కేంద్రంలో కొత్త మంత్రులు.. ఏపీ నుంచి ఒకరికి చాన్స్!
ప్రధాని మోదీ తన మూడవ దఫా ప్రభుత్వంలో మార్పులు చేర్పులు చేయాలని కొద్దిరోజులుగా భావిస్తున్నారని చెబుతున్నారు.
By: Tupaki Political Desk | 24 Jun 2026 12:30 PM ISTకేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై విస్తృత ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన సమావేశం కేంద్ర రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా చెబుతున్నారు. ప్రధాని మోదీ తన మూడవ దఫా ప్రభుత్వంలో మార్పులు చేర్పులు చేయాలని కొద్దిరోజులుగా భావిస్తున్నారని చెబుతున్నారు. ప్రధానంగా పార్టీలో ప్రక్షాళన తీసుకువచ్చి 2029 ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడంతోపాటు త్వరలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సమయాత్తం చేయడంలో భాగంగా మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని చెబుతున్నారు. దీంతో ఈ నెలాఖరులోగా పునర్వ్యస్థీకరణ చేపట్టాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా బిహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తోపాటు ఆప్ నుంచి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దా వంటివారు కేబినెట్ లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుత మంత్రివర్గ ప్రక్షాళన వెనుక ప్రధానంగా పనితీరు, రాజకీయ వ్యూహాలు దాగి ఉన్నాయని అంటున్నారు. ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచని మంత్రులను కేబినెట్ నుంచి తప్పించి, వారి స్థానంలో పార్టీని బలోపేతం చేయగల పరిపాలనా దక్షత ఉన్న నేతలను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్రధాని మోదీ భావిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే కొన్ని కీలక పదవులలో ఉన్నవారు పార్టీ సంస్థాగత బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధమవుతుండటం ఈ మార్పులకు ప్రధాన సంకేతంగా చెబుతున్నారు. ముఖ్యంగా, వివాదాస్పద అంశాల్లో చిక్కుకున్న లేదా పనితీరు లోపించిన సుమారు పన్నెండు మంది మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
మొదలైన మంత్రుల రాజీనామాలు!
రాజ్యసభ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇదే విధంగా రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ రాజ్యసభ పదవీకాలం కూడా జూన్ 21న ముగిసింది. ఆమెను తిరిగి ఎంపిక చేయకపోవడంతో మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అదేవిధంగా మరికొందరు మంత్రులు కూడా పదవుల నుండి తప్పుకునే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు కొందరు మంత్రులకు పార్టీ బాధ్యతలను అప్పగించడం ద్వారా బీజేపీ అధిష్టానం సంస్థాగత ప్రక్షాళనను వేగవంతం చేసిందని అంటున్నారు. కేంద్ర రవాణా, రహదారులు, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష మల్హోత్రాను ఇప్పటికే ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ బాధ్యతలను అప్పగించారు. దీంతో ఈ ఇద్దరిని తప్పించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
కొత్త మంత్రులు నితీశ్, రాఘవ్
ఈ ప్రక్షాళనలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నుంచి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దాకు కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే, బీహార్ రాజకీయ సమీకరణాల్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బృందానికి కూడా కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. నీట్ పరీక్ష వివాదాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను సైతం కేబినెట్ నుంచి తప్పించనున్నారని కథనాలు వస్తున్నాయి. అదేవిధంగా ఈ సారి కేబినెట్‌లో 33 శాతం మహిళలకు చోటు కల్పించాలనే అంశంపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిందని అంటున్నారు.
టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు చాన్స్?
ఇక కేబినెట్ విస్తరణలో భాగంగా ఆప్ తిరుగుబాటు ఎంపీలకు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలోనే పశ్చిమబెంగాల్ కు చెందిన టీఎంసీ రెబెల్స్ కు చోటిస్తారా? అనే చర్చ జరుగుతోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఎంసీపై తిరుగుబాటు చేసిన 20 మంది ఎంపీలు నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరిన విషయం తెలిసిందే. వీరంతా ఎన్డీఏకు మద్దతు ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వీరిలో ఒకరిద్దరికి మంత్రివర్గంలో చోటిచ్చే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి టీఎంసీ రెబల్స్ మద్దతు అవసరం అవడంతో వారిని కేబినెట్లోకి తీసుకోవడం అనివార్యంగా చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కూడా కొందరు కొత్తవారికి పదవులు దక్కే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న ఏపీకి కేంద్ర కేబినెట్‌లో ప్రాతినిధ్యం దక్కుతుందని చెబుతున్నారు. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ డి. పురందేశ్వరికి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం దక్కనుందనే చర్చ నడుస్తోంది. మొత్తంగా, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యతనిస్తూ, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని మోదీ సర్కార్ ఈ భారీ ప్రక్షాళనకు సిద్ధమవుతోంది. బుధవారం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశం తర్వాత కేబినెట్ విస్తరణపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
