మోడీ ఆర్ఎస్ఎస్ కి భయపడ్డారా ?
బీజేపీకి కర్త కర్మ క్రియ ఇవన్నీ ఆర్ ఎస్ ఎస్ అని ఘంటాపథంగా చెబుతారు. సంఘ్ మొదట పుట్టింది.
By: Satya P | 18 Aug 2025 1:26 PM ISTనరేంద్ర మోడీ. హిమ పర్వతం లాంటి వారు. మేరు నగధీరుడు. అజేయుడు, ఆయన గుండె ధైర్యం ప్రత్యర్ధులకు దడ పుట్టిస్తుంది. ఇవన్నీ మోడీని తరచూ కీర్తించే వారి నోటి నుంచి వచ్చే పడి కట్టు పదాలు మరి మోడీ కూడా జడుస్తారా లేక భయపడతారా అంటే ప్రత్యర్ధి కాంగ్రెస్ నేతలు అయితే ట్రంప్ కి మోడీ భయపడతారు అని ఒక్కటే విధంగా విమర్శలు చేస్తారు. ఇప్పటిదాకా ట్రంప్ చేసిన ఏ ప్రకటన మీద మోడీ వివరణ నేరుగా ఇవ్వలేదని వామపక్షాలు సైతం తప్పు పడతాయి. మరి అది రాజకీయంగా చేసే విమర్శలుగా కొట్టి పారేసినా నిజంగా మోడీ భయపడతారా అది కూడా తాను పుట్టి పెరిగిన ఆర్ఎస్ఎస్ కి భయపడతారా అంటే అక్కడ ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయని అంటున్నారు.
సంఘ్ పవర్ ఫుల్ :
బీజేపీకి కర్త కర్మ క్రియ ఇవన్నీ ఆర్ ఎస్ ఎస్ అని ఘంటాపథంగా చెబుతారు. సంఘ్ మొదట పుట్టింది. తరువాత జన సంఘ్ పుట్టింది ఆ జన సంఘ్ కి మారు రూపమే బీజేపీ. అలాంటిది సంఘ్ నుంచే అంతా నాయకత్వం నేర్చుకుని బీజేపీలోకి వస్తారు. అందుకే సంఘ్ అంటే అంతా భయంతో కూడిన భక్తితో కడు వినయంగా ఉంటారు మోడీ కూడా సంఘ్ నుంచి వచ్చిన వారే. ఆయనకు సంఘ్ అంటే ఏమిటో పూర్తిగా తెలుసు అని కూడా అంటారు.
బీజేపీ వెనక ఆర్ఎస్ఎస్ :
బీజేపీ ప్రతీ విజయంలో ప్రతీ అడుగులో ఆర్ఎస్ఎస్ ఉంది. బీజేపీ ఎపుడు అధికారంలోకి వచ్చినా కచ్చితంగా ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ లెవెల్ లో చేసే వర్క్ తో అని అంతా నమ్ముతారు. బీజేపీకి మొత్తం దిశా నిర్దేశం చేసేదే ఆర్ఎస్ఎస్ అన్నది కూడా ఒక నిశ్చితాభిప్రాయంగా ఉంది. బీజేపీకి గురువుగా ఒక శ్రేయోభిలాషిగా ఒక పెద్దగా ఆర్ఎస్ఎస్ ఉంటుంది. బీజేపీ రాజకీయంగా చేసే తప్పు ఒప్పులను కూడా నివేదించి ఎప్పటికపుడు సవరించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాంటి సంఘ్ అంటే బీజేపీలో అందరికీ భయమే అని చెబుతారు.
కోపంతో పాటు గ్యాప్ :
ఇదిలా ఉంటే బీజేపీ పెద్దలుగా కాషాయ ద్వయంగా పేరు గడించిన నరేంద్ర మోడీ అమిత్ షా ఈ ఇద్దరూ కూడా ఆ మధ్య కాలంలో ఆర్ఎస్ఎస్ అంటే ఎందుకో ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. దాంతో 2024 ఎన్నికల్లో కూడా ఆర్ఎస్ఎస్ ని పక్కన పెట్టారు అని అంటున్నారు. అలా ఆర్ ఎస్ ఎస్ ని పక్కన పెడితే ఏమైందో తరువాత ఫలితాలతో పూర్తిగా వారికి అర్ధం అయింది అని కూడా చెప్పుకుంటున్నారు అయితే కొంతకాలంగా బీజేపీకి ఆర్ఎస్ఎస్ కి మధ్య చాలా అంశాలలో భేదాభిప్రాయాలు ఉన్నాయని అంటున్నారు
మోడీ మార్క్ కితాబులు :
అయితే కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆర్ఎస్ఎస్ ని దగ్గర తీయడం మొదలెట్టారు అని అంటారు దాంతో ఆ ప్రభావం హర్యానా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల మీద పడి బీజేపీకి మంచి విజయాలు దక్కాయని కూడా గుర్తు చేస్తారు. ఇటీవలనే మోడీ నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం కూడా సందర్శించి వచ్చారు. ఆయన పదకొండేళ్ళ ప్రధానమంత్రిత్వంలో ఎపుడూ సంఘ్ కార్యాలయానికి వెళ్ళింది లేదని కూడా గుర్తు చేస్తారు. ఇక తాజాగా జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో ఎర్ర కోట మీద మోడీ ప్రసంగితూ ఆర్ఎస్ఎస్ కి కితాబులు ఇచ్చారు. సంఘ్ సేవలను ఎంతగానో మెచ్చుకున్నారు. వందేళ్ళ ప్రయాణంలో ఆర్ఎస్ఎస్ ఎంతో సాధించింది అని కూడా జాతి జనులకు బిగ్గరగా చెప్పారు.
నాడు అలా నేడు ఇలా :
ఇక బీజేపీకి ఎంతో సమర్ధత ఉందని ఆర్ఎస్ఎస్ తమకు అవసరం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గత లోక్ సభ ఎన్నికల ముందు సంచలన వ్యాఖ్యలు చేసారు. దాని మీద ఆర్ఎస్ఎస్ కూడా బహిరంగంగా వ్యాఖ్యలు చేయలేదు అయితే లోక్ సభ ఎన్నికల్లో సీట్లు తగ్గాక కానీ బీజేపీ పెద్దలకు తత్వం బోధపడలేదని దాంతో సంఘ్ తో తమ బంధాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నాలు ఒదలెట్టారు అని గుర్తు చేస్తున్నరు.
బీజేపీ అధ్యక్షుడి ఎన్నికతో క్లారిటీ :
ఇక బీజేపీ పెద్దగా ప్రధానిగా మోడీ ఆర్ఎస్ఎస్ ని పొగిడారు దాని వెనక చాలా అంశాలు ఉన్నాయని అంటున్నారు. బీహార్ తమిళనాడు వంటి అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2029లో జరిగే లోక్ సభ ఎన్నికలు కూడా దృష్టిలో పెట్టుకుని ఆర్ఎస్ఎస్ కి దగ్గర కావాలని కో ఆర్డినేట్ చేసుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు అని అంటున్నారు అయితే ఈ కో ఆర్డినేషన్ ఫలితాలు ఏమిటి ఎలా అన్న దానికి ఒక కొలమానంగా కొత్త బీజేపీ ప్రెసిడెంట్ ఎవరు అన్నదానిని బట్టి అర్ధం అవుతుంది అని అంటున్నారు. సంఘీయుడికే ఈ పదవి ఇస్తే కనుక ఆర్ఎస్ఎస్ తో బీజేపీ కో ఆర్డినేషన్ సాఫీగా సాగుతున్నట్లే భావించాలి. పరిస్థితులు చూస్తే మోడీ అమిత్ షా ఆర్ఎస్ఎస్ అంతా కలసి బలమైన సంఘ్ నేతనే ఎంపిక చేయవచ్చు అన్న ఊహాగానాలూ ఉన్నాయి. చూదాలి మరి ఏమి జరుగుతుందో
