మోడీ కేబినెట్ తాజా నిర్ణయాలతో సామాన్యుడి మీద ఎఫెక్టు ఏంటి?
జనాభా లెక్కలు తేల్చటం అంత సులవైన వ్యవహారం కాదు. దీనికి పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి ఉంటుంది.
By: Garuda Media | 13 Dec 2025 3:26 PM ISTమోడీ మంత్రివర్గం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం కేంద్ర కేబినెట్ సమావేశం సాగింది. ఈ సందర్భంగా కొన్ని సంచలన నిర్ణయాలతో పాటు.. పలు కీలక నిర్ణయాల్ని తీసుకున్నారు. కేంద్ర కేబినెట్ లో తీసుకునే నిర్ణయాల్లో చాలావరకు ప్రజల మీద నేరుగా ప్రభావం చూపించేవిగా ఉండవు. తాజా కేబినెట్ భేటీ సందర్భంగా తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత కీలకమైనది దేశ జనాభా లెక్కల్ని తేల్చేందుకు ఓకే చేస్తూ మోడీ సర్కారు నిర్ణయం తీసుకుంది.
ప్రతి పదేళ్లకు ఒకసారి దేశ జనాభా లెక్కల్ని వేయాల్సి ఉంటుంది. మనదేశంలో చివరగా 2011 లో జనాభా లెక్కలు వేశారు. షెడ్యూల్ లో భాగంగా 2021లో జనాభా లెక్కల మదింపు జరగాల్సి ఉంది. కానీ.. కొవిడ్ మహమ్మారి కారణంగా సాధ్యం కాలేదు. ఆ తర్వాత నుంచి తరచూ ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఆరేళ్ల ఆలస్యంగా జనాభా లెక్కలకు సంబంధించి తాజాగా నిర్ణయం తీసుకున్నారు. 2027 జనాభా లెక్కల ప్రక్రియకు ఓకే చెబుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
జనాభా లెక్కలు తేల్చటం అంత సులవైన వ్యవహారం కాదు. దీనికి పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఖర్చు కూడా ఎక్కువే. అందుకే త్వరలో చేపట్టే జనాభా లెక్కల ప్రక్రియకు అయ్యే ఖర్చుకు సంబంధించి లెక్కలు చూస్తే.. అదెంత భారీ ప్రక్రియ అన్నది అర్థమవుతుంది. 2027 జనాభా లెక్కల ప్రక్రియ కోసం రూ.11,718 కోట్ల బడ్జెట్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ఉన్న తాజా జనాభా లెక్కలు మాత్రమే కాదు డెమోగ్రఫిక్ వివరాల సేకరణకు సాయం చేస్తుందని చెప్పాలి. దేశ జనాభా లెక్కలతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాన్ని కేంద్ర కేబినెట్ తీసుకుంది.
ఇప్పటివరకు గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ పేరును ‘పూజ్య బాపు గ్రామీణ రోజ్ గార్ యోజన’గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం కింద ఒక కుటుంబానికి ఏడాదికి ఉన్న గరిష్ఠ పని దినాలు 100 నుంచి 120 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రోజు కూలీని రూ.240గా నిర్ణయించారు. ఇందుకోసం రూ.1.51 లక్షల కోట్ల నిధుల్ని కేటాయించారు. ఈ నిర్ణయం కూడా సామాన్యులకు.. అత్యంత పేద వర్గాలకు మేలు చేసేదిగా చెప్పాలి. బొగ్గు గనుల్లో పలు సంస్కరణలకు ఓకే చేయటంతో పాటు.. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ఇచ్చే రూ.6వేల మొత్తాన్ని రూ.10వేల వరకు పెంచాలని నిర్ణయించారు.
దేశ వ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఓకే చేసిన కేంద్ర నిర్ణయంతో ఏపీకి నాలుగు.. తెలంగాణకు నాలుగు కేంద్రాల్ని మంజూరు చేశారు. నాలుగు కీలక రైల్వే ప్రాజెక్టులకు ఓకే చేశారు. పీఎం కిసాన్ సంపద యోజన పథకం కింద రూ.6520 కోట్లు కేటాయించారు. సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు ఎన్ సీడీసీ కింద రూ.2వేల కోట్ల ఆర్థిక సాయాన్ని అందించేలా నిర్ణయం తీసుకున్నారు. దేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాల్ని రక్షించుకోవటానికి.. సైబర్ దాడుల్ని నిరోధించటానికి అవసరమైన సైబర సెక్యూరిటీ పాలసీకి ఓకే చేశారు. వీటితో పాటు మరికొన్ని నిర్ణయాల్ని తీసుకున్నారు. అవేమంటే..
- చిన్న ఉపగ్రహాలను (శాటిలైట్లు) ప్రయోగించడానికి వీలుగా తమిళనాడులోని కులశేఖరపట్నం వద్ద కొత్త లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి పచ్చజెండా
- మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ లకు బ్యాంకుల నుంచి సులువుగా రుణాలు లభించేలా రూ.15,000 కోట్లతో కొత్త క్రెడిట్ గ్యారెంటీ పథకానికి పచ్చజెండా.
- క్వాంటం టెక్నాలజీ పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించేందుకు అదనంగా రూ.4 వేల కోట్ల నిధులు కేటాయింపు
- సెమీకండక్టర్ తయారీని ప్రోత్సహానికి రూ.12 వేల ,000 కోట్లు కేటాయింపు.
- కొత్తగా ఏర్పాటు చేసే సెమీ కండక్టర్ తయారీ సంస్థలకు ఆర్థిక సాయం పెంపు.
- దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం వైద్య సేవలను అందించే నేషనల్ టెలి-మెడిసిన్ నెట్‌వర్క్ ఏర్పాటుకు ఓకే.
- నీటిపారుదల పథకాలకు జాతీయ మిషన్ ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్
- 50 ప్రధాన, మధ్యస్థ నీటిపారుదల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి రూ.35,000 కోట్లతో ఒక కొత్త జాతీయ మిషన్‌ను ప్రారంభించేందుకు కేబినెట్ ఓకే.
- భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద ఇంటర్నెట్ సేవలు. ఇందుకు అదనంగా రూ.8వేల కోట్ల నిధులు కేటాయింపు
- ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అదనంగా 1.5 కోట్ల గృహాలను నిర్మించేందుకు ఆమోదం
- 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాన్ని రక్షణ రంగంలో బలోపేతం చేయడానికి, రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి పెంపుకు ఆమోదం
- రాష్ట్రాల ఆర్థిక బలోపేతం కోసం ప్రత్యేక ప్యాకేజీ. ఇందులో భాగంగా రాష్ట్రాలు తమ మూలధన పెంచుకోవడానికి.. వడ్డీ లేని రుణాల రూపంలో రూ.1.3లక్షల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి ఆమోదం.
