అట్లుంటదీ.. మోదీ ఫోన్ చేస్తే ఏకంగా మీటింగ్ నే ఆపేసిన ఇజ్రాయెల్ ప్రధాని..
ఇజ్రాయెల్-హమాస్ మధ్య గాజా యుద్ధం ముగింపుకు సంబంధించిన శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ప్రపంచ రాజకీయాల్లో భారత్ ప్రాముఖ్యతను చాటిచెప్పే ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
By: A.N.Kumar | 10 Oct 2025 2:05 PM ISTఇజ్రాయెల్-హమాస్ మధ్య గాజా యుద్ధం ముగింపుకు సంబంధించిన శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ప్రపంచ రాజకీయాల్లో భారత్ ప్రాముఖ్యతను చాటిచెప్పే ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత ప్రధాని నరేంద్ర మోదీ తో ఫోన్‌లో మాట్లాడేందుకు ఏకంగా తన కీలక భద్రతా సమావేశాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.
* కీలక భద్రతా సమావేశం మధ్యలో మోదీ ఫోన్!
ఇజ్రాయెల్ ప్రధాన కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. హమాస్‌తో ఒప్పందానికి సంబంధించిన చర్చల కోసం ఇజ్రాయెల్ భద్రతా క్యాబినెట్ అత్యవసర సమావేశం జరుగుతోంది. ఇందులో నెతన్యాహుతో పాటు పలు అత్యంత ముఖ్యమైన భద్రతా అధికారులు పాల్గొన్నారు. సరిగ్గా ఆ కీలక సమయంలోనే భారత ప్రధాని మోదీ నుంచి ఫోన్ వచ్చింది. నెతన్యాహు వెంటనే ఆ సమావేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసి, మోదీతో మాట్లాడారు. ఈ సంభాషణలో ఇద్దరు నేతలు బందీల విడుదలకు సంబంధించిన ఒప్పందాన్ని , గాజాలోని ప్రజల మానవతా సహాయ కార్యక్రమాలను గురించి ముఖ్యంగా చర్చించారు.
* మోదీ అభినందనలు, టెర్రరిజంపై స్పష్టత
ఇజ్రాయెల్ ప్రధాన కార్యాలయం ప్రకారం, నెతన్యాహు మోదీ ఫోన్‌లో మాట్లాడుతూ ఒప్పంద విజయంపై మోదీ అభినందించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ వివరాలను తెలియజేస్తూ మోదీ తన ప్రకటనలో ఏమన్నారంటే.. “గాజాలో యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాధించిన పురోగతికి సంబంధించిన నా స్నేహితుడు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును అభినందించాను. బందీల విడుదలతో పాటు గాజా ప్రజల మానవతా సహాయ కార్యక్రమాలను ప్రోత్సహించడానికి ఈ ఒప్పందాన్ని మేము స్వాగతిస్తున్నాం. ప్రపంచంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అది సహించలేనని నేను పునరుద్ఘాటించాను.”
దీనితో పాటు మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కూడా ఫోన్‌లో మాట్లాడి, చరిత్రాత్మక గాజా శాంతి ప్రణాళిక విజయవంతం కావడానికి కృషి చేసినందుకు అభినందనలు తెలిపారు. అదనంగా ఈ సంభాషణల్లో ఇరు దేశాల వాణిజ్య సంబంధాలపై చర్చలు కూడా జరిగాయని మోదీ వెల్లడించారు.
* భారత్-ఇజ్రాయెల్ మైత్రి, ప్రపంచ వేదికపై భారత్ పాత్ర
ఈ సంభాషణలు భారత్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న మన్నికైన మిత్ర సంబంధాలను.. అంతర్జాతీయ స్థాయిలో భారత్ పాత్రను స్పష్టంగా చూపుతున్నాయి. ఒక ముఖ్యమైన భద్రతా సమావేశాన్ని నిలిపివేసి మరీ, నెతన్యాహు మోదీతో మాట్లాడటం... ప్రపంచ వేదికపై భారత ప్రధాని పలుకుబడికి నిదర్శనం.
శాంతి, మానవతా సహాయం.. గ్లోబల్ సెక్యూరిటీ పరిరక్షణలో భారత్ నిరంతరం తోడ్పాటుని అందిస్తున్నదని ఈ పరిణామం మరింత స్పష్టంగా నిరూపిస్తోంది. ప్రపంచ సమస్యల పరిష్కారంలో భారత్ ఒక క్రియాశీలక శక్తిగా ఎదుగుతోందనే సందేశాన్ని ఈ సంఘటన బలంగా పంపుతోంది.
