ఎన్నికల ఎఫెక్ట్: మోడీ సంక్రాంతి ఎలా చేశారో తెలుసా?
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పైకి కనిపించరు కానీ.. ఆయన నిఖార్సయిన ఎన్నికల వ్యూహకర్త అనడంలో ఎలాంటి సందేహం లేదు.
By: Garuda Media | 15 Jan 2026 12:59 AM ISTప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పైకి కనిపించరు కానీ.. ఆయన నిఖార్సయిన ఎన్నికల వ్యూహకర్త అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే.. ఎక్కడ ఎన్నికలు ఉన్నా.. ఆయన దానికి అనుగుణంగా వ్యవహరిస్తారు. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకు నేందుకు ఆయన అస్సలు ఇష్టపడరు. ఈక్రమంలో తాజాగా తమిళనాడులో ఈ ఏడాది ఏప్రిల్-మే మధ్య ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని తాజాగా సంక్రాంతి పర్వదినాన్ని అచ్చంగా తమిళనాడు సంప్రదాయంలో నిర్వహించారు. గత ఏడాది ఢిల్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఉత్తరాది సంప్రదాయంలో(లోహ్రీ అంటారు) సంక్రాంతి వేడుకలు నిర్వహించారు.
తాజాగా తమిళనాడు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయన అచ్చంగా కట్టుబొట్టు నుంచి పండుగ నిర్వహణ వరకు అంతా తమిళ నాడు సంప్రదాయంలోనే నిర్వహించడం విశేషం. అంతేకాదు.. ఢిల్లీలో.. తమిళనాడుకే చెందిన కేంద్ర మంత్రి ఎల్. మురగన్ నివాసంలో ఈ వేడుకలు నిర్వహించడంమరో విశేషం. అంతేకాదు.. తమిళనాడుకే చెందిన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. ఇక, భోగిని పురస్కరించుకుని తమిళులు ఏతరహాలో అయితే.. పొంగళ్లు వండి ప్రసాదాలుగా స్వీకరిస్తారో.. అచ్చంగా ప్రధాని అలానే చేశారు. కట్టెల పొయ్యిని రాజేసినది మొదలు పొంగలి వండే వరకు అంతా తమిళనాడు సంప్రదాయాన్నే పాటించారు.
ఇక, తన ప్రసంగంలోనూ ప్రధాన మంత్రి తమిళనాడునే ఎక్కువగా కీర్తించారు. దేశంలో వ్యవసాయాన్ని మరింత స్థిరంగా, పర్యావరణానికి అనుకూలంగా మార్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని తెలిపారు. వ్యవసాయ రంగంలో విప్లవాన్ని తీసుకురావడానికి తమిళ యువత కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గత ఏడాది తాను తమిళనాడులో జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరైనట్లు గుర్తు చేసుకున్నారు. వెయ్యి సంవత్సరాల పురాతనమైన గంగైకొండ చోళపురం ఆలయ సందర్శన, పంబన్ వంతెన ప్రారంభోత్సవ సమయాల్లో తమిళుల చరిత్ర గొప్పతనాన్ని తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇలా.. మొత్తంగా తమిళనాడు గురించే.. ఆయన ప్రస్తావించడం గమనార్హం. అంతేకాదు.. తమిళనాడులో నిర్మించిన పరాశక్తి మూవీ బృందాన్ని కూడా ఈ వేడుకలకు ప్రత్యేకంగా ఆహ్వానించడం.. మరో విశేషం. మొత్తగా.. ఈ వేడుకలను తమిళనాడు చుట్టూ తిప్పేశారు. వచ్చే ఏప్రిల్-మే నెల మధ్య తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఏ చిన్న అవకాశాన్నీ ప్రధాని వదులుకోకపోవడం గమనార్హం. మరి దీనిని తమిళ ప్రజలు ఎలా చూస్తారో చూడాలి.
