56 ఏళ్ళ యువకుడు....మోడీ సెటైర్లు ఎవరి మీద ?
దేశంలో గడచిన నెల రోజులుగా ఎన్నో పరిణామాలు జరిగాయని వాటి మీద అర్ధవంతమైన చర్చకు పార్లమెంట్ సిద్ధంగా ఉందని మోడీ చెప్పారు.
By: Satya P | 20 July 2026 12:25 PM ISTపార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా చాలా కాలం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తనదైన శైలిలో విపక్షాల మీద విమర్శలు చేశారు. పార్లమెంట్ అంటే బలమైన వాదనలకు వేదిక కావాలని ఆయన కోరారు. అంతే తప్ప అక్కడ శబ్దాలకు తావు లేదని అన్నారు. దేశంలో గడచిన నెల రోజులుగా ఎన్నో పరిణామాలు జరిగాయని వాటి మీద అర్ధవంతమైన చర్చకు పార్లమెంట్ సిద్ధంగా ఉందని మోడీ చెప్పారు.
యువత విజయం అంటూ :
ఇదిలా ఉంటే మోడీ అంతరిక్షంలోకి స్కైరూట్ సంస్థ విక్రమ్ రాకెట్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపడం మీద హర్షం వ్యక్తం చేశారు. ఇది 28 ఏళ్ళ యువత సాధించిన ఘన విజయం అని మోడీ అన్నారు. దేశానికి ఇది గర్వకారణం అంటూ మన యువత కొత్త ఆలోచనలకు కేంద్ర బిందువుగా మారారు అన్నారు. భారతీయ యువ శక్తిని వారు అన్ని విధాలుగా చాటుతున్నారు అని మోడీ చెప్పుకొచ్చారు.
ఆయన గురించేనా :
ఇదే సందర్భంలో మోడీ తాను 56 ఏళ్ళ యువకుడు గురించి మాట్లాడటం లేదని సెటైర్లు వేశారు. ఎవరా యువకుడు అంటే రాహుల్ గాంధీ గురించేనా మోడీ ఈ విధంగా ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేశారు అని అంతా చర్చించుకుంటున్నారు. రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న నేపధ్యంలో మీడియా ముఖంగా ఆయన ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు అన్న మాట. తాను దేశీయ యువత విజయాల గురించే ప్రస్తావిస్తున్నాను వారే దేశానికి గర్వకారణం అంటూనే 56 ఏళ్ళ యువకుడు అని రాహుల్ ని ఇండైరెక్ట్ గా మోడీ ఎద్దేవా చేశారు అని చర్చించుకుంటున్నారు.
సభకు సహకరించాలి :
పార్లమెంట్ సజావుగా సాగేందుకు ఎంపీలు అంతా సహకరించాలని మోడీ కోరారు. ప్రజా స్వామ్యం అంటేనే చర్చలు ఉంటాయి వాదనలు ఉంటాయని ఆయన అంటూ వీటి కారణంగా సభా సమయం వృధా కారాదు అని విపక్షాలకు మోడీ హితవు పలికారు. ప్రజలకు మేలు చేసే నిర్ణయాల మీదనే సభ దృష్టి పెట్టాలని సూచించారు. పశ్చిమాసియా సంక్షోభం వల్లనే చమురు ధరలు పెరిగాయని యుద్ధం వల్ల అన్ని దేశాలు నష్టపోతున్నాయని మోడీ అన్నారు. అయినా సరే భారత దేశం ఈ సమస్యము సమర్ధంగా ఎదుర్కొందని మోడీ చెప్పారు. మొత్తం మీద మోడీ చేసిన 56 ఏళ్ళ యువకుడు కామెంట్స్ మాత్రం వైరల్ అయ్యాయి. మరి దీనిని రాహుల్ నుండి ఏ విధమైన రియాక్షన్ ఉంటుందో చూడాల్సి ఉంది. ఎందుకంటే రాహుల్ ట్వీట్ల ద్వారా అలాగే పార్లమెంట్ లో స్పీచ్ ద్వారా మీడియా ముఖంగానూ మోడీ మీద విమర్శలు ఎక్కుపెడుతూ ఉంటారు. మరి ఆయన మోడీ ప్రభుత్వం గురించి ఏ విధమైన కొత్త వాదనలతో ముందుకు వస్తారో చూడాల్సిందే.
