మోడీ అప్పటిదాకా పీఎం....ఆ తర్వాత ?
దేశానికి బలమైన ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్నారు. ఆయన రాజకీయ జీవితానికి ప్రధాని పదవికి కూడా ముడిపెట్టే ఏడాదిగా 2025 నిలిచింది.
By: Satya P | 17 Nov 2025 9:25 AM ISTదేశానికి బలమైన ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్నారు. ఆయన రాజకీయ జీవితానికి ప్రధాని పదవికి కూడా ముడిపెట్టే ఏడాదిగా 2025 నిలిచింది. ఈ ఇయర్ లో మోడీ పొలిటికల్ కెరీర్ గురించి నడిచినంత చర్చ మరే ఏడాదీ జరగలేదు. దానికి కారణం ఇదే ఏడాది మోడీ పుట్టిన రోజు వచ్చింది. ప్రతీ ఏటా వస్తుంది కదా అనుకుంటే పొరపాటు. ఈ ఏడాదితో మోడీకి 75 ఏళ్ళు నిండాయి. దాంతో దానికి ఆయన పదవికి ముడిపెట్టి పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఆ తర్వాత మరో అంశంగా బీహార్ ఎన్నికలు వచ్చాయి.
మోడీ రిటైర్మెంట్ అంటూ :
నరేంద్ర మోడీకి 75 ఏళ్ళు వచ్చాయి కాబట్టి ఆయన ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి తప్పుకుంటారు అని మోడీ యాంటీ మీడియాలో ఒక పెద్ద కాంపెయిన్ నడచింది. మోడీని దిగిపోవాలని ఆర్ఎస్ఎస్ బలంగా కోరుకుంటోంది అని కూడా చెప్పుకొచ్చారు. ఇక మోడీ తరువాత ఫలానా వారు ఆర్ఎస్ఎస్ ఎంపిక ఇదే అని కూడా ఎన్నో పేర్లు ప్రచారంలోకి తెచ్చారు. కానీ చివరికి అదంతా సాఫీగానే ముగిసింది. ఒక్క ముక్కలో చెప్పాలీ అంటే టీ కప్పులో తుఫాన్ మాదిరిగా. మోడీని దిగిపోవాలని ఆర్ఎస్ఎస్ ఎందుకు కోరుకుంటుంది అని దాని చీఫ్ మోహన్ భగవత్ ప్రశ్నించారు. బీజేపీ వ్యవహారాలలో ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకోదని కూడా ఆయన స్పష్టం చేశారు. దాంతో మోడీ ఏజ్ ని కటాఫ్ గా తీసుకుని రిటైర్మెంట్ అవుతారు అన్న దాని మీద వచ్చిన ప్రచారం అయితే పూర్తిగా తేలిపోయింది.
బీహార్ రిజల్ట్ తో :
ఇక బీహార్ రిజల్ట్ తో ముడిపెట్టి మరీ మోడీ సర్కార్ కేంద్రంలో కూలుతుంది అని ప్రచారం చేశారు. బీహార్ లో నితీష్ ఓటమి పాలు అవుతారని ఆ మీదట ఆయన ఎన్డీఏకు గుడ్ బై కొడతారు అని దాంతో మెజారిటీ లేక ఎన్డీయే కుప్ప కూలుతుందని కూడా ప్రత్యర్ధులు చెబుతూ వచ్చారు. బీహార్ లో అయితే ఒక్క ఓటుకీ బీహార్ తో పాటు కేంద్రంలో కూడా అధికారం మారుతుందని ప్రత్యర్ధులు ప్రచారం చేశారు అని కూడా చెప్పుకున్నారు. తీరా చూస్తే బీహార్ లో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన మెజారిటీతో బీజేపీ జేడీయూ అధికారంలోకి వచ్చాయి. దాంతో బీహార్ నుంచి మోడీకి ముప్పు లేదని అవన్నీ తప్పుడు ప్రచారం అని కూడా తేలిపోయాయి.
పూర్తి కాలమే :
ఇక మోడీ పూర్తి కాలం ప్రధానిగా ఉంటారని అంతా అంటున్నారు. ఆయనకు వేరే రాష్ట్రాలలో జరిగే ఎన్నికల్లో బీజేపీ ఓడినా వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదని అంటున్నారు. ప్రత్యర్థులు కూడా ఇక మీదట వాటిని ఆయా రాష్ట్రాల అంశంగానే చూస్తారు తప్ప కేంద్రంలో ఏదో జరిగిపోతుందని భూకంపం వస్తుందని ప్రచారం చేయలేరని అంటున్నారు. ఇక బీహార్ వంటి హార్డ్ కోర్ హిందీ బెల్ట్ స్టేట్ ని బీజేపీ పట్టేశాక ఆ పార్టీకి కానీ మోడీకి కానీ తిరుగు ఉండదని అంటున్నారు.
బీజేపీ దూకుడు :
బీజేపీ చేతిలో ఇంకా మూడున్నరేళ్ళ కాలం ఉంది కాబట్టి తాను చేయాలనుకున్న పనులు తమ యాక్షన్ ప్లాన్ ని పూర్తి చేస్తుందని అంటున్నారు. ఇక బీజేపీ జన గణన ముందు పెట్టుకుంది. అలాగే లోక్ సభ సీట్లు పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే మహిళా రిజర్వేషన్ల ప్రకారం 2029లో ఎన్నికలకు వెళ్ళాలని చూస్తోంది. ఇవన్నీ ఈ మూడున్నరేళ్ళ పాటు పాలనలో పూర్తి చేస్తారు అని అంటున్నారు. ఇక 2029 ఎన్నికలకు బీజేపీ తగిన యాక్షన్ ప్లాన్ తో ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతుంది. అంతే కాదు ఆ పార్టీ నాలుగవ సారి గెలిచేందుకు తగిన విధంగా వ్యూహాలను తనకు ఉన్న అధికారంతో అమలు చేస్తుందని అంటున్నారు. బీజేపీ ఇక మీద ఫోకస్ అంతా 2029 ఎన్నికల్లో గెలిచే దాని మీదనే పెడుతుందని అంటున్నారు. అన్నీ అనుకూలిస్తే నాలుగవ సారి కూడా మోడీ ప్రధానిగా రావాలని వస్తారని బీజేపీ ఆశిస్తోంది.
