మోడీ సర్కార్ 15వ బడ్జెట్ - ఎలా ఉండబోతోంది ?
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్వరానికి సంబంధించి బడ్జెట్ ని ఈ ఆదివారం ప్రవేశపెట్టబోతోంది.
By: Satya P | 31 Jan 2026 9:00 PM ISTకేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్వరానికి సంబంధించి బడ్జెట్ ని ఈ ఆదివారం ప్రవేశపెట్టబోతోంది. ఈ బడ్జెట్ 2014 నుంచి మోడీ ప్రధానిగా ఉంటూ ప్రవేశపెడుతున్న 15వ బడ్జెట్ గా చెబుతున్నారు. అలాగే కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వరసగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ లలో తొమ్మిదవది గా ఉంది. ఈ బడ్జెట్ కోసం దేశంలోని 144 కోట్ల మంది ప్రజానీకం ఎదురుచూస్తున్నారు. ఏ ఏ రంగాలకు ప్రాముఖ్యత ఇస్తారు, ఏ రాష్ట్రాలకు పెద్ద పీట వేస్తారు అన్న చర్చ అయితే వాడిగా వేడిగా సాగుతోంది.
బడ్జెట్ కి కౌంట్ డౌన్ :
ఇక కేంద్ర కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన లోక్‌సభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఉదయం పదకొండు గంటలకు ప్రవేశపెట్టనున్నారు. సుమారు రెండు గంటల పాటు ఆర్ధిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ఉండబోతోంది. లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ ప్రతిని రాజ్యసభలో ప్రవేశపెడతారు. 2019లో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి నిర్మలా సీతారామన్ వరుసగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది తొమ్మిదోసారి. నరేంద్ర మోదీ ప్రభుత్వం తన మూడో పర్యాయంలో ప్రవేశపెట్టే మూడవ బడ్జెట్ ఇది.
వెంటనే అందుబాటులోకి :
ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత బడ్జెట్ పత్రాలు మొబైల్ యాప్ వెబ్‌సైట్‌లో వెంటనే అందుబాటులో ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆర్థిక మంత్రి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు ముప్పై మంది కళాశాల విద్యార్థులతో ముచ్చటించనున్నారని తెలుస్తోంది.
భారీ కసరత్తుతో :
ఇక కేంద్ర బడ్జెట్ తయారీకి ముందు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారానం ఆర్థికవేత్తలు, కార్మిక సంఘాలు, విద్య ఆరోగ్య రంగం, ఎంఎస్‌ఎంఈ, వాణిజ్యం సేవలు, పరిశ్రమ, ఆర్థిక రంగం మూలధన మార్కెట్లకు చెందిన నిపుణులు ప్రతినిధులతో సహా పలు రంగాలకు చెందిన వాటాదారులతో బడ్జెట్ పూర్వ సంప్రదింపుల సమావేశాలు నిర్వహించారు. అదే విధంగా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా వ్యవసాయం గ్రామీణాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై విస్తృతమైన సంప్రదింపులు జరిపి సూచనలతో కూడిన నివేదికను ఆర్థిక మంత్రికి సమర్పించారు. అంతే కాదు బడ్జెట్ తయారీ ప్రక్రియలో యువతతో సహా పౌరుల నుండి వివిధ వేదికల ద్వారా పలు సూచనలు స్వీకరించబడ్డాయని చెబుతున్నారు. ఇవన్నీ కూడా రాబోయే 2026-27 కేంద్ర బడ్జెట్‌లో ప్రతిబింబిస్తాయని అంటున్నారు.
ఈ రంగాలే కీలకం :
ఇక కేంద్ర బడ్జెట్ లో రక్షణ రంగానికి పెద్ద పీట వేస్తారు అని అంటున్నారు. అలాగే మౌలిక సదుపాయాల విషయంలో మరిన్ని నిధులు సమకూరుస్తారని అంటున్నారు. అంతే కాదు మూలధన వ్యయంపై దృష్టి సారించే అవకాశం ఉందని అంటున్నారు. ఆర్ధిక వృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే ఆర్థిక క్రమశిక్షణ పాటించడంపైన కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుందని చెబుతున్నారు. ఇక విద్యుత్ రంగంతో పాటు అందరికీ అందుబాటు ధరలలో సొంత ఇళ్ళ నిర్మాణం వంటి వాటికి ప్రాధాన్యత లభిస్తుందని చెబుతున్నారు.
బడ్జెట్ సైజు చూస్తే :
ఇక ఒక్కసారి చూస్తే కనుక 2025-26 బడ్జెట్ ని గత ఏడాది ఫిబ్రవరి 1 కేంద్రం ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్ మొత్తం వ్యయం 50.65 లక్షల కోట్ల రూపాయలతో రూపొందించారు. వసూళ్లు 34.96 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఈసారి బడ్జెట్ లో అంతకు మించి సైజు ఉంటుందా అన్న చర్చ సాగుతోంది. అదే కనుక జరిగితే కేంద్ర బడ్జెట్ 60 లక్షల దాకా ఏగబాకుతుందని అంటున్నారు.
ఎన్నికల రాష్ట్రాలు :
ఈసారి బడ్జెట్ లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రాధాన్యత ఉండొచ్చు అని అంటున్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరీలకు భారీగా నిధుల వరద పారుతుందని అంటున్నారు. చూడాలి మరి నిర్మలమ్మ బడ్జెట్ ఏ విశేషాలను మోసుకుని వస్తుందో.
