జీ7 సదస్సులో మోదీ-ట్రంప్ భేటీ.. 16 నెలల తర్వాత ముఖాముఖి సమావేశం
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. 2025 ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌లో వీరిద్దరూ చివరిసారిగా సమావేశమయ్యారు.
By: A.N.Kumar | 16 Jun 2026 11:18 PM ISTఅంతర్జాతీయ రాజకీయ వేదికపై ఒక ఆసక్తికరమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఫ్రాన్స్‌లోని ఎవియాన్ నగరంలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక జీ7 శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖాముఖి తారసపడ్డారు. దాదాపు 16 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఇరు దేశాల అధినేతలు ప్రత్యక్షంగా కలుసుకోవడం ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
సదస్సు ప్రాంగణంలో ఇరువురు నేతలు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. పరస్పరం కరచాలనం ఇచ్చుకుని.. కొద్దిసేపు నవ్వుతూ ముచ్చటించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ భుజాన్ని అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు ఆప్యాయంగా తట్టడం అక్కడ ఉన్నవారందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
16 నెలల తర్వాత తొలి భేటీ
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. 2025 ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌లో వీరిద్దరూ చివరిసారిగా సమావేశమయ్యారు. ఆ భేటీ జరిగిన 16 నెలల తర్వాత ఇరు నేతలు మళ్లీ ఇప్పుడే ప్రత్యక్షంగా కలుసుకున్నారు. జీ7 సదస్సు నేపథ్యంలో బుధవారం రోజున మోదీ, ట్రంప్‌ల మధ్య అధికారిక ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. ఈ హైప్రొఫైల్ సమావేశంలో భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యపరమైన సవాళ్లు, ఇండో-పసిఫిక్ వ్యూహం, ప్రాంతీయ భద్రత వంటి అత్యంత కీలకమైన అంశాలపై ఇరు దేశాల అధినేతలు చర్చించనున్నారు.
ఉద్రిక్తతల నుంచి తిరిగి సాధారణ స్థితికి..
గత కొన్ని నెలలుగా భారత్-అమెరికా సంబంధాల మధ్య కొంత ఒడిదొడుకులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా భారతదేశంపై అమెరికా ప్రభుత్వం కొన్ని అదనపు సుంకాలు విధించడం.. అలాగే భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇరు దేశాల దౌత్య సంబంధాలలో కొంత అసౌకర్యాన్ని ఉత్కంఠను కలిగించాయి.
అయితే గత నెలలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో భారతదేశంలో పర్యటించిన తర్వాత పరిస్థితులు వేగంగా మారాయి. ద్వైపాక్షిక సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ పర్యటనలో రుబియో, ప్రధాని మోదీతో సమావేశమై.. అధ్యక్షుడు ట్రంప్ తరఫున త్వరలోనే వైట్‌హౌస్‌ను సందర్శించాల్సిందిగా మోదీకి ఆహ్వానం కూడా పలికారు. అంతేకాకుండా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా వ్యూహానికి భారతదేశాన్ని ఒక "మూల స్తంభం"గా రుబియో అభివర్ణించడం రెండు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక బంధాన్ని మరోసారి చాటిచెప్పింది.
ప్రధాని మోదీ స్పందన
"జీ7 సదస్సులో భాగంగా ప్రపంచ నాయకులతో కలిసి కీలక అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరపనున్నాం. సదస్సు వేదికగా పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరగనున్నాయి.’’ అని మోదీ తెలిపారు.
ప్రపంచ రాజకీయాల్లో అత్యంత కీలకం
ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ జీ7 సదస్సు, అందులోనూ మోదీ-ట్రంప్ భేటీ ప్రపంచ రాజకీయ వర్గాల్లో విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అత్యంత పాత ప్రజాస్వామ్య దేశాల అధినేతలు భేటీ కానుండటంతో బుధవారం జరగబోయే ద్వైపాక్షిక చర్చలపై ప్రపంచ దేశాల కళ్లు కాబోతున్నాయి. ఈ సమావేశం ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య, రక్షణ బంధాలు మరింత బలోపేతం అవుతాయని నిపుణులు భావిస్తున్నారు.
