త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఎవరికి ఛాన్స్ అంటే..?
కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైందని ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో ప్రధాని మోదీ 3.0 ప్రభుత్వం అధికారం చేపట్టి వచ్చే నెలకు రెండేళ్లు పూర్తవనున్నాయి.
By: Tupaki Political Desk | 12 May 2026 6:31 PM ISTకేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైందని ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో ప్రధాని మోదీ 3.0 ప్రభుత్వం అధికారం చేపట్టి వచ్చే నెలకు రెండేళ్లు పూర్తవనున్నాయి. 2024 మేలో ఎన్నికలు జరగగా, జూన్ లో ఫలితాలు వెలువడ్డాయి. దీంతో ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావస్తున్నందున కేబినెట్ లో మార్పులు, చేర్పులు చేయాలని ప్రధాని మోదీ భావిస్తున్నారని అంటున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తికావడం, కీలకమైన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో జోష్ మీద ఉన్న బీజేపీ నేతలు పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారని అంటున్నారు. దీంతో పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేయడంతోపాటు కేంద్ర మంత్రివర్గంలో మార్పు చేర్పులు చేయాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 16 లేదా ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో మంచి ముహూర్తం చూసుకుని కేంద్ర కేబినెట్ ను విస్తరిస్తారని అంటున్నారు. జూన్ మొదటివారంలోగా ప్రభుత్వంలోను, పార్టీలోనూ మార్పులు పూర్తి చేయాలని ప్రధాని మోదీ కృతనిశ్చయంతో ఉన్నారని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రధానంగా బిహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను కేంద్ర కేబినెట్ లోకి తీసుకోడానికి ఎలాగూ విస్తరణ చేయాల్సివుందని, పనిలో పనిగా మరికొన్ని మార్పులు చేస్తే సరిపోతుందని ప్రధాని మోదీ అభిప్రాయపడుతున్నారని చెబుతున్నారు.
2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రి వర్గాన్ని విస్తరించాలని కమలనాథులు భావిస్తున్నారు. ప్రధానంగా యువతను కేబినెట్ లో తీసుకుని సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించే విషయమై కసరత్తు జరుగుతోందని అంటున్నారు. రెండు రోజుల క్రితం తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ఈ విషయమై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ సమాలోచనలు చేశారని చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడంపై చంద్రబాబు సలహా కోరారని చెబుతున్నారు. బెంగాల్ లో అధికారంలోకి వచ్చినందున నెక్ట్స్ టార్గెట్ గా పెట్టుకున్న తెలంగాణలో పార్టీని పరుగులు పెట్టించే ఉద్దేశంతో ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్లకు కేంద్ర కేబినెట్ లో చోటివ్వాలని ప్రధాని మోదీ ఆలోచనగా చెబుతున్నారు.
ప్రస్తుతం తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో సీనియర్ నేత కిషన్ రెడ్డి, బండి సంజయ్ మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరితోపాటు మరొకరికి కూడా కేబినెట్ లో చోటివ్వాలని బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో కిషన్ రెడ్డి దాదాపు 12 ఏళ్లుగా మంత్రిగా కొనసాగుతుండటం, బండి సంజయ్ కుమారుడు వివాదాల్లో చిక్కుకోవడం కూడా చర్చగా మారిందని అంటున్నారు. అదేవిధంగా ఏపీకి చెందిన ఒకరిద్దరికి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే ప్రతిపాదన కూడా ఉందని అంటున్నారు. మరోవైపు ఒక కీలక రాష్ట్రానికి ముస్లిం నేతను ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న ప్రతిపాదనను బీజేపీ సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పరిణామాలతో బీజేపీ, దాని మిత్రపక్షాల్లో మంత్రి పదవుల ఆశావహుల్లో ఆశలు చిగురిస్తున్నట్లు చెబుతున్నారు.
