మోడీకి ఏపీ గురించి గూగుల్ సీఈఓ ఏమి చెప్పారో తెలుసా..?
ఇటీవల టెక్ దిగ్గజం గూగుల్.. విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
By: Raja Ch | 16 Oct 2025 6:12 PM ISTప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఏపీ పర్యటనలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... కర్నూలు శివారులోని నన్నూరు వద్ద 'సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్' పేరుతో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సభకు మోడీతోపాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా... రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన, నిర్మించబోతున్న రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్రమోడీ వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఏపీకి ఉందని.. ఎన్డీఏ హయాంలో ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారుతోందని అన్నారు.
ఏఐ, కనెక్టివిటీ హబ్ గా విశాఖ!:
ఇటీవల టెక్ దిగ్గజం గూగుల్.. విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్థావించిన మోడీ... గూగుల్ ఏఐ డేటా సెంటర్ ద్వారా సబ్ సీ గేట్ వే గా ఏపీ మారుతుందని.. ఈ ప్రాజెక్టు విశాఖను ఏఐ, కనెక్టివిటీ హబ్ గా మారుస్తుందని.. ఫలితంగా భారత్ తో పాటు యావత్ ప్రపంచానికి సేవలు అందుతాయని తెలిపారు.
మోడీకి గూగుల్ సీఈఓ ఏమి చెప్పారు?:
ఈ సందర్భంగా గూగుల్ సీఈవోతో తనకు జరిగిన సంభాషణను ప్రధాని మోడీ వెల్లడించారు. ఇందులో భాగంగా... అమెరికా బయట ఎన్నో పెట్టుబడులు తమకు ఉన్నాయని గూగుల్ సీఈఓ చెప్పారని.. అయితే, అన్నింట్లో అతిపెద్ద పెట్టుబడి ఆంధ్రాలో పెట్టబోతున్నామని తనతో చెప్పారని.. ఇందులో ఏఐ హబ్ లో పెద్ద ఎత్తున శక్తి వనరులు ఉండబోతున్నాయని మోడీ వెల్లడించారు!
దేశానికి ఏపీ, ఏపీకి రాయలసీమ!:
ఈ సందర్భంగా... భారతదేశ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా అవసరమని చెప్పిన మోడీ.. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి అంతే అవసరమని అన్నారు. ఈ ప్రాజెక్టులు రాయలసీమలోని ప్రతి జిల్లాలో ఉద్యోగాలు సృష్టిస్తాయని.. సీమ ప్రగతికి సరికొత్త ద్వారాలు తెరిపిస్తాయని అన్నారు. ప్రధానంగా.. ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లతో ఉపాధి అవకాశాలు పెరిగాయని తెలిపారు.
ఏపీకి శక్తివంతమైన నాయకత్వం!:
ఇదే సమయంలో... చంద్రబాబు, పవన్ కల్యాణ్ రూపంలో ఏపీకి శక్తిమంతమైన నాయకత్వం ఉందని చెప్పిన మోడీ.. ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు కూడా ఉందని వెల్లడించారు. ఈ క్రమంలోనే గడిచిన 16 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని.. డబుల్ ఇంజిన్ సర్కారుతో రాష్ట్రం అపూర్వ ప్రగతి సాధిస్తోందని తెలిపారు.
