సగం మందిని సాగనంపుతారా ?!
నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతాపార్టీ డిమాండ్ చేసింది.
By: Garuda Media | 10 Sept 2026 12:00 AM ISTకేంద్ర ప్రభుత్వం నుండి త్వరలో సగం మందిని పదవుల నుండి తొలగిస్తారా ? ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో భారీ ఎత్తున కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు జరగనున్నాయా ? కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో 2029 ఎన్నికల్లో అధికారం లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుందా ? అంటే కేంద్ర ప్రభుత్వ వర్గాలు, బీజేపీ సీనియర్ నేతలు అవుననే చెబుతున్నారు.
నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతాపార్టీ డిమాండ్ చేసింది. కానీ కేంద్రం దానిని పట్టించుకోలేదు. జంతర్ మంతర్ కేంద్రంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలప దేశాన్ని కుదిపేసిన పరిస్థితుల్లో తప్పనిసరిగా వారితో చర్చలు జరిపి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేసి ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు ఇవ్వాల్సి వచ్చింది.
త్వరలో కీలకమైన పంజాబ్, యూపీ రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించారని సమాచారం. ప్రస్తుతం 81 స్థానాలకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా 69 మంది మంత్రివర్గంలో ఉన్నారు. మరో 12 ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం ఎవరికి అవకాశాలు రానున్నాయి అన్న చర్చ జరుగుతోంది.
కేంద్ర మంత్రి వర్గంలో ఉన్న జార్జ్ కురియన్ రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో పదవికి రాజీనామా చేశారు. రవనీత్ సింగ్ రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో ఆయనను పంజాబ్ ఎన్నికల మీద ఫోకస్ పెట్టాలని సూచించారు. యూపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పంకజ్ చౌదరి, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా వెళ్లిన హర్ష్ మల్హోత్రాలను ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న సూత్రం ప్రకారం కేంద్ర మంత్రి పదవుల నుండి తప్పించే అవకాశం ఉందని అంటున్నారు. పెట్రోలియం మంత్ హర్ధీప్ సింగ్ పూరి రాజ్యసభ టర్మ్ నవంబర్ లో ముగుస్తుంది. ఆయనను కూడా మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో కొత్తగా మంత్రి వర్గంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్, అనురాగ్ ఠాగూర్, షిండే శివసేన నుండి శ్రీకాంత్ షిండే, యూపీ, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల నుండి అరుణ్ గోవిల్, విష్ణు దత్ శర్మల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మిత్ర పక్షాలకు అవకాశం కల్పించడం, ఖాళీ స్థానాలను భర్తీ చేయడం, వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
