Begin typing your search above and press return to search.

ఆర్ఎస్ఎస్ కి మోడీ వెరీ స్పెషల్

ఆర్ఎస్ఎస్ నుంచి ఎందరో నేతలు వచ్చారు. అటల్ బిహారీ వాజ్ పేయ్, ఎల్ కే అద్వానీ వంటి ఉద్ధండులు అక్కడ నుంచి వచ్చిన వారే.

By:  Satya P   |   2 Oct 2025 9:24 AM IST
ఆర్ఎస్ఎస్ కి మోడీ వెరీ స్పెషల్
X

రాష్ట్రీయ స్వయం సంఘ్ ఆర్ఎస్ఎస్ ఎందరో బీజేపీ పెద్దలకు మాతృ సంస్థ. ఎందరో అక్కడనే ఎంతో శిక్షణ పొంది రాజకీయ విభాగమైన బీజేపీలో చేరి ఉన్నత పదవులు అలంకరించారు. నరేంద్ర మోడీ విషయానికి వస్తే ఆయన ఎనిమిదవ ఏటనే సంఘంలో చేరారు అని చెబుతారు. యుక్త వయసులోనే ఆయన గుజరాత్ లోని తన సొంత ప్రాంతంలో ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక రెండు దశాబ్దాల పాటు ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన మీదటనే మోడీ 1986లో బీజేపీలో చేరారు. మోడీకి ఆర్ఎస్ఎస్ బంధం చాలా గట్టిదని అంటారు.

అజెండాను అమలు చేసిన నేతగా :

ఆర్ఎస్ఎస్ నుంచి ఎందరో నేతలు వచ్చారు. అటల్ బిహారీ వాజ్ పేయ్, ఎల్ కే అద్వానీ వంటి ఉద్ధండులు అక్కడ నుంచి వచ్చిన వారే. బీజేపీకి సంబంధించి తొలి ప్రధానిగా వాజ్ పేయి అయి రికార్డు సృష్టించారు. అయితే ఆయన ఆరేళ్ల పాటు దేశానికి ప్రధాని హోదాలో సేవలు అందించినా కూడా ఆర్ఎస్ఎస్ అజెండా మాత్రం అమలు చేయలేకపోయారు దానికి కారణం ఆయన నాయకత్వంలోని బీజేపీకి ఏ రోజూ ఫుల్ మెజారిటీ దక్కలేదు. కానీ మోడీ విషయం అలా కాదు రెండు సార్లు బీజేపీకి పూర్తి మెజారిటీ లభించింది. మూడవసారి ఎన్డీయేతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసినా బీజేపీదే ఆధిపత్యంగా కొనసాగుతోంది. దాంతో ఆర్ఎస్ఎస్ అనుకున్న లక్ష్యాలను నరేంద్ర మోడీ అమలు చేసి చూపించారు.

ఆ రెండూ నిజాలు అయ్యాయి :

కాశ్మీర్ కి స్వయంప్రతిపత్తి అధికారాన్ని ఇచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేయాలన్నది ఆర్ఎస్ఎస్ డిమాండ్. దానిని 2019 లో బీజేపీ నెరవేర్చింది. అలాగే రాముడు పుట్టిన చోట అయోధ్యలో భవ్యమైన రామాలయం నిర్మించాలని కూడా ఆర్ఎస్ఎస్ ఆలోచనగా ఉండేది. దానిని కూడా మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేసి చూపించింది. అంతే కాకుండా ట్రిపుల్ తలాఖ్ ని రద్దు చేయడం, వక్ఫ్ బోర్డ్ చట్ట సవరణ ఇలా ఎన్నో కార్యక్రమాలను మోడీ ప్రభుత్వం చేసింది.

మురిసిన మోడీ :

అందుకే ఆర్ఎస్ఎస్ వందేళ్ళ వేడుక వేళ నరేంద్ర మోడీ ఎంతగానో ఆనందంగా కనిపించారు. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి ఇన్నేళ్ళ ప్రయాణంలో సాధించినది ఏమిటో కూడా లోకానికి చాటి చెప్పినట్లు అయింది. బీజేపీ ప్రధాని హోదాలో శతాబ్ది ఉత్సవాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న మోడీ సంఘ్ ని ఎంతగానో కీర్తించారు. ఆర్ఎస్ఎస్ దేశాభివృద్ధికి చేసిన సేవ విస్మరించలేనిది అన్నారు. ఆర్ఎస్ఎస్ కి దేశమే మొదటిది అన్నారు. దేశం కోసం పని చేసే అగ్రగామి సంస్థగా ఆర్ఎస్ఎస్ ని ఆయన అభివర్ణించారు ఆర్ఎస్ఎస్ మీద విమర్శలు ఎన్ని వచ్చినా లెక్క చేయకుండా తాను అనుకున్న గమ్యానికి చేరిందని ప్రధాని పేర్కొన్నారు. దేశ విజయంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఎంతో ఉందని చెప్పడం ద్వారా ఆర్ఎస్ఎస్ వ్యతిరేకులకు ఆయన సరైన జవాబు చెప్పారని అంటున్నారు. ఈ దేశానికి ఆర్ఎస్ఎస్ ఏమి చేసింది అన్న దానికి తన సుదీర్ఘమైన ప్రసంగంలో ప్రధాని వివరించిన తీరే సమగ్రమైన సమాచారం అని అంటున్నారు.

సంఘ్ తో మోడీ :

ఆ మధ్య కొంతకాలం సంఘ్ తో బీజేపీ పెద్దలకు విభెదాలు ఉన్నాయని ప్రచారం సాగింది. కానీ తాజా సమావేశం చూసిన వారికి అవన్నీ ఒట్టి ఊహాగానాలే అని అర్ధం అవుతుంది అంటున్నారు. మోడీ ఆర్ ఎస్ ఎస్ ని ఎంతగానో కొనియాడడమే కాకుండా సంఘ్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు. మరో వైపు చూస్తే బీజేపీలో 75 నిండినా మోడీ ప్రధానిగా ఎంత కాలం అయినా ఉండొచ్చు అని ఆ మధ్యనే సర్ సంచాలక్ మోహన్ భగవత్ స్పష్టం చేశాక ఆర్ ఎస్ ఎస్ బీజేపీల మధ్య బంధం మరింతగా గట్టి పడింది. రానున్న కాలంలో ఇది మరింతగా సాగి మంచి ఫలితాలను ఇస్తుందని సంఘీయులతో పాటు కాషాయదళపతులూ ఆశగా ఉన్నారు.