మోడీ సంకేతాలు...జగన్ అలెర్ట్ !
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఏపీలో ఉన్న మూడు ప్రధాన పార్టీలూ మద్దతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.
By: Satya P | 13 May 2026 8:15 AM ISTకేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఏపీలో ఉన్న మూడు ప్రధాన పార్టీలూ మద్దతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. కీలకమైన బిల్లుల ఆమోదం విషయంలో ఏపీలో టీడీపీ జనసేన ఎటూ మిత్ర పక్షాలుగా మద్దతు ఇస్తాయి కానీ ప్రతిపక్షంలో ఉంటూ కూడా వైసీపీ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తూ వస్తోంది. ఇదే రాజకీయ తమాషాగా అంతా చూస్తూంటారు, చెప్పుకుంటారు, ఇక కేంద్రంలోని బీజేపీ పెద్దలతో వైసీపీ అధినాయకత్వానికి మంచి అనుబంధం ఉందని అందుకే సేఫ్ జోన్ లో ఉన్నారని కూడా ప్రచారం సాగుతూ వస్తూంటుంది. వీటి విషయాలు ఎలా ఉన్నా తెర వెనక ఏమి జరుగుతోంది అన్నది ఎవరికీ తెలియకున్నా వైసీపీ మద్దతు మాత్రం అందరికీ అర్ధం అవుతోంది.
బీజేపీని పక్కన బెట్టి :
ఇక ఎన్డీయే కూటమిలో బీజేపీ కూడా ఉన్నా వైసీపీ విమర్శలు కానీ రాజకీయ బాణాలు కానీ మొత్తం టీడీపీ జనసేన మీదకే మళ్ళిస్తూ ఆ పార్టీ వ్యూహాత్మకమైన వైఖరినే అనుసరిస్తూ వస్తోంది. బీజేపీని వైసీపీ పల్లెత్తు మాట అనకపోవడం మీద కూడా ఎవరికి తోచిన విశ్లేషణలు చేస్తూంటారు, ఆలోచనలు కూడా ఎవరికి వారివిగా ఉన్నాయి. అయితే వైసీపీ మాత్రం వేటికీ వెరవకుండా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది. 2029 ఎన్నికల్లోనూ కలసి పోటీ చేస్తామని కూటమిలోని ప్రధాన పార్టీలు చెబుతున్నా ఏదైనా అద్భుతం జరిగి ఆయా పార్టీలు విడిపోకుండా ఉంటాయా అన్న ఆశలు ఆరాటాలు వైసీపీలో నిండుగా మెండుగా ఉన్నాయని కూడా అంటారు. కానీ చూస్తూంటే మిత్రుల మధ్య బంధం మరింతగా బిగుస్తోంది కానీ సడలడం లేదు. దానికి నిలువెత్తు ఉదాహరణగా తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణా పర్యటనలో ప్రత్యేకించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి కూడా వచ్చి వారితో చాలా సేపు గడపడం జరిగింది. దీంతో ముగ్గురు మిత్రులూ మరింత ఉత్సాహంగా 2029 ఎన్నికలకు సిద్ధం అవుతున్నారన్న బలమైన సంకేతాలు అయితే వచ్చేశాయి.
ఎడం పెరుగుతోంది :
ఇక ఏపీలో చూస్తే టీడీపీ జనసేన రెండూ నరేంద్ర మోడీతో కలసి ముందుకు సాగుతున్నాయి. గతం సంగతి ఎలా ఉన్నా చంద్రబాబు పూర్తి అంకితభావంతో బీజేపీ పట్ల తన నిబద్ధతను చూపిస్తున్నారు. నరేంద్ర మోడీకి ఆయన అమితమైన గౌరవాన్ని కూడా ఇస్తున్నారు. మోడీ సైతం అదే రకమైన అభిమానం బాబు పట్ల చూపిస్తున్నారు ఇక పవన్ విషయం చెప్పాల్సింది లేదు. మోడీకి ఆయనంటే ప్రత్యేకమైన మమకారం ఉందని గతంలోనే రుజువు అయింది. పవన్ సైతం మోడీ పట్ల ఒక రకమైన ఆరాధనాభావం తో ముందుకు సాగుతారు. దాంతో ఈ ముగ్గురూ కలిసి కూర్చుని చర్చించారు అంటే తెలుగు నాట రాజకీయం ఏ విధంగా ముందు ముందు సాగుతుంది అన్నది చూడాల్సిందే అంటున్నారు.ఇక అదే సమయంలో వైసీపీతో బీజేపీ అన్న చర్చకు కానీ అనుమానాలకు కానీ తెర దించే విధంగా బీజేపీ వైపు నుంచి గట్టి ప్రయత్నాలే జరుగున్నాయని అంటున్నారు. తమకు నమ్మమైన బలమైన మిత్రులు ఏపీలో ఉండగా జగన్ తో ఉన్నారు అన్న చర్చలు డౌట్లూ ఎందుకు అన్నది కేంద్ర పెద్దలలోనూ ఉంటుందని అంటున్నారు. అందుకే వాటికి తెర దించేలా అందరికీ బాహటంగానే అన్నీ అర్ధం అయ్యేలా బీజేపీ కేంద్ర నాయకత్వం ముందు ముందు వ్యవహరించబోతోంది అని అంటున్నారు.
వైసీపీ అప్రమత్తం :
మోడీ తాజా పర్యటన తరువాత వైసీపీ అప్రమత్తం అవుతోంది అని అంటున్నారు. బీజేపీ రాజకీయ వ్యూహాలు మొత్తం తెలిసిపోయాక కూడా ఇంకా ఆ పార్టీతో ఏదో తెర వెనక బంధం ఉందని భావించినా లేక అలా అనుకుంటూ కూర్చున్నా ఫలితం శూన్యం అని వైసీపీ పెద్దలకు అర్ధం అవుతోంది అని అంటున్నారు. 2024 మాదిరిగానే 2029 ఎన్నికలలోనూ కూటమి బలంగా కలసికట్టుగా దూసుకుని వస్తే తట్టుకునేలా ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని వైసీపీ భావిస్తోంది. అదే సమయంలో కూటమిలోని మిత్రుల కోసం అయినా బీజేపీ వైసీపీ మీద తన దాడులను అన్ని వైపుల నుంచి పెంచే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. అవి ఏ రూపంలో వచ్చినా కాసుకోవడానికి వైసీపీ కూడా రెడీగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే వైసీపీకి మోడీ పర్యటన బలమైన సంకేతం ఇచ్చేసింది. వైసీపీకి కమలం తెర చాటున కూడా కడు దూరం అన్నది తేటతెల్లమవుతోంది. రానున్న పరిణామాలు ఎలా ఉంటాయో బేరీజు వేసుకుని పకడ్ బంధీ చర్యలతో రంగంలోకి దిగడమే వైసీపీ హై కమాండ్ తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం అంటున్నారు.
