పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు...ఎన్నికల వేళ వ్యూహమా ?
కేంద్రం ప్రతిపాదిస్తున్న లోక్ సభ సీట్ల పునర్ విభజన బిల్లుతో చాలా రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని విపక్షాలు అంటున్నాయి.
By: Satya P | 4 April 2026 9:36 AM ISTకేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పీక్స్ కి చేరుకుంటున్న వేల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోంది. అయితే ఈ సమయం సందర్భం మీద కాంగ్రెస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది. ఎన్నికలో రాజకీయ లబ్దిని పొందేందుకే బీజేపీ ఈ విధంగా చేస్తోంది అని నిందిస్తోంది. నిజంగా బీజేపీ ఆలోచనలు వ్యూహాలు అవేనా అన్న చర్చ అయితే సాగుతోంది.
ఆ రెండు రాష్ట్రాలే :
ఈ నెల 23న పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఈ నెల 9న అస్సాం, కేరళం పాండిచ్చేరీలకు ఎన్నికలు అయిపోతాయి. పెద్ద రాష్ట్రాలు పెద్ద రాజకీయం అంతా 23న మాత్రమే ఉంది. సరిగ్గా దానికి కొద్ది రోజుల ముందు మోదీ సర్కార్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించడంపైన విపక్షాలు మండుతున్నాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్ర ఆరోపణలు చేస్తోంది. రెండు కీలక రాష్ట్రాలలో రాజకీయ లబ్ది కోసమే బీజేపీ ఇదంతా చేస్తోంది అని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.
మహిళా బిల్లు...సీట్ల పెంపు బిల్లు :
నిజానికి చూస్తే మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ సీట్ల పెంపు బిల్లులు అత్యంత కీలకమైనవి. ఈ బిల్లులను ఆమోదించడం కోసం మోడీ ప్రభుత్వం ఈ ప్రత్యేక సమావేశాలు పెడుతోంది. ఈ విధంగా మహిళా ఓట్లను అదే విధంగా చిన్న నియోజకవర్గాలను చేయడం ద్వారా రాజకీయంగా లబ్ది పొందడానికి చూస్తోంది అని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జై రాం రమేష్ మండిపడుతున్నారు. ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళిని పూర్తిగా ఉల్లగించడమే అని ఆయన ఆరోపిస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఎలాంటి కీలక ప్రకటనలు చేయకూడదని కానీ రాజ్యాంగ సవరణలు లాంటి కీలక నిర్ణయాల దిశగా కేంద్ర ప్రభుత్వం సాగుతోంది అని ఆయన ఆరోపిస్తున్నారు.
పునర్ విభజనతో నష్టం :
కేంద్రం ప్రతిపాదిస్తున్న లోక్ సభ సీట్ల పునర్ విభజన బిల్లుతో చాలా రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని విపక్షాలు అంటున్నాయి. ముఖ్యంగా ఈశాన్య పశ్చిమ రాష్ట్రాలు అయితే తీవ్రంగా నష్టాన్ని చూస్తాయని అంటున్నారు. యూపీ లాంటి చోట్ల మాత్రం 120 సీట్లు ఒకేసారి పెరుగుతాయని అంటున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో అయితే పెద్దగా బలం పెరిగేది ఉండదని చెబుతున్నారు. ఈ విధంగా దామాషా ప్రకారం లోక్‌సభ సీట్ల పెంపుదల చేస్తే కనుక చాలా రాష్ట్రాలకు ప్రమాదకరం అవుతుందని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి.
ఆగితే తప్పేంటి :
నిజానికి ఈ నెల 16 నుంచి 19 దాకా మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ఎన్నికలు అయిపోయాక అంటే ఇదే నెల 29 తర్వాత నిర్వహిస్తే ఏమవుతుందని విపక్షాలు నిలదీస్తున్నాయి. కేవలం పదిహేను రోజులు ఆగితే కొంపలు మునిగిపోతాయా అని ప్రశ్నిస్తున్నాయి. ఇపుడే పెట్టాలన్న ఉద్దేశ్యాల వెనక రాజకీయ లబ్ది ఉందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మాత్రం ప్రత్యేక సమావేశాల పట్ల ఫుల్ ఫోకస్ పెట్టింది. మరి ఇది ఏ మేరకు రాజకీయ లబ్దిని కలిగిస్తుందో చూడాలి. పైగా కీలకమైన బిల్లులు అంతే కాకుండా దేశ రాజకీయాన్ని మార్చేసే ఇలాంటి వాటి విషయంలో ఆదరాబాదరా ఎందుకు అని కాంగ్రెస్ అంటోంది. మోడీ సర్కార్ ది అంతా ఏకపక్షమని కూడా నిందిస్తోంది.
