గోల్డ్ పై మోడీ కీలక నిర్ణయం.. ఎగిరి గంతేస్తోన్న హస్బెండ్స్.. ఈ ఛాన్స్ మళ్లీ రాదండోయ్!
"ఏడాది పాటు బంగారం కొనకండి" అని పీఎం చెప్పిన మాటలు, భారతీయ భర్తలకు అమృతంలా వినిపిస్తున్నాయి.
By: Madhu Reddy | 12 May 2026 1:39 PM ISTబంగారం పేరు చెబితేనే మధ్యతరగతి భర్తల జేబులు గజగజ వణుకుతుంటాయి. కానీ, తాజాగా ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో సీన్ మొత్తం రివర్స్ అయింది. "ఏడాది పాటు బంగారం కొనకండి" అని పీఎం చెప్పిన మాటలు, భారతీయ భర్తలకు అమృతంలా వినిపిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ కోసం మోదీ వేసిన ఈ వ్యూహాత్మక అడుగు, ఇప్పుడు సామాన్య గృహస్తులకు ఒక వరంగా మారింది. సోషల్ మీడియాలో దీనిపై పేలుతున్న సెటైర్లు, మీమ్స్ ఇప్పట్లో ఆగేలా లేవు. ఆ వివరాలు చూద్దాం .
మోదీ మాస్టర్ ప్లాన్ ఏంటి?:
హైదరాబాద్ వేదికగా ఇటీవల ప్రధాని మోదీ ఒక సంచలన విజ్ఞప్తి చేశారు. పశ్చిమ ఆసియాలో యుద్ధాల వల్ల ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని, రూపాయి విలువ పడిపోకుండా ఉండాలంటే బంగారం దిగుమతులు తగ్గించాలని ఆయన కోరారు. ఏడాది పాటు బంగారం కొనడం ఆపేసి, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకుంటే దేశ సంపద ఆదా అవుతుందని ఆయన సూచించారు. ఇది వినడానికి ఆర్థిక సూత్రంలా ఉన్నా, భర్తలకు మాత్రం ఇది 'గోల్డెన్ న్యూస్' లా అనిపిస్తోంది.
భర్తలకు దేవుడిలా కనిపించిన ప్రధాని:
సాధారణంగా ఏ పండగ వచ్చినా, పెళ్లి రోజు వచ్చినా భార్యల నుంచి వచ్చే మొదటి డిమాండ్ 'బంగారం'. అప్పులు చేసైనా సరే నగలు చేయించలేక సతమతమయ్యే భర్తలకు, ఇప్పుడు మోదీ రూపంలో ఒక స్ట్రాంగ్ రీజన్ దొరికింది. 'నేను కొననని అనడం లేదు, దేశం కోసం మన ప్రధాని వద్దన్నారు.. మనం దేశభక్తులం కదా..' అంటూ భార్యలకు సర్దిచెప్పే అద్భుతమైన అవకాశం రావడంతో హస్బెండ్స్ అంతా లోలోపల ఎగిరి గంతేస్తున్నారు.
వైరల్ అవుతున్న 'టీవీ' సీన్లు:
సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఒక భర్త తన భార్యను పట్టుబట్టి మరీ టీవీ ముందుకు తీసుకెళ్లి, మోదీ గారు 'బంగారం కొనకండి' అని చెబుతున్న క్లిప్పింగ్‌ను పదే పదే చూపిస్తున్నాడు. 'చూశావా.. దేశం కోసం మనం ఈ త్యాగం చేయాల్సిందే, ఇప్పటి నుంచి ఏడాది పాటు నన్ను బంగారం అడగొద్దు' అని ఆయన చెప్పిన డైలాగులకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. జేబుకు పడే చిల్లు తప్పిందని నెట్టింట కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.
ట్రెండింగ్‌లో 'హ్యాపీ హస్బెండ్స్' రీల్స్:
ఇన్ స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో రకరకాల సెటైరికల్ రీల్స్ రాజ్యమేలుతున్నాయి. 'మోదీ గారు మా కష్టాలు గుర్తించారు', 'భర్తల పక్షపాతి ప్రధాని' అంటూ నెటిజన్లు ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. విదేశీ విహారయాత్రలు కూడా వద్దన్నారు కాబట్టి, ఈ ఏడాది పెళ్లి రోజులకు కేవలం 'పానీపూరీ'తో సరిపెట్టేయచ్చని కొందరు జోకులు పేల్చుతున్నారు. రూపాయి విలువ కాపాడటం ఏమో కానీ, భర్తల బ్యాంక్ బ్యాలెన్స్‌కు మాత్రం మోదీ గారు రక్షణ కవచంలా మారారని సెటైర్లు వేస్తున్నారు.
ప్రధాని మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశం దేశ ఆర్థిక భద్రత. కానీ అది కాస్తా భర్తలకు వినోదాన్ని, భార్యలకు నిరాశను మిగిల్చింది. ఏది ఏమైనా, "దేశం కోసం బంగారం కొనడం ఆపేద్దాం" అనే నినాదం ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక హాట్ టాపిక్ అయిపోయింది. ఇక ఈ ఏడాది పాటు నగల షాపుల కంటే భర్తల మొహాల్లోనే ఎక్కువ మెరుపు కనిపిస్తుందనడంలో సందేహం లేదు.
