పొందే అవసరం హక్కూ రెండూ భారత్ కి ఉన్నాయని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేయడం విశేషం.