Begin typing your search above and press return to search.

డజన్ మంది మాజీలుగా...విస్తరణకు కౌంట్ డౌన్ !

ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. మోదీ ఉజ్బెకిస్తాన్ కిర్గిజిస్థాన్ దేశాలలో నాలుగు రోజుల విదేశీ పర్యటనని చేపట్టిన సంగతి తెలిసిందే.

By:  Satya P   |   2 Sept 2026 8:02 AM IST
డజన్ మంది మాజీలుగా...విస్తరణకు కౌంట్ డౌన్ !
X

ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. మోదీ ఉజ్బెకిస్తాన్ కిర్గిజిస్థాన్ దేశాలలో నాలుగు రోజుల విదేశీ పర్యటనని చేపట్టిన సంగతి తెలిసిందే. ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 1 వరకు ఈ పర్యటన సాగింది. అయితే మోడీ భారతదేశానికి చేరుకున్న తర్వాత కూడా కొన్ని అధికార కార్యక్రమాలలో బిజీ అవుతున్నారు. సెప్టెంబర్ 2న దిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్‌లో జరగనున్న జలశక్తి మంత్రిత్వ శాఖ సదస్సు ముగింపు సమావేశంలో ప్రధాని పాల్గొననున్నారు. అలాగే సెప్టెంబర్ 2 నుండి 4 వరకు బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ భారతదేశ పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 3న ప్రధాని మోదీ ఆయనతో ఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. దీంతో మోడీ బిజీ షెడ్యూల్ పూర్తి అయిన తరువాత కేంద్ర మంత్రి వర్గ విస్తరణ మీద ఫోకస్ పెడతారు అని అంటున్నారు.

మొదటి వారంలోనే :

అంటే కేంద్ర మంత్రి వర్గ విస్తరణ సెప్టెంబర్ మొదటి వారంలోపే జరిగి తీరుతుందని హస్తిన వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు జరగాల్సిన పూర్తి కసరత్తు జరిగింది అని అంటున్నారు. ఎవరు ఇన్ ఎవరు అవుట్ అన్నది పక్కాగా కేంద్ర పెద్దల వద్ద సమాచారం ఉందని చెబుతున్నారు. అదే విధంగా కేంద్ర కేబినెట్ లో ఏ విధంగా ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలన్న దాని మీద కూడా తగినంత కసరత్తు జరిగింది అని చెబుతున్నారు. ఎక్కువగా యువతకు మహిళలకు ఈసారి ప్రాతినిధ్యం దక్కుతుందని వార్తలు వెలువడుతున్న సంగతి విధితమే. అదే సమయంలో సీనియర్లను వయోభారం ఇతరత్రా కారణాలతో పక్కన పెట్టే చాన్స్ ఉందని అంటున్నారు.

కనీసంగా ఇదే నంబర్ :

ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి వర్గం నుంచి కనీసంగా 12 మంది దాకా సీనియర్ మంత్రులను పక్కన పెట్టే అవకాశాలు అధికంగా ఉన్నాయని అంటున్నారు. వీరిలో కొందరికి రాజ్యసభ పదవీ కాలం కొద్ది రోజులలో ముగియనుంది అని అంటున్నారు. అలాగే మరి కొందరి విషయంలో వయస్సు అన్నదే ప్రమాణంగా తీసుకుని సున్నితంగా వారి సేవలను ప్రభుత్వంలో కాదు పార్టీలోకి అని చెప్పనున్నారని అంటున్నారు. కొందరికి రాజ్ భవన్ దారి చూపించి గవర్నర్ పదవులు అప్పగిస్తారు అని అంటున్నారు. మొత్తం 80 మందికి పైగా కేంద్ర మంత్రి మండలిలో తీసుకోవచ్చు. అయితే ప్రసుత్తం 72 మంది ఉన్నారు. వీరిలో 12 మందిని తప్పిస్తే రెండు పదులకు పైగా ఖాళీలు ఏర్పడతాయి. దాంతో ఎక్కడ ఎవరెవరికి చాన్స్ దక్కుతుంది అన్నదే భారీ రాజకీయ చర్చగా ఉంది అని అంటున్నారు.

ఎన్నికల కేబినెట్ గానే :

కేంద్రంలో కూటమి పాలన దాదాపుగా సగానికి చేరుకుంది. దాంతో మరో రెండున్నరేళ్ళలో జరిగే లోక్ సభ ఎన్నికలకు అనుగుణంగా భారీ ఎత్తున పునర్ వ్యవస్థీకరణ జరుగుతుందని అంటున్నారు. మళ్ళీ మరోసారి ఈ తరహాలో భారీ ఎత్తున విస్తరణ అన్న మాట లేకుండా ఇదే చివరి సారి అన్నట్లుగా అన్ని రకాలైన రాజకీయ ప్రాంతీయ సామాజిక అవసరాలు ఎన్నికల వ్యూహాలకు తగినట్లుగా మంత్రి వర్గ కూర్పు ఉంటుందని అంటున్నారు. అదే విధంగా 2027 లో దేశంలో వివిధ రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా అక్కడ అవసరం అయిన వారికి కేంద్ర కేబినెట్ లో చోటు ఇస్తారని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఏకంగా 12 మంది సీనియర్లకు ఉద్వాసన అని వస్తున్న వార్తలు కనుక నిజం అయితే అది అతి పెద్ద సంచలనం అవుతుంది. మరి ఆ కురు వృద్ధులు ఎవరా అన్నది కొద్ది రోజులలో తేలనుంది. మొత్తానికి చూస్తే విస్తరణకు వేళాయెరా అన్న మాట హస్తినలో జోరుగా వినిపిస్తోంది.