మోదీ చేతి వాచీ.. సూటు.. పుట్టపర్తిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్
మోదీ ఎప్పుడూ చేతికి వాచీని ధరిస్తుంటారనే సంగతి తెలిసిందే. ప్రపంచంలోని వివిధ దేశాల పర్యటనకు వెళ్లినప్పుడూ ఆయన వాచీతోనే ఉంటారు.
By: Tupaki Political Desk | 19 Nov 2025 4:04 PM ISTప్రధాని మోదీ వస్త్రధారణ అత్యంత ట్రెండీగా, ఆధునికంగా ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే.. 75 ఏళ్ల వయసులోనూ ఆ స్థాయిలో ఫ్యాషన్ ను ఫాలో కావడం అంటే మాటలు కాదు.. మోదీ ధరించే దుస్తులు చాలా హుందాగానూ కనిపిస్తుంటాయి. తాజాగా పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు హాజరైన ప్రధాని ధరించిన సూటు కళ్లు తిప్పుకోనివ్వని విధంగా ఉంది. గోధుమరంగులోని ఈ సూటు.. ప్రఖ్యాత సూరత్ వజ్రాలతో పొదిగినదా? అన్నట్లు మెరిసిపోతోంది. అటు ఏపీ సీఎం చంద్రబాబు, ఇటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో వేదికపై ఆసీనులైన మోదీ.. వారిద్దరినీ మించి ఆకట్టుకునే వస్త్రధారణలో కనిపించారు. ఇక మోదీ తన ప్రసంగంలో సత్యసాయి సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. విశ్వ ప్రేమకు సత్యసాయి నిదర్శనంగా నిలిచారని, పుట్టపర్తి మట్టిలో మహత్తు ఉందని ప్రశంసించారు.
ఆ వాచీలో అంత అర్ధం ఉందా?
మోదీ ఎప్పుడూ చేతికి వాచీని ధరిస్తుంటారనే సంగతి తెలిసిందే. ప్రపంచంలోని వివిధ దేశాల పర్యటనకు వెళ్లినప్పుడూ ఆయన వాచీతోనే ఉంటారు. అంతగా ఆయన శరీరంలో భాగమైంది వాచీ. అయితే, ఇప్పుడు మోదీ చేతి వాచీని చూసినవారు కాస్త ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. కారణం.. దానిలోని విశిష్టతే.
స్వాతంత్ర్య సంవత్సరం.. పులి సంచారం
మోదీ వాచీ పేరు రోమన్ బాగ్. దీని డిజైన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. సెప్టెంబరు నుంచి ఆయన ఈ వాచీని ధరిస్తున్నారు. దీని డయల్ లో 1947 నాటి అసలైన రూపాయి నాణెం ఉండడం విశేషం. 1947 మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం కావడం గమనార్హం. దీంతోపాటు నాణెంపై నడుస్తున్న పులి మరింత విశిష్టత చేకూరుస్తోంది. దేశం స్వేచ్ఛా వాయువులు పొందిన సంగతిని ప్రస్తావిస్తూ.. ఇక శక్తి సామర్థ్యాలకు ప్రతీక అయిన పులిని చూపడం ఇక్కడ సింబాలిక్. పైగా మోదీ ప్రభుత్వం గట్టిగా పదేపదే చెప్పే మేకిన్ ఇండియాకు కూడా ఈ వాచీ ప్రతిరూపం.
-రవ్ మోహతా స్థాపించిన జైపూర్ వాచ్ కంపెనీ... రోమన్ బాగ్ వాచ్ ను తయారుచేసింది. 316ఎల్ స్టెయిన్ లెస్ స్టీల్ తో రూపొందించారు. ప్రత్యేకమైన భారతీయ జ్ఞాపకాలు, నాణేలు, స్టాంపులు, సంప్రదాయ మోటిఫ్ లను అత్యంత ఖరీదైన గడియారాలు మారుస్తుంది జైపూర్ వాచ్ కంపెనీ. ఇంతకూ ఖరీదు ఎంతో చెప్పలేదు కదూ... రూ.55 వేల నుంచి రూ.60 వేలు. మోస్తరు ధరనే అన్నమాట.
