తప్పుకున్న కేంద్ర మంత్రి ...విస్తరణకు మోడీ రెడీ !
కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు ప్రధాని నరేంద్ర మోడీ రంగం సిద్ధం చేస్తున్నారు అని అంటున్నారు.
By: Satya P | 14 Oct 2026 8:49 AM ISTకేంద్ర మంత్రి వర్గ విస్తరణకు ప్రధాని నరేంద్ర మోడీ రంగం సిద్ధం చేస్తున్నారు అని అంటున్నారు. హస్తినలో అయితే దీని మీద ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. జూన్ నెల నుంచి ఇదే ప్రచారం సాగుతున్నా ఈసారి మాత్రం నూరు శాతం విస్తరణ జరిగి తీరుతుందని అంటున్నారు. మరో రెండు నెలలలో సగం పాలన మోడీ సర్కార్ కి పూర్తి అవుతుంది. దాంతో పాటు 2027 మొదవుతూనే యూపీ లాంటి పెద్ద రాష్ట్రాలకు గుజరాత్ లాంటి బీజేపీ హాట్ ఫేవరేట్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు ఉన్నాయి. దాంతో విస్తరణ అనివార్యంగా ఉంది అని అంటున్నారు.
మురుగన్ రాజీనామాతో కౌంట్ డౌన్ :
సడెన్ గా మోడీ కేబినెట్ నుంచి కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా చేయడం ఈ ఊహాగానాలకు బలం ఇస్తోంది. తమిళనాడుకు చెందిన మురుగన్ మోడీ కేబినెట్ లో గత అయిదేళ్ళుగా పనిచేస్తున్నారు. ఆయన తమిళనాడు నుంచి లోక్ సభకు గెలవలేదు, రాజ్యసభ సభ్యుడిగా రెండు సార్లు ఉంటూ కేంద్రంలో మంత్రిగా కొనసాగుతున్నారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయమంత్రిగా ఆయన సమర్థంగానే పనిచేస్తున్నారు. అలాంటి మురుగన్ తప్పుకోవడం అన్నది ఇపుడు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన మంత్రి పదవికే కాదు తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాదు నేరుగా ఆయన ప్రధాని నరేంద్రమోడీకి రాశారు.
తమిళనాడు పార్టీ కోసం :
ఇక రాజీనామా చేసిన మురుగన్ తన భవిష్యత్తు లక్ష్యాలను వ్యక్తం చేశారు. తమిళనాడులో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన ప్రకటించారు. అంతే కాదు 2029 లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావడానికి పూర్తి స్థాయిలో తన సమయాన్ని మొత్తం కేటాయించాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇక తనను కేంద్ర మంత్రిగా అయిదేళ్ళ పాటు కొనసాగించినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో పనిచేయడం తన జీవితంలో లభించిన గొప్ప గౌరవంగా అభివర్ణించారు. ఇక బీజేపీ పెద్దలు తరచూ చెబుతున్నట్లుగా పార్టీ కోసం కొందరు కేంద్ర మంత్రులను వాడుకుంటారు అని అంటున్నారు. అలాగే ఈ మధ్య రాజ్యసభ సీట్లను భర్తీ చేసినపుడు కూడా కొందరు కేంద్ర మంత్రులను కొనసాగించలేదు. లేటెస్ట్ గా గవర్నర్ పదవులను భర్తీ చేశారు. ఇవన్నీ చూసినపుడు కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు వేళాయేరా అన్నది ప్రచారంలో ఉంది.
సమర్ధులకు చోటు :
మోడీ మంత్రి వర్గంలో ప్రస్తుతం 72 మంది మంత్రులు ఉన్నారు. ఇందులో కేబినెట్ మంత్రులుగా 30 మంది ఉంటే స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు అయిదుగురు ఉన్నారు. సహాయ మంత్రులు 36 మంది ఉన్నరు. ఇలా చూస్తే మొత్తం ప్రధానితో కలిపి 72 మంది అయ్యారు. వీరిలో కొందరికి పార్టీ బాధ్యతలు అప్పగించారు. మరి కొందరు తప్పుకుంటున్నారు దాంతో పాటు కొందరు కేంద్ర మంత్రుల మీద నాలుగైదు శాఖల భారం పడుతోంది. దాంతో ఈసారి పూర్తి స్థాయి విస్తరణ జరిపి యువతకు పెద్ద పీట వేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. అలాగే అనుభవం కూడా చూస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం అన్నీ మంచి రోజులే కాబట్టే నవరాత్రి ఉత్సవాలు ముగిసిన తరువాత ఈ నెలాఖరులో పూర్తి స్థాయిలో కేంద్ర మంత్రి వర్గ ప్రక్షాళన ఉండొచ్చు అని అంటున్నారు.
