Begin typing your search above and press return to search.

మోడీ మంత్రులకు ఏజ్ దెబ్బ !

ఇక అన్నింటికంటే పనితీరు విషయంలో కొందరు వెనకబడి ఉన్నారు దాంతో వారికి ఉద్వాసన ఖాయంగా ఉంది.

By:  Satya P   |   26 Aug 2026 9:56 AM IST
మోడీ మంత్రులకు ఏజ్ దెబ్బ !
X

నరేంద్ర మోడీ కేబినెట్ విస్తరణ తొందరలో జరుగుతుంది అని అంటున్నారు. నిజానికి ఈ తరహా వార్తలు గత మూడు నాలుగు నెలలుగా జాతీయ ప్రాంతీయ మీడియాలో సోషల్ మీడియాలో తరచూ వినిపిస్తున్నా ఆ శుభ ముహూర్తం మాత్రం ముంచుకుని రావడం లేదు. అయితే ఈసారి మాత్రం విస్తరణ జరగడం తధ్యమని అంటున్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మంత్రులు కొందరి మీద విపరీతమైన పని భారం పడుతోంది. ఏకంగా 14 మంది మంత్రులు ఒకటికి మించిన మంత్రిత్వ శాఖలతో తలమునుకలు అవుతున్నారు. దాంతో వారి శాఖలను వేరే వారికి ఇవ్వాల్సి ఉంది. అలాగే బీజేపీ జాతీయ కార్యవర్గంలో కొందరు చేరారు. దాంతో వారి పదవులు కూడా కొత్త వారికి ఇవ్వాలి. కొందరు మంత్రుల రాజ్యసభ పదవీ కాలం తొందరలో ముగుస్తోంది. దాంతో వారిని సైతం తప్పించడం అనివార్యం.

వయసు మీరితే అంతే :

ఇక అన్నింటికంటే పనితీరు విషయంలో కొందరు వెనకబడి ఉన్నారు దాంతో వారికి ఉద్వాసన ఖాయంగా ఉంది. వీటికి మించి మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటి అంటే మోడీ కేబినెట్ లో వయో వృద్ధులు ఎక్కువ అయ్యారు అన్నది. దాంతో వారిని తప్పనిసరిగా తప్పించేస్తారు అని టాక్ అయితే ఢిల్లీ రాజకీయ వర్గాలలో జోరుగా నడుస్తోంది. ఈ రోజుకు చూస్తే మోడీ కేబినెట్ లో అత్యంత వృద్ధుడు 81 ఏళ్ళ జితన్ రాం మాంజీ. ఈయన కొద్ది కాలం పాటు బీహార్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఈయనకు సొంతంగా పార్టీ ఉంది. ఆయనే ఏకైక ఎంపీ కూడా అంటారు. మరి ఆయన్ని తప్పిస్తే మిత్ర పక్షానికి బెర్త్ ఇవ్వరా అన్న చర్చ వస్తోంది. అయినా సరే వయసు మీరితే పదవి కట్ అన్న రూల్ ని జితన్ రాం మాంజీతోనే అమలు చేయడం మొదలెడతారు అని అంటున్నారు.

ఏడు పదులు దాటితే :

అదే విధంగా మోడీ మంత్రి వర్గంలో డెబ్బై ఏళ్ళు దాటిన వారు ఏకంగా 12 మంది ఉన్నారని అంటున్నారు. వీరిని కూడా ఏజ్ ఫ్యాక్టర్ అన్న కారణంతో పక్కన పెట్టే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. జెన్ జీ యూత్ ని ఆకట్టుకోవడం వేగంగా ప్రభుత్వం స్పందించడం అదే విధంగా కేబినెట్ కి యూత్ అట్రాక్షన్ తీసుకుని రావడం ఫ్రెష్ నెస్ ఉండేలా చూసుకోవడం ఈసారి మంత్రి వర్గ విస్తరణలో ఇవే ప్రధాన అంశాలు కాబోతున్నాయని అంటున్నారు. దాంతో చాలా మందికి ఏజ్ దెబ్బ పడుతుందని కూడా ఊహాగానాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

ఆ రెండు వర్గాలే ఎక్కువగా :

అదే సమయంలో మోడీ కేబినెట్ కూర్పులో ఈసారి రెండు వర్గాలకే ఎక్కువగా ప్రయారిటీ లభిస్తుంది అని అంటున్నారు. అందులో ఒకటి యువత. రెండు మహిళ అని అంటున్నారు. జెన్ జీ యాక్టివ్ గా దేశంలో ఉండటంతో వారికి దగ్గర కావడానికి యువ మంత్రులను మోడీ ఎక్కువగా ముందుకు తెస్తారు అని అంటున్నారు. అందులో రాజకీయంగా కొత్త అయినా జూనియర్లు అయినా ఫరవాలేదని కూడా నిర్ణయించారని అంటున్నారు. అలాగే మహిళా మంత్రుల సంఖ్య కూడా గణనీయంగా పెంచాలని అనుకుంటున్నారని భోగట్టా. ఇక్కడా కొత్తగా గెలిచిన వారు తొలిసారి పార్లమెంట్ కి వచ్చిన వారిని సైతం అదృష్టం వరించే చాన్స్ ఉందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే మోడీ కేబినెట్ లో ఈసారి అనూహ్యమైన కొత్త ముఖాలు కనిపిస్తాయని అంటున్నారు. సో ఎవరా లక్కీ మినిస్టర్లు అంటే వెయిట్ అండ్ సీ.