మోడీ గట్టి వ్యూహం: నిన్న జీఎస్టీ.. నేడు యూపీఐ!
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉండడమే రాజకీయం. పట్టిన కుందేలుకు మూడు కాళ్లే కాదు.. అవసరం.. అవకాశాన్ని బట్టి నిర్ణయాలు కూడా మార్చాలి.
By: Garuda Media | 12 Sept 2025 1:48 PM ISTఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉండడమే రాజకీయం. పట్టిన కుందేలుకు మూడు కాళ్లే కాదు.. అవసరం.. అవకాశాన్ని బట్టి నిర్ణయాలు కూడా మార్చాలి. ఇది తెలిసిన నాయకుడే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అంటున్నారు పరిశీలకులు. త్వరలోనే మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. వచ్చే రెండు మాసాల్లో కీలకమైన బీహార్ ఎన్నికలు ఉండగా.. వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి. బీహార్‌లో విజయం అంటే.. ప్రస్తుత సీఎం నితీష్‌కుమార్‌తో ఎలానూ కలిసే ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేకపోవచ్చన్న వాదన ఉంది.
కానీ, తమిళనాడు, బెంగాల్‌లో పాగా వేయాలంటే.. మాత్రం అంత ఈజీకాదు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బలమైన ప్రాంతీయ పార్టీల హవా ఉంది. స్థానిక సెంటిమెంట్లు కూడా బలంగానే ఉన్నాయి. వాటిని ఛేదించడం.. అంటే బీజేపీకి అంత ఈజీకాదు. అందుకే.. యూనివర్సల్ సమస్యలను ఏకీకృతం చేసి.. పరిష్కరించే క్రమానికి రాజకీయ పదును పెంచారన్న చర్చ సాగుతోంది. అందుకే.. ఇటీవల జీఎస్టీలో శ్లాబులు తగ్గించారన్న వాదన ఉంది. ఇప్పటి వరకు నాలుగు శ్లాబులుగా ఉన్న జీఎస్టీని కేవలం రెండు శ్లాబులకు పరిమితం చేశారు. ఇది మేలైన నిర్ణయమే అయినా.. ఆర్థికంగా సర్కారుకు ఇరకాటం.
అయినా.. కూడా మోడీ ఈ నిర్ణయం తీసుకుని లక్షల కోట్ల రూపాయలను నష్టపోతున్నారంటేనే.. దీనివెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉందన్న చర్చ సాగుతోంది. నిత్యావసరాల నుంచి వినోదపు వస్తువుల వరకు ధరలు తగ్గనున్నా యి. ఈ నెల 22 నుంచే ఇది అమల్లోకి రానుంది. ఇది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో బీజేపీకి బలమైన ఆయుధంగా మారనుందన్న చర్చ సాగుతోంది. ఇక, తాజాగా యూపీఐ పేమెంట్ల విషయంలోనూ.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా వ్యాపార, వాణిజ్య వర్గాలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ తెరమీదికి వచ్చింది.
ప్రస్తుతం పోన్ పే, పేటీఎం, గూగుల్ పే, భారత్ పే వంటి మాధ్యమాల ద్వారా నగదును బదిలీ చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న యూపీఐ విధానంలో నగదును అధిక మొత్తంలో చెల్లింపులు చేయాల్సి వచ్చినప్పుడు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. లక్ష రూపాయలకు మించి.. పెద్ద మొత్తంలో చెల్లింపులు చేయాల్సి వస్తే.. చెక్కులు, బ్యాంక్ బదిలీలపై ఆధారపడాలి. అయితే.. తాజాగా ఈ విధానంలో మార్పులు చేశారు. వ్యాపారులకు చేసే.. పర్సన్-టు-మర్చంట్ చెల్లింపుల గరిష్ఠ పరిమితిని పెంచారు.
దీని ప్రకారం, నిర్దిష్ట కేటగిరీలలో వ్యాపారులకు వినియోగదారులు 24 గంటల్లో గరిష్ఠంగా 10 లక్షల రూపాయల వరకు చెల్లింపులు చేసే సౌలభ్యం ఏర్పడనుంది. బంగారం సహా వాహనాలు, గృహాలు కొనుగోలు చేసేవారికి ఈ విధానం ఎంతో దోహద పడనుంది. తద్వారా వారంతా కూడా సర్కారు వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు. తొలుత జీఎస్టీ.. ఇప్పుడు యూపీఐ పేమెంట్ల విషయంలో కేంద్రం తీసుకువచ్చిన సంస్కరణలు.. ప్రజలకు, తద్వారా రాజకీయంగా బీజేపీకి మేలు చేస్తాయని చెబుతున్నారు.
