మోదీ ఆస్తులు 3 కోట్లు.. 35 కోట్లు కోల్పోయిన ఆయన కేబినెట్ మంత్రి
ఈ క్రమంలో మోదీ ఆస్తుల విలువ రూ.3.02 కోట్లకు చేరిందని తెలిపింది. ఏడీఆర్ వార్షిక నివేదిక ప్రకారం.. 2 014తో పోలిస్తే మోదీ ఆస్తులు 82 శాతం పెరిగాయి.
By: Tupaki Political Desk | 8 Jan 2026 4:00 PM ISTవిమర్శకుల ఆరోపణలు ఎలా ఉన్నా.. సిద్ధాంతాల పరంగా విభేదాలు ఉన్నా.. కొన్ని విషయాల్లో తీవ్ర విమర్శలు ఉన్నా.. ప్రధాని మోదీ ఎంతటి నిజాయితీపరుడో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. 2002 నుంచి 2014 వరకు దాదాపు 13 ఏళ్లు గుజరాత్ సీఎంగా, 2014 నుంచి దాదాపు 12 ఏళ్లుగా దేశ ప్రధానిగా ఉన్న ఆయన ఎలాంటి అవినీతి మచ్చలేని నాయకుడిగా నిలిచారు. తాజాగా ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) బయటపెట్టిన నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. వరుసగా మూడుసార్లు ఎంపీగా గెలిచిన నాయకుల ఆస్తుల వివరాలను ఏడీఆర్ వెల్లడించింది. అంటే, 2014 నుంచి ఎంపీలుగా ఉన్నవారి ఆస్తుల పెరుగుదల ఎలా ఉంది? అని విశ్లేషించింది. ఈ క్రమంలో మోదీ ఆస్తుల విలువ రూ.3.02 కోట్లకు చేరిందని తెలిపింది. ఏడీఆర్ వార్షిక నివేదిక ప్రకారం.. 2 014తో పోలిస్తే మోదీ ఆస్తులు 82 శాతం పెరిగాయి. 2014లో రూ.1.65 కోట్లు ఉండగా.. 2019కి రూ.2.51 కోట్లకు పెరిగాయి. ఆస్తుల పెరుగుదల పరంగా ఆయన 94వ స్థానంలో ఉన్నారు. లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆస్తులు ఇదే సమయంలో రూ.9.40 కోట్ల నుంచి రూ.20.39 కోట్లకు (117 శాతం పెరుగుదల-38వ స్థానం) పెరిగాయి. 2019లో ఇది రూ.15.88 కోట్లు. కాగా, 102 మంది హ్యాట్రిక్ ఎంపీల సగటు ఆస్తులు 110 శాతం పెరిగినట్లు ఏడీఆర్ విశ్లేషించింది. అత్యధిక ఆస్తి విలువ పెరిగిన టాప్ 10 ఎంపీల్లో ఐదుగురు బీజేపీవాళ్లే.
ఆ కేంద్ర మంత్రి మాత్రం సంపద కోల్పోయారు
మోదీ ప్రభుత్వంలో జల శక్తి శాఖ మంత్రిగా కీలక పదవిలో ఉన్న సీఆర్ పాటిల్ ఆస్తులు దాదాపు సగం మేర తగ్గడం గమనార్హం. మోదీ సొంత రాష్ట్రమే అయిన గుజరాత్ లోని నవ్ సారీ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న పాటిల్.. రికార్డు మెజారిటీలతో గెలుస్తూ వస్తున్నారు. పాటిల్ ఆస్తి 2014లో రూ.74.47 కోట్లు కాగా, 2019లో అది రూ.44.60 కోట్లకు, 2024లో రూ.39.49 కోట్లకు పడిపోయింది. అంటే, రూ.34,98 కోట్లు తగ్గింది. ఆస్తులు తగ్గిన ఏకైక ఎంపీ ఈయనే కావడం గమనార్హం.
మన తెలుగు ఎంపీల పరిస్థితి ఏమిటి?
హైదరాబా ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. 2004 నుంచి హైదరాబాద్ ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. ఐదుసార్లు ఎంపీ అయిన ఆయన ఆస్తులు 488 శాతం పెరిగాయి. మొత్తం పెరుగుదల పరంగా దేశంలో ఒవైసీ 24వ స్థానంలో ఉన్నారు. ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీకి చెందిన కీలక ఎంపీ మిథున్ రెడ్డి (రాజంపేట) ఆస్తులు 550 శాతం పెరిగినట్లు ఏడీఆర్ విశ్లేషించింది. మరో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (కడప) ఆస్తులు 474 శాతం పెరిగినట్లు పేర్కొంది. ఈ ఇద్దరు ఎంపీల సగటు ఆస్తుల పెరుగుదల 532 శాతంగా ఉందని వివరించింది. మిథున్ రెడ్డి ఆస్తులు ఆయన తొలిసారిగా గెలిచిన 2014లో రూ.22 కోట్లు కాగా 2019కి రూ.66 కోట్లకు, 2024కు రూ.146 కోట్లు అయ్యాయి. భారీగా ఆస్తులు పెరిగిన ఎంపీల్లో ఆయన దేశంలో మూడోస్థానంలో ఉన్నారు. అవినాష్‌రెడ్డి ఆస్తులు 2014లో రూ.7 కోట్లు, 2019కి రూ.18 కోట్లు, 2025కు రూ.40 కోట్లకు చేరాయి. ఈయన 15వ స్థానంలో నిలిచారు. టీడీపీ నుంచి గత మూడు ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎంపీ అయిన ప్రస్తుత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆస్తులు పదేళ్లలో 177 శాతం పెరిగాయి. ఈయన 28వ స్థానంలో ఉన్నారు.
ఆ ఒక్కరు ఎవరు?
2014 నుంచి వరుసగా (మూడుసార్లు) గెలిచిన ఎంపీలు 103 మంది. వీరిలో కేంద్ర ఎన్నికల సంఘానికి అఫిడవిట్లు సమర్పించినవారు 102. ఒక్కరే మినహాయింపు. అది ఎవరనేది తెలియాల్సి ఉంది. పార్టీల పరంగా చూస్తే దేశంలో జార్ఖండ్ అధికార పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా ఆస్తులు 804 శాతం పెరిగాయి. దేశంలో ఈ పార్టీనే టాప్ లో ఉండగా.. తర్వాతి స్థానం వైఎస్సార్‌సీపీ (532 శాతం) కావడం గమనార్హం. హ్యాట్రిక్ ఎంపీల్లో బీజేపీ నుంచి 65 మంది ఆస్తులు సగటున రూ.16.90 కోట్లు (108 శాతం) పెరిగాయి. కాంగ్రెస్ నుంచి ఇలా గెలిచినవారు 8 మంది కాగా వీరి ఆస్తులు రూ.6.99 కోట్లు (135 శాతం) పెరిగాయి.
