Begin typing your search above and press return to search.

మోడీ-పుతిన్-జిన్ పింగ్ క్లోజ్ సంభాషణ.. పాక్ ప్రధానికి ఘోర అవమానం

చైనాలోని తియాన్‌జిన్‌ నగరంలో జరిగిన 25వ షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ దౌత్యపరంగా చురుకైన పాత్ర పోషించారు.

By:  A.N.Kumar   |   1 Sept 2025 11:47 AM IST
మోడీ-పుతిన్-జిన్ పింగ్ క్లోజ్ సంభాషణ.. పాక్ ప్రధానికి ఘోర అవమానం
X

చైనాలోని తియాన్‌జిన్‌ నగరంలో జరిగిన 25వ షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ దౌత్యపరంగా చురుకైన పాత్ర పోషించారు. ఈ సదస్సులో మోదీ ప్రవర్తన అందరి దృష్టిని ఆకర్షించింది, ముఖ్యంగా రష్యా, చైనా దేశాధినేతలతో ఆయన చూపిన సాన్నిహిత్యం, అదే సమయంలో పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ను పట్టించుకోకపోవడం చర్చనీయాంశమైంది.

మోదీ - పుతిన్‌ - జిన్‌పింగ్‌ మధ్య స్నేహపూర్వక వాతావరణం

సదస్సు ప్రారంభంలో భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. ముగ్గురు నేతలు కరచాలనం చేసుకుని, ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ, పుతిన్‌ ఆప్యాయంగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సన్నివేశానికి సంబంధించిన ఫొటోలను మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ "పుతిన్‌ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది" అని పేర్కొన్నారు. ఈ సాన్నిహిత్యం భారత్‌, రష్యా, చైనా మధ్య ఉన్న బలమైన సంబంధాలను సూచిస్తోంది.

- పాక్‌ ప్రధానిని పట్టించుకోని మోదీ

పలు సందర్భాల్లో మోదీ, పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌లను ఎదురెదురుగా వచ్చినా మోదీ ఆయనను పట్టించుకోకుండా, పలకరించకుండా వెళ్లిపోయారు. ఇటీవల జరిగిన 'ఆపరేషన్‌ సిందూర్‌' , పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోదీ పాక్‌ ప్రధాని పట్ల ఈ వైఖరిని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఒకానొక సందర్భంలో పుతిన్‌ ఇతర నాయకులతో మాట్లాడుతున్నప్పుడు షరీఫ్‌ ఆయనతో కరచాలనం చేసేందుకు ప్రయత్నించినా.. పెద్దగా పట్టించుకోనట్టు వెళ్లిపోయారు. ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి.

-ఉగ్రవాదంపై మోదీ కీలక సందేశం

సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ప్రధాని మోదీ, సీమాంతర ఉగ్రవాదం సమస్యను లేవనెత్తారు. ఉగ్రవాదంపై పోరాడటానికి దేశాలన్నీ పరస్పరం సహకరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో పాటు ఇరు దేశాల మధ్య విభేదాలు వివాదాలుగా మారకుండా చూడాలని మోదీ, జిన్‌పింగ్‌ అంగీకరించినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ వెల్లడించారు. ఈ సందేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలకు పరోక్షంగా గట్టి హెచ్చరిక పంపిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

- రష్యాతో ద్వైపాక్షిక చర్చలు

ఈ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ ప్రత్యేకంగా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, అమెరికా విధించిన సుంకాల వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.

మొత్తంగా షాంఘై సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాత్మక దౌత్యం, తన వైఖరితో అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రాముఖ్యతను చాటిచెప్పారు.