మోదీ @ 12 - మంత్రుల నియామకంలో ‘ప్రధాన’ వ్యూహమిదేనా..?
కేంద్ర మంత్రివర్గ విస్తరణపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రధాని మోదీ 3.0 పాలనలో రెండేళ్లు పూర్తికావడంతో మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరిస్తారని కొద్దిరోజులుగా విస్తృత ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Political Desk | 6 July 2026 12:18 PM ISTకేంద్ర మంత్రివర్గ విస్తరణపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రధాని మోదీ 3.0 పాలనలో రెండేళ్లు పూర్తికావడంతో మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరిస్తారని కొద్దిరోజులుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. అదేసమయంలో చాలా మంది మంత్రులకు ఈ సారి ఉద్వాసన ఉంటుందని, వారిస్థానంలో కొత్తవారికి అవకాశం దక్కుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే 2014 నుంచి ప్రధాన మోదీ అనుసరిస్తున్న విధానాలను పరిశీలిస్తే, మంత్రుల నియామకంపై ఒక స్పష్టమైన వ్యూహం కనిపిస్తోందని చెబుతున్నారు. కీలక వ్యూహాత్మక శాఖలకు మంత్రులను కొనసాగిస్తూనే, ప్రజలతో నేరుగా ముడిపడి ఉండే మంత్రిత్వ శాఖల్లో మార్పులు చేస్తూ ప్రధాని మోదీ పాలన సాగిస్తున్నారని అంటున్నారు. ఈ పద్ధతి ప్రకారం ఈ సారి కూడా కీలక శాఖలకు మంత్రులను మార్చే పరిస్థితి కనిపించడం లేదని అంచనా వేస్తున్నారు.
12 ఏళ్లలో మంత్రుల రికార్డు ఇదే..
దేశ భద్రత, ఆర్థిక, విదేశాంగ విధానాలు కీలకమైనవి కావడంతో ప్రధాని మోదీ ప్రభుత్వం ఈ శాఖల్లో మార్పులకు చాలా దూరంగా ఉంటూ వస్తోందని చెబుతున్నారు. ప్రధాని కేబినెట్ లో హోం మంత్రి అమిత్ షా సుదీర్ఘ కాలం కొనసాగుతుండమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. అదే సమయంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ విషయంలోనూ ప్రధాని నిర్ణయంలో మార్పు ఉండకపోవచ్చని అంటున్నారు. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత విదేశాంగ బాధ్యతలను సుదీర్ఘకాలం చూస్తున్న నాయకుడిగా మంత్రి జైశంకర్ రికార్డు నెలకొల్పారు. అలాగే ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా 8 బడ్జెట్‌లను ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారు. రక్షణ శాఖలో రాజ్‌నాథ్ సింగ్ సైతం సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా రికార్డు సృష్టించారు. 2014 తర్వాత జరిగిన ఈ శాఖలో జరిగిన మార్పులు ప్రధానంగా వ్యక్తిగత కారణాలు లేదా అనివార్య పరిస్థితుల వల్లనే జరిగాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అత్యధిక మార్పులు ఈ శాఖలోనే..
ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో మాత్రం అత్యధికంగా మార్పులు చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు. 2014 నుంచి ఇప్పటివరకు ఈ శాఖకు ఏకంగా ఏడుగురు మంత్రులు మారారు. ప్రకాశ్ జవదేకర్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, స్మృతి ఇరానీ, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, అనురాగ్ ఠాకూర్ తర్వాత ప్రస్తుతం అశ్విన్ వైష్ణవ్ సమాచార మంత్రిత్వశాఖ బాధ్యతలు చూస్తున్నారు. గత రెండు ఎన్డీయే ప్రభుత్వాల కాలంలో ఏ ఒక్క మంత్రి కూడా ఈ శాఖలో పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేయలేకపోవడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలో ఇప్పటివరకు 5 సార్లు మంత్రులు మారారు. గోపినాథ్ ముండే ఆకస్మిక మరణంతో మొదలైన ఈ మార్పుల పరంపర నితిన్ గడ్కరీ, బీరేంద్ర సింగ్, నరేంద్ర సింగ్ తోమర్, గిరిరాజ్ సింగ్ మీదుగా ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌహాన్ వరకు కొనసాగింది. ఇందులో గిరిరాజ్ సింగ్ మాత్రమే 2019-2024 మధ్య పూర్తికాలం పనిచేశారు. అదేవిధంగా, న్యాయ మంత్రిత్వ శాఖలో రవిశంకర్ ప్రసాద్, సదానంద గౌడ, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్ మధ్య పంపకాలు జరిగాయి. ఇందులో ఏ ఒక్కరూ ఒకే ప్రభుత్వంలో పూర్తి ఐదేళ్ల కాలం కొనసాగకపోవడం గమనార్హం.
విద్యా శాఖలో స్మృతి ఇరానీ, ప్రకాష్ జవదేకర్, రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, ధర్మేంద్ర ప్రధాన్ మంత్రులుగా వ్యవహరిస్తూ వచ్చారు. పౌర విమానయాన శాఖ విషయానికి వస్తే 2014లో తొలుత టీడీపీకి చెందిన అశోక్ గజపతి రాజు, ఆ తర్వాత 2018లో సురేష్ ప్రభు మంత్రులుగా పనిచేశారు. 2019లో ఏర్పడిన ఎన్డీఏ 2.0 సర్కారులో హర్దీప్ సింగ్ పురి, జ్యోతిరాదిత్య సింధియా విమానయాన మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం 3.0 ప్రభుత్వంలో టీడీపీకే చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ఈ బాధ్యతలు దక్కాయి. సాధారణంగా పౌర విమానయాన, ఆహారశుద్ధి పరిశ్రమల వంటి శాఖలను ఎన్డీయే మిత్రపక్షాల నాయకులకు కేటాయించే సంప్రదాయాన్ని మోదీ ప్రభుత్వం కొనసాగిస్తోంది. దీనిని బట్టి, కీలక శాఖల్లో నిలకడను, సామాజిక శాఖల్లో నిరంతర పనితీరును పరీక్షించే వ్యూహాన్ని ప్రధాని మోదీ అమలు చేస్తున్నారని స్పష్టమవుతోందని చెబుతున్నారు.
