కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ ?
కేంద్ర మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నెల 18న కేబినెట్ సమావేశం, 23న విస్తరణ ఉండొచ్చని హస్తిన వర్గాల్లో చర్చ జరుగుతోంది. పనితీరు ఆధారంగా కొందరిని తప్పించి, కొత్తగా 20 మందికి అవకాశం కల్పించవచ్చని సమాచారం. ఎన్డీయే మిత్రపక్షాలకూ చోటు దక్కే అవకాశముంది.
By: Satya P | 14 Nov 2026 8:51 AM ISTకేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళకు దగ్గర పడుతోంది. దాంతో ప్రభుత్వ పనితీరుని సమీక్షించుకుంటూ కేంద్ర మంత్రుల సమర్ధతని కూడా సరి చూసుకుంటూ పూర్తి స్థాయిలో మంత్రి వర్గ ప్రక్షాళన చేపట్టాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నారని ప్రచారం సాగుతోంది. నిజానికి ఈ రకమైన వార్తలు గత ఆరు నెలల నుంచి వినిపిస్తున్నా ఇపుడు తగిన ముహూర్తం తోసుకుని వచ్చింది అని అంటున్నారు. ఎందుకంటే కొత్త ఏడాది మొదట్లోనే ఉత్తర ప్రదేశ్ సహా దేశంలో పలు కీలక రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ఆయా రాష్ట్రాలలో రాజకీయ సామాజిక అంశాలు ఇతర సమీకరణల ఆధారంగా మంత్రులను తీసుకోవాలని కేంద్ర పెద్దలు చూస్తున్నారు. అందువల్ల ఇంతకు మించిన సమయం లేదని భావిస్తూ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు.
కొందరు మాజీలు అవుతారా :
ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి వర్గం పూర్తి స్థాయి సమావేశం ఈ నెల 18న జరగనుందని తెలుస్తోంది. ఈ మంత్రివర్గ సమావేశానికి క్యాబినెట్, స్వతంత్ర, సహాయ మంత్రులందరూ హాజరవుతారు అని అంటున్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మంత్రుల పనితీరు కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బహుశా మాజీలు కాబోయే వారికి ఇది చివరి కేబినెట్ మీటింగ్ కూడా కావచ్చు అని హస్తిన వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక మంత్రివర్గ విస్తరణకు ముందు ఇలాంటి పూర్తి స్థాయి కేబినెట్ మీట్ సాగడంతో కచ్చితంగా విస్తరణ ఉంటుందని అంటున్నారు. గతంలో కూడా పూర్తి స్థాయి మంత్రి వర్గం సమావేశం తరువాత విస్తరణ జరిగింది అని గుర్తు చేస్తున్నారు.
ఆ రోజునే అంటూ :
ఇక ఈ నెల 23 మంత్రి వర్గ విస్తరణ జరుగుతుంది అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈసారి జరిగే మంత్రి వర్గ విస్తరణలో పెద్ద ఎత్తున స్థానాలు మారుతాయని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న వారిలో వయో వృద్ధులను పక్కన పెడతారు అని అంటున్నారు. అలాగే పనితీరు సరిగ్గా లేని వారిని తప్పిస్తారు అని అంటున్నారు. అలాగే ప్రహ్లాద్ జోషీ, అశ్విని వైష్ణవ్ వంటి కేంద్ర మంత్రుల మీద మూడు నాలుగు శాఖల భారం ఉంది. అందువల్ల ఈ శాఖలను వారి నుంచి తీసుకుని కొత్త వారికి ఇస్తారు అని అంటున్నారు. అలాగే ఎన్డీయే మిత్రులకు కూడా చోటు ఇస్తారు అని చెబుతున్నారు.
ఖాళీలు భర్తి :
ఇక కేంద్ర మంత్రి వర్గంలో 80 దాకా మంత్రులకు చాన్స్ ఇవ్వవచ్చు అని అంటున్నారు. ప్రస్తుతానికి 10 దాకా ఖాళీలు ఉన్నాయి. అలాగే ఉన్న వారిలో కనీసంగా పది నుంచి పదిహేను మందిని వివిధ సమీకరణ ఆధారంగా తప్పిస్తాని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే కనీసంగా ఇరవై మంది దాకా కొత్త ముఖాలను చూసే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే కేంద్ర మంత్రుల మీద భారాన్ని తగ్గించి ఒక్కో మంత్రికి ఒక్కో ప్రధాన శాఖను ఇచ్చేలా చూస్తారు అని అంటున్నారు. ఏది ఏమైనా 2027, 2028లలో జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2029 ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారం అయినా నిజమవుతుందో లేదో.
