మనోడు పెట్టే రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఏ రాష్ట్రానికి?
భారత్ లో ఏఐ అవకాశాలపై స్ఫూర్తిదాయక సంభాషణ తమ మధ్య జరిగినట్లుగా పేర్కొంటూ ప్రధాని మోడీని తానుకలిసిన సందర్భంగా తీసిన ఫోటోను పోస్టు చేశారు.
By: Garuda Media | 10 Dec 2025 10:16 AM ISTసినిమాల్లో హీరోలు మాత్రమే చేయగలిగే మేజిక్.. ఒకరు రియల్ లైఫ్ లో చేయగలిగితే అంతకు మించిన మేజిక్ ఏముంటుంది? తాజాగా అలాంటి పనే చేసిన ప్రపంచం ఒక్కసారి భారత్ వైపు చూసేలా చేశారు దిగ్గజ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈవో కం తెలుగోడు సత్య నాదెళ్ల. ఊహించని రీతిలో భారీ ఎత్తున పెట్టుబడుల్ని భారత్ లో పెట్టేందుకు వీలుగా ఆయన భారత ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావటం..అనంతరం భారీ ప్రకటన చేసిన వైనం ఆసక్తికరంగా మారింది.
ఒక తెలుగోడు ఒక అంతర్జాతీయ కంపెనీకి సీఈవో కావటం ఒక ఎత్తు అయితే.. సదరు కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా తన సొంత దేశానికి రూ.1.5 లక్షల కోట్ల భారీ మొత్తాన్ని తీసుకొచ్చిన వైనం చూస్తే వావ్ అనకుండా ఉండలేం. ప్రధాని మోడీతో భేటీ అనంతరం ఈ భారీ పెట్టుబడి వివరాల్ని ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు. భారత్ లో ఏఐ అవకాశాలపై స్ఫూర్తిదాయక సంభాషణ తమ మధ్య జరిగినట్లుగా పేర్కొంటూ ప్రధాని మోడీని తానుకలిసిన సందర్భంగా తీసిన ఫోటోను పోస్టు చేశారు.
‘ఇది ఆసియాలోనే అతి పెద్ద పెట్టుబడి. భారత దేశ ఏఐ ఆశయాలకు మద్దతుగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడుతున్నాం. భారత్ లో ఏఐ రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలు.. నైపుణ్యాలు.. సామర్థ్యాలను అందించేందుకుఈ నిధుల్ని వినియోగిస్తాం. రాబోయే నాలుగేళ్లలోఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెడతాం. ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన 3 బిలియన్ డాలర్లకు ఈ పెట్టుబడి అదనం’’ అంటూ స్పష్టమైన ప్రకటన చేశారు.
ఇదిలా ఉండగా.. మైక్రోసాఫ్ట్ పెట్టుబడి ప్రకటనపై ప్రధాని మోడీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు జరుగుతున్న ఆసక్తికర చర్చ ఏమంటే.. మైక్రోసాఫ్ట్ పెట్టే భారీ పెట్టుబడి భారత్ లోని ఏ రాష్ట్రంలో ఉంటుందన్నది ప్రశ్నగా మారింది. పలువురు ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ లో పెట్టుబడులుపెట్టే వీలుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కొంత మొత్తాన్ని.. గుజరాత్ లో మరికొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టే వీలుందంటున్నారు. ఈ అంచనాలో ఏది నిజమవుతుందన్నది తేలాలంటే మాత్రం మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదు.
