Begin typing your search above and press return to search.

మోడీ జెన్ జీ స్లాంగ్... వారితో డైరెక్ట్ కనెక్షన్ !

నరేంద్ర మోడీని అత్యంత విజయవంతమైన నాయకుడుగా ఎందుకు చెబుతారు అన్నది కనుక విశ్లేషించుకుంటే చాలా విషయాలు బోధపడతాయి.

By:  Satya P   |   18 Sept 2026 9:27 AM IST
మోడీ జెన్ జీ స్లాంగ్... వారితో డైరెక్ట్ కనెక్షన్ !
X

నరేంద్ర మోడీని అత్యంత విజయవంతమైన నాయకుడుగా ఎందుకు చెబుతారు అన్నది కనుక విశ్లేషించుకుంటే చాలా విషయాలు బోధపడతాయి. ఆయన చిన్న కుదుపులు తన రాజకీయ ప్రస్థానంలో వచ్చినా వెంటనే గమనిస్తారు. వాటిని సరి చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ముందుకు వస్తారు. లోటు ఎక్కడ జరిగిందో దానిని పూరించేందుకు చూస్తారు. అందుకే పాతికేళ్ళుగా ముఖ్యమంత్రిగా ప్రధానిగా అధికార కేంద్రంలో ఆయన ఉన్నారు. ఊరకే విజయాలు ఎవరి దరికీ చేరవు. మోడీ వంటి గ్లోబల్ లీడర్ కూడా అవసరమైన వేళ గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితులను చూసి మరీ కొత్త వ్యూహాలు రూపొందించగలరు. ఒక్క మాటలో చెప్పాలీ అంటే మోడీ ఎదుగుదల ఆకాశం వైపుగా సాగుతున్నా వాటి వేళ్ళు మాత్రం భూమి లోతుల్లోనే ఉన్నాయి. ఆయన కార్యకర్త నుంచి వచ్చిన నాయకుడు. అందుకే మోడీ వెంట విజయాలు అని అంటున్నారు.

జెన్ జీ తో ట్యూనప్ :

ఈ రోజున దేశంలో జెన్ జీ చురుకుదనంగా ఉంది. ఎంతలా ఉంది అంటే జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనను నిర్వహించి మరీ ఏకంగా ఒక కేంద్ర మంత్రిని రాజీనామా చేయించింది. మోడీ ప్రభుత్వం అంటే అత్యంత బలమైన ప్రభుత్వంగా చూస్తారు. అలాంటి ప్రభుత్వాన్నే షేక్ చేసేలా జెన్ జీల ఉద్యమం సాగింది. అయితే ఈ పరిణామాల నుంచి మోడీ చాలానే తెలుసుకున్నారు అని అంటున్నారు. ఆయన అప్పటి నుంచి మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. అంతే కాదు ఆయన యువతతో నేరుగా అనుసంధానం అయ్యేందుకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకుంటున్నారు. ఇక ఆయన ఇపుడు జెన్ జీ స్లాంగ్ నే వాడుతున్నారు అంటే మోడీ ఎంత స్పీడ్ గా ముందుకు పోతున్నారో అర్థం అవుతోంది కదా అంటున్నారు.

మోడీ స్పీచ్ చూస్తే :

ఇటీవల కాలంలో మోడీ స్పీచ్ బాగా మారింది అని అంటున్నారు ఆయన ఎక్కడ మాట్లాడినా యువతను ఆకర్షించేందుకు ఏకంగా జెన్ జీ స్లాంగ్ నే ఉపయోగిస్తున్నారు. అందుకోసం ఆయన జెన్ జీ భాషలోని పదాలను కూడా పట్టుకున్నారు. ఇటీవల ఆయన ఢిల్లీలోని శ్రీరాం కాలేజ్ ఆఫ్ కామర్స్ సభకు హాజరైనప్పుడు చేసిన ప్రసంగంలో దొర్లిన జెన్ జీ స్లాంగ్ ని అంతా గుర్తు చేస్తున్నారు. ఈ సభలో ఆయన ఓజీ అన్న పదాన్ని వాడారు. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అన్న మాట. పూర్వ విద్యార్ధులను ఓజీలుగా పిలుస్తారు. అలాంటి జెన్ జీ స్లాంగ్ ని పట్టి మోడీ ప్రయోగించడంతో యూత్ నుంచి కేరింతలు ఒక్కసారిగా వచ్చాయని అంటున్నారు.

వారి భాషలోనే :

ఇక ఇదే సభలో అయన ఫ్లెక్స్ అన్న పదాన్ని కూడా వాడారు. ఈ రోజుల్లో కూడా ఢిల్లీ యూనివర్సిటీలో మీరు ఎస్‌ఆర్‌సీసీ విద్యార్థి అని చెప్పుకోవడం ఒక ఫ్లెక్స్ లాంటిది అంటూ ఫ్లెక్స్ పద ప్రయోగం చేశారు. మరి ఫ్లెక్స్ అన్న దానికి జెజ్ జీ భాషలో అర్ధం ఏంటి అంటే ఎవరైనా తమకున్న హోదాను కానీ టాలెంట్ ని కానీ సక్సెస్ ని కానీ చాలా గొప్పగా చెప్పుకోవడం కానీ చూపించడం కానీ చేయడాన్ని ఫ్లెక్స్ అంటారు. మరి మోడీ ఈ పద ప్రయోగంతో జెన్ జీ యూత్ కి బాగా దగ్గర అయ్యారు అని అంటున్నారు. ఇక మోడీ మరో పద ప్రయోగం కూడా తరచూ చేస్తున్నారు. దాని పేరు ఫోమో. ఈ పదం సోషల్ మీడియాలో ఎక్కువగా పాపులర్. జెన్ జీ వాడే మాటగా కూడా ఉంటుంది.

ట్రెండింగ్ పదాలతో :

ఈ విధంగా చూస్తే మోడీ జెన్ జీ యూత్ ఎక్కువగా వాడే ట్రెండింగ్ పదాలను తన ప్రసంగాలలో ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారని అంటున్నారు. కేవలం బహిరంగ సభలలో ప్రసంగాలే కాకుండా సోషల్ మీడియాలో సైతం మోడీ ప్రతీ రోజూ యాక్టివ్‌గా ఉంటూ యువత ఆలోచనలకు తగినట్లుగా సెల్ఫీ వీడియోలు చేస్తున్నారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా నేరుగా కనెక్ట్ అవుతున్నారు. సాంప్రదాయ రాజకీయ ప్రసంగాలకు భిన్నంగా ఈనాటి డిజిటల్ జనరేషన్ మాట్లాడే భాషను, వారి శైలిని అనుసరిస్తూ రాజకీయ ఉపన్యాసాలు చేయడం ద్వారా మోడీ తన స్పీడ్ ని పెంచారనే అంటున్నారు. ఇదే జోరులో రానున్న రోజులలో మోడీ మరెన్ని జెన్ జీ పదాలు తన స్పీచ్ ద్వారా చెబుతారో చూడాల్సి ఉంది. మొత్తానికి జెన్ జీతో డైరెక్ట్ కనెక్షన్ కోసం రాజకీయ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మోడీ రూటే సెపరేట్ ఈ విషయంలో అని చెప్పాల్సి ఉంది.