“ధురంధర్ కాకపోయినా.. ధూమ్ మచాయీ హై”.. పాకిస్తాన్ కు మోడీ మాస్ వార్నింగ్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాల్లో రాజకీయ సందేశంతో పాటు సందర్భానికి తగ్గ భాష, యువతకు కనెక్ట్ అయ్యే పదజాలం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది.
By: A.N.Kumar | 6 Sept 2026 9:50 AM ISTప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాల్లో రాజకీయ సందేశంతో పాటు సందర్భానికి తగ్గ భాష, యువతకు కనెక్ట్ అయ్యే పదజాలం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. తాజాగా శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (ఎస్‌ఆర్‌సీసీ) శతాబ్ది వేడుకల్లో ఆయన చేసిన ప్రసంగం కూడా ఇదే తరహాలో సాగింది. ఒకవైపు కాలేజీ పూర్వ విద్యార్థుల ఘనతను ప్రస్తావిస్తూ.. మరోవైపు 2013లో తాను చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకుంటూ.. చివర్లో పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక చేయడం ద్వారా మోదీ తన ప్రసంగాన్ని పలు కోణాల్లో మలిచారు.
ప్రసంగంలో యువతను ఆకట్టుకునేలా మోదీ ఉపయోగించిన “ధురంధర్ కాకపోయినా.. ధూమ్ మచాయీ హై” అనే వ్యాఖ్య ప్రత్యేకంగా నిలిచింది. ఎస్‌ఆర్‌సీసీ పూర్వ విద్యార్థులు వివిధ రంగాల్లో సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ.. తనదైన శైలిలో వారిని అభినందించారు. ఈ కాలేజీ నుంచి ఆర్థికవేత్తలు మాత్రమే కాకుండా కళాకారులు, రాజకీయ నాయకులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు వంటి అనేక రంగాలకు చెందిన ప్రముఖులు వెలుగులోకి వచ్చారని చెప్పారు.
అరుణ్ జైట్లీ నుంచి సంజీవ్ సన్యాల్ వరకు..
ఎస్‌ఆర్‌సీసీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న మోదీ.. మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని ప్రత్యేకంగా ప్రస్తావించారు. జైట్లీ ఎస్‌ఆర్‌సీసీలో చదువుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనతో జరిగిన సమావేశాల్లో కాలేజీ రోజుల నాటి సంఘటనలు తరచూ ప్రస్తావనకు వచ్చేవని చెప్పారు. ఒకే సంఘటనను ఆయన పదేపదే చెప్పేవారని సరదాగా వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం తన బృందంలో ఉన్న సంజీవ్ సన్యాల్ కూడా ఎస్‌ఆర్‌సీసీ పూర్వ విద్యార్థేనని మోదీ పేర్కొన్నారు. ఇలా వ్యక్తిగత జ్ఞాపకాలను ప్రస్తావించడం ద్వారా ప్రసంగాన్ని కేవలం రాజకీయ ఉపన్యాసంగా కాకుండా.. కాలేజీ జ్ఞాపకాలు, విద్యార్థుల భవిష్యత్తు, దేశ ప్రగతి వంటి అంశాలతో ముడిపెట్టారు.
2013 ప్రసంగం.. మళ్లీ ఎందుకు గుర్తు చేశారు?
మోదీ ప్రసంగంలో మరో కీలక అంశం 2013 నాటి ఎస్‌ఆర్‌సీసీ పర్యటన. అప్పట్లో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలో భాగంగా ఉన్నానని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ.. తాను ఆ వేదికను రాజకీయ విమర్శల కోసం ఉపయోగించకుండా ఒక దార్శనికతను వివరించానని చెప్పారు.
ఆ ప్రసంగం అప్పట్లో ఒక అలను సృష్టించిందని దాదాపు 13-14 ఏళ్ల తర్వాత కూడా దాని ప్రభావం గురించి చర్చ జరుగుతోందని మోదీ వ్యాఖ్యానించారు. అప్పటి పరిస్థితులను అర్థం చేసుకోవాలంటే ఆ కాలం నాటి వార్తలను ఇంటర్నెట్‌లో పరిశీలించాలని యువతకు సూచించారు.
అసలు హీట్ ఇక్కడే.. పాక్‌కు మోదీ వార్నింగ్
ప్రసంగం చివరి భాగంలో మోదీ జాతీయ భద్రత అంశాన్ని ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులకు భారత సాయుధ దళాలు తగిన సమాధానం ఇస్తున్నాయని అన్నారు. పాకిస్థాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే భారత బలగాలు వారి భూభాగంలోకి వారి ఇళ్లలోకి ప్రవేశించి చంపేస్తామని సందేశాన్ని స్పష్టంగా వినిపించారు. అదే సమయంలో జమ్మూకశ్మీర్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు శాంతి విస్తరిస్తోందని, మావోయిస్టు ఉగ్రవాదం, నక్సలిజంపై భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని పేర్కొన్నారు.
మొత్తంగా చూస్తే.. ఎస్‌ఆర్‌సీసీ శతాబ్ది వేడుకల వేదికగా సాగిన మోదీ ప్రసంగం కాలేజీ వారసత్వం, 2013 జ్ఞాపకాలు, యువతతో కనెక్ట్ అయ్యే భాష, దేశ ప్రగతి, జాతీయ భద్రత వంటి అంశాలను ఒకే కథనంలో కలిపింది. “ధూమ్ మచాయీ హై” అంటూ యువతను నవ్వించిన అదే ప్రసంగం.. పాకిస్థాన్‌కు “దుస్సాహసం చేస్తే ఇళ్లలోకి చొరబడి చంపేస్తాం” అనే గంభీరమైన రాజకీయ సందేశంతో ముగిసింది. ఇదే ఈ ప్రసంగానికి ప్రత్యేకతగా మారింది.
