మోడీ విత్ రాహుల్...ఎంత బావుందో !
రాజకీయ నాయకులు అంటే ప్రజా సేవకులు. ప్రజల కోసం వారు వాదులాడుకోవడం మంచి విషయమే. అలాగే అభివృద్ధి కోసం డైలాగ్ వార్ నడపడమూ ఇంకా మంచి విషయమే.
By: Satya P | 12 April 2026 9:30 AM ISTరాజకీయ నాయకులు అంటే ప్రజా సేవకులు. ప్రజల కోసం వారు వాదులాడుకోవడం మంచి విషయమే. అలాగే అభివృద్ధి కోసం డైలాగ్ వార్ నడపడమూ ఇంకా మంచి విషయమే. కానీ రాజకీయంగా ప్రత్యర్ధులు కంటే కూడా శత్రువులుగా మారి ముఖాలు సైతం చూడకుండా ఉండే పరిస్థితి అయితే దారుణం. అలాంటిది వద్దు అనే అంతా అంటారు. ప్రజా స్వామ్యంలో అధికార విపక్షాలు రెండూ కలవాలి. ప్రజల మన్ననలతో పవర్ అందుకున్న వారు డ్రైవింగ్ ఫోర్స్ గా ఉంటే అపొజిషన్ లో ఉన్న వారు అడ్వైజర్స్ గా ఉంటారు. ఇలా నిర్మాణాత్మకంగా కలసి మెలసి ఉండడమే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ.
ఎన్నికల వేడి వేళ :
ఒక వైపు దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల వేడి వేసవి ఎండలను మించి ఉంది. అందులో మూడు రాష్ట్రాలకు ఎన్నికలు ముగిసాయి. ఇక మిగిలిన రెండూ కూడా కీలకమైనవే. ఈ సమయంలో ఢిల్లీలో జరిగిన మహాత్మా జ్యోతీరావు ఫూలే 200వ జయంతి వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇద్దరూ తారసపడ్డారు. మోడీ అందరినీ పలకరిస్తూ రాహుల్ గాంధీకు అభివాదం చేశారు. రాహుల్ సైతం ప్రధానికి నమస్కారం పెట్టారు. ఆ తరువాత మోడీ స్వయంగా రాహుల్ వద్దకు వచ్చారు. ఇద్దరూ కొంతసేపు ముచ్చటించుకున్నారు. ఇది అక్కడ ఉన్న అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.
వైరల్ అయిన వైనం :
అంతే కాదు సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వీడియో తెగ వైరల్ అయింది. మోడీ విత్ రాహుల్ ఎంత బాగుందో అని అంతా అనుకోవడం జరిగింది. ఇది కదా అసలైన ప్రజాస్వామ్యం అని అంతా ఆలోచించేలా ఈ భేటీ ఉంది అంటున్నారు. నిజానికి చూస్తే ప్రజా ప్రతినిధులు ఈ విధంగా కలిసి మాట్లాడుకోవడం ఈ దేశానికి కొత్త కాదు, గతంలో జరిగినదే. ఒక యువ ఎంపీగా వాజ్ పేయి ఉన్నపుడు అప్పటికే బలమైన ప్రధానిగా రెండోమారు దేశానికి నాయకత్వం వహిస్తున్న పండిట్ నెహ్రూ వాజ్ పేయి చేసే విమర్శలను సానుకూలంగా స్వీకరించడం సభా సాక్షిగా ఆయన లేవనెత్తిన పాయింట్లలో సహేతుకతని ప్రస్తావించడం వంటివి జరిగాయి.
ప్రజలకే మేలు :
రాజకీయాల అంతిమ లక్ష్యం ప్రజలకు మేలు చేయడం. భిన్నాభిప్రాయాలు ఉండడం సహజం. కానీ చివరిని అంతా కూర్చుని ఒక అభిప్రాయానికి రావడం ద్వారా ప్రజలకు మేలు చేయడమే ప్రజాస్వామిక మూల సూత్రం. కానీ ఈ రోజు అది కొరవడుతోంది. దేశంలో అనేక చోట్ల వింత పోకడలు కనిపిస్తున్నాయి. విపక్షం అయితే గొంతు నొక్కుతున్నారని అంటోంది. అధికార పక్షం అయితే విపక్షం విమర్శలను తట్టుకోలేకపోతోంది. అయితే ఈ రకమైన వాతావరణం మారాల్సి ఉందని ప్రజాస్వామ్య ప్రియులు అంతా గట్టిగా కోరుకుంటున్నారు. ఏపీ లాంటి చోట్ల కూడా అధికార విపక్షాలు కలసి మెలసి ఉండాలని అంతా ఆశిస్తున్నారు. అపుడే ప్రజా స్వామ్య స్పూర్తి నిలబడుతుందని అంటున్నారు.
