Begin typing your search above and press return to search.

వారంతా దేశ వ్యతిరేకులు ...మోడీ అస్త్రం పనిచేస్తుందా ?

ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మోడీ మాట్లాడుతూ ప్రతిపక్షాల తీరుని గట్టిగానే విమర్శించారు.

By:  Satya P   |   1 Nov 2026 9:04 AM IST
వారంతా దేశ వ్యతిరేకులు ...మోడీ అస్త్రం పనిచేస్తుందా ?
X

ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాలను తక్కువ అంచనా వేసిన ప్రతీ సారీ విపక్షం ఓటమినే చూస్తోంది. ఆయన ఏది మాట్లాడినా 140 కోట్ల జనంతోనే. ఆయన దేశ భక్తి గురించి ప్రస్తావిస్తారు, అలాగే దేశం ముందుకు పోవాలని జనాలను కోరుతారు. దేశం కోసం తాను తనతో పాటు ప్రజలు ఈ విధంగా మోడీ ఆలోచనలు సాగుతాయి. అవే వ్యూహంగా ఉంటాయి. అయితే ఈ క్రమంలో ఎన్డీయే ప్రభుత్వం మీద విమర్శలు చేసే విపక్షాలను దేశ అభివృద్ధికి అడ్డుపడే శక్తులుగా మోడీ అభివర్ణిస్తున్నారు. తమ ప్రభుత్వం దేశం కోసం పనిచేస్తూంటే దేశాన్ని ఇబ్బంది పెట్టాలని వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయని మోడీ ఘాటుగానే విమర్శిస్తున్నారు.

ఐక్యత గురించి :

ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మోడీ మాట్లాడుతూ ప్రతిపక్షాల తీరుని గట్టిగానే విమర్శించారు. వారు నిరసనలు చేయడం లేదు, దేశ ప్రగతికి అడ్డంకులు సృష్టిస్తున్నారు అని నిప్పులు చెరిగారు. ప్రతిపక్షాలు పూర్తిగా నిరాశతో ఉన్నాయని కూడా మోడీ అన్నారు. రాజ్యాంగ మర్యాదలు పాటించడం లేదు, తమ బాధ్యతలను పట్టించుకోవడం లేదని విపక్షాల తీరు మీద మోడీ మండిపడ్డారు. ఈ రోజున దేశాన్ని విభజించేందుకు కుట్ర జరుగుతోంది అని మోడీ అంటున్నారు. ఈ సమయంలో దేశ ప్రజలు అంతా ఐక్యంగా ఉండాలని మోడీ కోరారు.

దిమాగీ నక్సల్స్‌ అంటూ :

ఇక ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే దిమాగీ నక్సల్స్‌ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మోడీ పిలుపు ఇచ్చారు. దేశంలో అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నం జరుగుతోందని సామాజిక మాధ్యమాల వేదికగా అబద్ధాలను వదంతులను పెద్ద ఎత్తున వ్యాప్తి చేస్తున్నారని మోడీ ఫైర్ అయ్యారు. ఈ రోజున దేశం ప్రగతి పథంలో ముందుకు సాగుతోంది అని మోడీ అన్నారు. ఈ కీలక సమయంలో దేశాన్ని ఇబ్బంది పెడితే ప్రజలు నష్టపోతారు అన్నారు. కానీ కొందరు అదే పని మీద ఉన్నారు అంటూ విపక్షాల తీరు మీద పరోక్ష విమర్శలను మోడీ చేశారు.

దేశ భక్తి అస్త్రం :

మోడీ కానీ బీజేపీ కానీ దేశ భక్తి అస్త్రాన్నే తరచూ ప్రయోగిస్తూ ఉంటుంది. ఇపుడు కూడా దానినే గట్టిగా ముందుకు తెస్తోంది. దేశాభివృద్ధికి ఆటంకం కలిగించే శక్తులు అంటూ మోడీ పరోక్షంగా విమర్శలు చేస్తూ విపక్షాలను ఇరుకున పెట్టారు. పేదరికం నుంచి ఈ రోజు దేశం బయటపడుతోందని ఆయన గుర్తు చేశారు. గతంలో పేదరికం నిర్మూలిస్తామని హామీలు ఇచ్చిన వారు తాము ధనవంతులు అయ్యారు కానీ పేదలను అలాగే ఉంచేశారు అని ఆయన మండిపడ్డారు. ఇపుడు ప్రగతి పెద్ద ఎత్తున సాగడం చూసి ఈ విధంగా చేస్తున్నారు అని మోడీ విమర్శించారు. దేశం అంతా ఒక్కటిగా ఉంటేనే భారత వ్యతిరేక శక్తులను ఎదుర్కోగలమని ఆయన అంటున్నారు.

సెంటిమెంట్ గానే :

దేశ భక్తి దైవభక్తి ఎపుడూ సెంటిమెంట్ గానే ఉంటాయి. దేశం పట్ల అందరికీ అభిమానం ఉంటుంది. బీజేపీ మోడీ సరిగ్గా గురి చూసి అదే అస్త్రాన్ని విపక్షం మీద ప్రయోగిస్తున్నాయి. దేశ వ్యతిరేక శక్తులు అంటూ మోడీ ఘాటైన విమర్శలే చేశారు. దేశ మాత బిడ్డల మధ్య గొడవలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. ఇపుడు ఓట్ల చోరీ పేరుతో విపక్షం పెద్ద ఎత్తున నిరసనలు చేస్తోంది. దాంతో పాటు కొందరు సెలిబ్రిటీస్ అలాగే ప్రముఖులు దిమాగీ నక్సల్స్‌ తాము అని ప్రకటించుకుంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇంకో వైపు జెన్ జీ పేరుతో కొందరు ఉద్యమాలు చేస్తున్నారు. వీటిని అన్నింటికీ దృష్టిలో ఉంచుకునే మోడీ ఈ విధంగా హాట్ కామెంట్స్ చేశారు అని అంటున్నారు. అది కూడా తన సొంత గడ్డ గుజరాత్ నుంచి పటేల్ జయంతి వేళ మోడీ దేశానికి పిలుపు ఇచ్చారు. ఐక్యత ఈ సమయంలో అవసరం అని ఆయన అంటున్నారు. మరి మోడీ ప్రయోగించిన ఈ అస్త్రం ఎలా పనిచేస్తుందో చూడాల్సి ఉంది.