Begin typing your search above and press return to search.

కేంద్ర మంత్రులకు బీజేపీ షాక్... విస్తరణకు రెడీ ?

ఇదిలా ఉంటే రాజ్యసభ సీటు దక్కకుండా కేంద్ర మంత్రి వర్గంలో కొనసాగుతున్న వారిలో కేంద్ర మంత్రులు హర్దీప్ పురి, బీఎల్ వర్మ తదితరులు ఉన్నారని అంటున్నారు.

By:  Satya P   |   5 Oct 2026 7:52 PM IST
కేంద్ర మంత్రులకు బీజేపీ షాక్... విస్తరణకు రెడీ ?
X

కేంద్ర మంత్రివర్గ విస్తరణ తొందరలోనే జరుగుతుందా అంటే దానికి బలమైన సంకేతాలనే బీజేపీ పెద్దలు ఇచ్చారని అంటున్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి వర్గంలో కొనసాగుతున్న కొందరి విషయంలో బీజేపీ హైకమాండ్ అనుసరించిన వైఖరితో విస్తరణకు వేళాయేరా అన్నది హస్తిన వర్గాల భోగట్టా. రాజ్యసభ సభ్యత్వం ముగిసిన కేంద్ర మంత్రులకు తిరిగి పొడిగించకపోవడంతో వారంతా త్వరలో మాజీలు కానున్నారని అంటున్నారు. అంతే కాదు ఏ సభలో కూడా సభ్యులు కానీ వారిని మంత్రివర్గంలో కొనసాగించే పరిస్థితి ఉండదు, దీంతో మంత్రి వర్గ విస్తరణ కోసమే ఈ విధంగా బీజేపీ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

వీరికి నో చాన్స్ :

ఇదిలా ఉంటే రాజ్యసభ సీటు దక్కకుండా కేంద్ర మంత్రి వర్గంలో కొనసాగుతున్న వారిలో కేంద్ర మంత్రులు హర్దీప్ పురి, బీఎల్ వర్మ తదితరులు ఉన్నారని అంటున్నారు. ఉత్తరప్రదేశ్ కోటాలో ఖాళీ అవుతున్న స్థానాలకు బీజేపీ ఎనిమిది మంది అభ్యర్థులతో కూడిన కొత్త జాబితాను విడుదల చేసింది. ఈసారి పాత ఎంపీలు ఎవరికీ మళ్లీ అవకాశం ఇవ్వకుండా కొత్త వారికే ఎంపిక చేయడం విశేషం. దాంతో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మలను రాజ్యసభకు తిరిగి పంపించకుండా పక్కన పెట్టారు. ఇక ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న వీరిద్దరి పదవీ కాలం 2026 నవంబర్ 25తో ముగుస్తుంది. రాజ్యాంగ నిబంధనల (ఆర్టికల్ 75(5)) ప్రకారం చూస్తే కనుక లోక్‌సభ లేదా రాజ్యసభ సభ్యుడిగా లేని వ్యక్తి గరిష్టంగా ఆరు నెలల పాటు మంత్రిగా కొనసాగవచ్చు. అందువల్ల నవంబర్‌లో వీరి పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా మరో ఆరు నెలల పాటు ఎలాంటి ఆటంకం లేకుండా మంత్రివర్గంలో కొనసాగే సాంకేతిక అవకాశం ఉంది అని అంటున్నారు.

విస్తరణ తప్పదు :

అయితే బీజేపీ పెద్దలు అంత సమయం తీసుకోరని ఈ నవంబర్ లోగానే కేంద్ర మంత్రి వర్గాన్ని విస్తరిస్తారని అంటున్నారు. అపుడు ఈ ఇద్దరు కేంద్ర మంత్రులు తమ పదవులను కోల్పోతారు అని అంటున్నారు. అదే సమయంలో వీరి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తారని కూడా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే యూపీలో మొత్తం ఎనిమిది సీట్లకు గానూ బీజేపీ రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక చూస్తే సామాజిక ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యతను ఇచ్చింది. అలాగే కొత్త ముఖాలను బరిలోకి దించింది. ధర్మపాల్ సింగ్, రాధాకాంత్ ఓఝా, ప్రకాశ్ పాల్, విద్యాసాగర్ సోన్‌కర్, గోపీ కృష్ణ పాండే, ప్రియాంక సింగ్ రావత్, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, శ్రుతి గంగ్వార్‌లను అభ్యర్థులుగా బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది.

మరి కొందరి విషయంలో :

కేవలం ఈ ఇద్దరు కేంద్ర మంత్రులే కాకుండా మరి కొందరి విషయంలో కూడా బీజేపీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది అని అంటున్నారు. వయో భారంతో పాటు పని తీరు ఇతర అంశాల ఆధారంగా కనీసంగా డజన్ మందిని కేంద్ర కేబినెట్ నుంచి తప్పిస్తారు అని ఊహాగానాలు అయితే ప్రచారంలో ఉన్నాయి. అదే విధంగా కొత్త వారికి యువతకు ఎక్కువగా కేంద్ర మంత్రి వర్గంలో స్థానం దక్కవచ్చు అని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.