Begin typing your search above and press return to search.

చైనా అధ్యక్షుడి రైట్ హ్యాండ్ తో మోదీ భేటి.. ఏంటీ కథ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అత్యంత నమ్మకస్థుడైన కైక్వీతో ఇటీవల జరిపిన భేటీ అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

By:  A.N.Kumar   |   2 Sept 2025 6:00 PM IST
చైనా అధ్యక్షుడి రైట్ హ్యాండ్ తో మోదీ భేటి.. ఏంటీ కథ
X

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అత్యంత నమ్మకస్థుడైన కైక్వీతో ఇటీవల జరిపిన భేటీ అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇది కేవలం ఒక సాధారణ సమావేశం కాదు.. భారత్-చైనా సంబంధాల్లో కొత్త శకం మొదలవుతోందన్న సంకేతాలను పంపింది. మరి ఈ భేటీ వెనుక ఉన్న అసలు మర్మం ఏమిటో చూద్దాం.

- కైక్వీ ఎవరు? ఎందుకంత ప్రాముఖ్యత?

కైక్వీ చైనా రాజకీయాల్లో ఒక కీలక వ్యక్తి. ఆయనను "నవ్వని నాయకుడు" అని దౌత్య వర్గాలు వర్ణిస్తాయి. సాధారణంగా ఆయన విదేశీ నేతలను కలవడం చాలా అరుదు. అయితే ఈసారి స్వయంగా జిన్‌పింగ్‌ ఆదేశాల మేరకు ఆయన మోదీతో సమావేశమయ్యారు. ఈయన ప్రస్తుతం చైనా కమ్యూనిస్టు పార్టీ సెక్రటేరియట్‌లో ఫస్ట్ ర్యాంకింగ్ హోదా, పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యత్వం వంటి కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఆయన జిన్‌పింగ్‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు. ఈ రెండు పదవులను ఒకేసారి చేపట్టిన అరుదైన వ్యక్తి ఈయనే. చైనా అధికార క్రమంలో ఆయన ఐదో స్థానంలో ఉన్నారు.

- మోదీ-కైక్వీ భేటీ ప్రాముఖ్యత

మోదీ-కైక్వీ మధ్య దాదాపు 45 నిమిషాల పాటు భేటీ జరిగింది. ఈ సమావేశం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎస్‌సీవో సమావేశంలో పాల్గొన్న ఇతర దేశాల నాయకులను కైక్వీ బహిరంగంగా కలవలేదు. కానీ మోదీతో ద్వైపాక్షిక భేటీకి హాజరయ్యారు. ఇది ఇరు దేశాల సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి చైనా ఆసక్తి చూపుతోందనే ఒక బలమైన దౌత్య సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు. జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడు, నమ్మకస్థుడు అయిన కైక్వీని సంప్రదింపులకు పంపడం ద్వారా భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి చైనా సీరియస్‌గా ఉందని స్పష్టమవుతోంది. ఇది చైనాలోని భారత వ్యతిరేక వర్గాలకు కూడా ఒక కఠిన సందేశాన్ని పంపినట్లు కనిపిస్తోంది. గాల్వాన్ లోయ ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. ఈ భేటీ ద్వారా సరిహద్దు సమస్యలు, ఆర్థిక సహకారం వంటి విషయాలపై ఇరుదేశాల మధ్య పురోగతి సాధించేందుకు అవకాశం ఉందని భావిస్తున్నారు.

- జిన్‌పింగ్‌తో కైక్వీ బంధం

కైక్వీ రాజకీయ ప్రస్థానంలో జిన్‌పింగ్‌ పాత్ర చాలా కీలకమైంది. ఫుజియాన్ ప్రావిన్స్‌లో 1980ల్లో వారి పరిచయం మొదలైంది. జిన్‌పింగ్‌కు కైక్వీ ఎంతో విధేయుడు. కైక్వీనే తొలిసారి జిన్‌పింగ్‌ను మావో జెడాంగ్‌తో పోల్చారు. ఆయన రాజకీయ జీవితంలో అనూహ్యంగా ఎదుగుతూ ఇప్పుడు జిన్‌పింగ్‌కు అత్యంత కీలకమైన కుడిభుజంగా మారారు.

- భవిష్యత్ ఏం సూచిస్తుంది?

మోదీ-కైక్వీ భేటీ కేవలం ఒక ప్రోటోకాల్ సమావేశం కాదని, భారత్-చైనా సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను తగ్గించి, శాంతియుత మార్గంలో ముందుకు సాగడానికి ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించవచ్చు. అయితే భవిష్యత్తులో ఈ సానుకూల సంకేతాలు ఎంతవరకు వాస్తవ రూపం దాల్చుతాయో వేచి చూడాలి.