మోడీ ఇచ్చిన కానుకల వెనుక 'బిజినెస్' యాంగిల్!
ఆసియాన్ సదస్సులో పాల్గొన్న ప్రపంచ దేశాధినేతలకు ప్రధాని మోదీ భారతీయ హస్తకళలు, చేనేత వస్తువులను కానుకలుగా అందించారు. ట్రంప్‌కు గోల్డెన్ పిచ్వాయి పెయింటింగ్, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడికి కశ్మీరీ సిల్క్ కార్పెట్, జపాన్ ప్రధానికి బనారసీ సిల్క్ స్టోల్, ఆస్ట్రేలియా ప్రధానికి బ్లూ పాటరీ కళాఖండం ఇచ్చారు. స్వదేశీ కళాకారులు, స్థానిక పరిశ్రమలకు అంతర్జాతీయ గుర్తింపు కల్పించడమే ఈ కానుకల ఉద్దేశమని కథనం పేర్కొంది.
By: Garuda Media | 19 Nov 2026 8:45 AM ISTఆసియాన్ సదస్సులో పాల్గొనేందుకు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాకు వెళ్లిన ప్రధాన మంత్రి.. ఈ సదస్సుకు వచ్చిన ప్రపంచ దేశాధి నేతలకు పలు కానుకలు అందించారు. అయితే.. వీటి వివరాలను మాత్రం చాలా ఆలస్యంగా వెల్లడించడం గమనార్హం. ముఖ్యంగా వాటి ప్రత్యేకతలు.. కారణాల విషయంలో గోప్యత పాటించారని తెలిసింది. ఏదేమైనా..భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని, హస్తకళలను ప్రతిబింబించేలా ప్రపంచ నేతలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక కానుకలను అందించడం గమనార్హం. అయితే.. ఇలా ఏ దేశాధినేత కూడా ఇతర దేశాలకు వెళ్లినప్పుడు కానుకలు ఇచ్చిన, ఇస్తున్న సంప్రదాయాలు తక్కువగా ఉన్నాయి. కానీ, ప్రధాని మోడీ 2020 నుంచి ఈ సంప్రదాయాన్ని గట్టిగా అమలు చేస్తున్నారు. దీనికి కారణం.. స్వదేశీ పరిశ్రమలు, భారత దేశ వస్తు ఉత్పత్తిని ప్రమోట్ చేయడమేనని అంటున్నారు పరిశీలకులు.
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులను బహుమతులుగా ఇవ్వడం ద్వారా, ఆయా ప్రాంతాల కళాకారులకు, స్థానిక పరిశ్రమలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది. అంతేకాదు.. ఎగుమతులు కూడా పెరుగుతాయి. ప్రధాని ఇచ్చే బహుమతులు సాధారణంగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక హస్తకళలు, చేనేత వస్త్రాలు, పెయింటింగ్‌లు, పురాతన కళాఖండాలుగా ఉంటాయి. దీనివల్ల మన దేశపు గొప్ప వారసత్వం, కళాకారుల నైపుణ్యం ప్రపంచానికి పరిచయం అవుతాయి. తద్వారా దేశీయ కళాకారులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు.
ఎవరెవరికి ఏయే కానుక..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు.. రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాకు చెందిన గోల్డెన్ పిచ్వాయి పెయింటింగ్ ను అందించారు. సహజంగా ఈ పెయింట్‌కు అంతర్జాతీయ మార్కెట్లలో కోట్ల రూపాయల విలువ ఉంది. అయితే.. ట్రంప్ కోసం మరింత విభిన్నంగాదీనిని రూపొందించారని అధికారులు తెలిపారు.
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్టినాండ్ మార్కోస్ జూనియర్‌కు సాంప్రదాయ కశ్మీరీ సిల్క్ కార్పెట్ బహూకరించారు. ఆయన సతీమణికి పపియర్ మాచే బాక్స్‌లో ఉంచిన పశ్మినా షాల్ ను కానుకగా ఇచ్చారు. ఇది కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో పేరెన్నికగన్న వస్తువుగా గుర్తింపు పొందింది.
జపాన్ ప్రధాని తకయిచికి సాదేలి పెట్టెలో ఉంచిన రాయల్ బ్లూ బనారసీ కటాన్ సిల్క్ స్టోల్‌ను ప్రధాని ఇచ్చారు. సహజంగా తకయిచి.. చీరలు ధరించరు. సంప్రదాయ డ్రస్సులను మాత్రమే ధరిస్తారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆమెకు నచ్చిన డ్రస్సును బహూకరించడం గమనార్హం.
ఆస్ట్రేలియా ప్రధాని అంథోనీ అల్బనీస్ కు.. జైపూర్ బ్లూ పాటర్ కళాఖండాన్ని ప్రధాని ఇచ్చారు. ఇది పూర్తిగా స్థానిక కళాకారులు చేతితో రూపొందించిందని ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది.
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియంటో కు చోళ కాలం నాటి కాంస్య శిల్పం బహూకరించారు. దీనికి కూడా చాలా ప్రత్యేకత ఉంది. చోళుల కాలానికి.. ఇండోనేషియాకు మధ్య ఉన్న అనుబంధాన్ని సూచించేలా ఇది ఉందని పేర్కొన్నారు. చోళుల కాలంలో అనేక వస్తువులు ఇండోనేషియాకు ఎగుమతి చేసేవారు.
కంబోడియా ప్రధాని హన్ మానేట్ కు ధోక్రా ఆర్ట్‌వర్క్ బోట్ ను బహూకరించారు. ఇది పడవ ఆకృతితో ఆకట్టుకునేలా ఉంటుంది. అలానే.. మయన్మార్, బ్రూనై నేతలకు.. బిద్రీవేర్ సిల్వర్ ఇన్‌లే వాజులను ప్రధాని కానుకలుగా ఇచ్చారు.
