మధ్యతరగతి మోడీ...ప్రచారానికి రెడీ !
కాదేదీ ప్రచారానికి అనర్హం అన్న తీరు బీజేపీది అని ప్రత్యర్ధులు విమర్శలు చేస్తారు. అయితే రాజకీయాల్లో ఎవరు ఏమి అనుకున్నా అసలు పట్టించుకోకూడదు.
By: Satya P | 7 Sept 2025 9:01 AM ISTకాదేదీ ప్రచారానికి అనర్హం అన్న తీరు బీజేపీది అని ప్రత్యర్ధులు విమర్శలు చేస్తారు. అయితే రాజకీయాల్లో ఎవరు ఏమి అనుకున్నా అసలు పట్టించుకోకూడదు. ఎందుకంటే లక్ష్యం వైపే చూడాలి. అపుడే అనుకున్నది సాధ్యపడుతుంది ఈ విషయంలో అందరి కంటే పదాకులు ఎక్కువ చదివింది కమలం పార్టీ. అందుకే జీఎస్టీ పన్నుల తగ్గింపులు ఇలా చేయడమేంటి అలా ప్రచారానికి రంగం సిద్ధం చేస్తోంది.
ప్రచారం పీక్స్ :
జీఎస్టీ పన్నుల తగ్గింపులతో దేశంలో మధ్యతరగతి పేద వర్గాలను ఆకట్టుకున్నామని బీజేపీ భావిస్తోంది. ఇప్పటిదాకా రాజకీయ ప్రత్యర్ధులు ప్రధాని నరేంద్ర మోడీని కార్పోరేట్ శక్తులకే మేలు చేశారు అని నిందిస్తూ ఉండేవని, ఇపుడు దానిని చెరిపేసుకుంటూ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనంతగా మేలు మిడిల్ క్లాస్ కి మోడీ చేశారు అని బీజేపీ అంటోంది. మోడీ వల్లనే ఈ రోజున మధ్యతరగతి పేద వర్గాలు అనూహ్యంగా లబ్ది పొందుతున్నాయని గట్టిగా చెబుతోంది.
ప్రతీ జిల్లాలోనూ తిరిగి :
బీజేపీ నాయకత్వం దేశంలోని ప్రతీ జిల్లాకు తిరిగి జీఎస్టీ తరువాత తరం సంస్కరణల గురించి వ్యాపారులతో పాటు ప్రజలకు సవివరంగా తెలియ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధినాయకత్వం సైతం రంగంలోకి దిగేలా కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ నెల 22 నుంచి జీఎస్టీ పన్నుల తగ్గింపు అన్నది అమలులోకి రానుంది. దాంతో అదే రోజు నుంచి దేశవ్యాప్తంగా ప్రచారం పీక్స్ లో చేయాలని బీజేపీ పరివారం అంతా తీర్మానించుకుంది అని అంటున్నారు.
రంగంలోకి కేంద్ర మంత్రులు :
దేశంలోని అన్ని రాష్ట్రాలు అలాగే అన్ని జిల్లాలలో జీఎస్టీ పన్నుల సంస్కరణల గురించే బీజేపీ నాయకులు ప్రచారం చేస్తారు అని అంటున్నారు ఇందులో కేంద్ర మంత్రులు సీనియర్ నేతలు జాతీయ ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర నాయకులు అలాగే ముఖ్య నేతలు అంతా కలసి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి జీఎస్టీ పన్నుల సంస్కరణల ఫలితంగా ఒక్కో కుటుంబానికి మిగిలే ఖర్చు అలాగే వారికి ఎంత లాభం కలుగుతుందో వివరిస్తారు అని అంటున్నారు. అలాగే వ్యాపార వర్గాల వారికి కూడా ఎంతలా దీని వల్ల ప్రయోజనం కలుగుతుందో వివరిస్తారు అని అంటున్నారు.
వచ్చే ఎన్నికల మీద గురి :
ఈ ఏడాది నవంబర్ లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వచ్చే ఏడాది చూస్తే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి. ఇక 2027లో ఉత్తరప్రదేశ్ గుజరాత్ వంటి రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. వీటిలో పాటు మరికొన్ని కీలక రాష్ట్రాలు ఉన్నాయి. జీఎస్టీ ప్రభావంతో జనంలోకి దూకుడుగా చొచ్చుకుని వెళ్ళి మధ్యతరగతి పేద వర్గాలను కమలం వైపు తిప్పుకోవాలని బీజేపీ చూస్తోంది అని అంటున్నారు. అపుడే కేంద్ర స్థాయిలో ప్రచారం అయితే మొదలైపోయింది.
కేంద్ర మంత్రులు వరసగా వచ్చి ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెడుతున్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా జీఎస్టీ పన్ను రేటు తగ్గింపు తమ ప్రభుత్వం ఘనత అని చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్రాల ఆర్ధిక మంత్రులకు లేఖ రాసి వారికి కూడా ధన్యవాదాలు తెలియచేస్తున్నారు. రానున్న రోజులలో బీజేపీ అగ్ర నేతలు అంతా ఇదే విషయం మీద జనంలో ఉంటారని అంటున్నారు. ఇండియా కూటమి ఇటీవల చేస్తున్న దూకుడు రాజకీయానికి ఇది చెక్ పెట్టే వ్యూహంగా బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.
