Begin typing your search above and press return to search.

కేంద్ర మంత్రివర్గ విస్తరణ అపుడేనట..వారికి బిగ్ రిలీఫ్ ?

ఈ క్రమంలో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఎపుడు అంటే లేటెస్ట్ న్యూస్ చూస్తే ఇప్పట్లో కాదు అని వస్తోంది. అంతే కాదు వాయిదా పడింది అని కూడా చెబుతున్నారు.

By:  Satya P   |   9 July 2026 9:19 AM IST
కేంద్ర మంత్రివర్గ విస్తరణ అపుడేనట..వారికి బిగ్ రిలీఫ్ ?
X

కేంద్ర మంత్రి వర్గ విస్తరణ అదిగో ఇదిగో అంటూ హస్తినలో వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతూ వచ్చాయి. అదే సమయంలో వారు ఇన్ అని వీరు అవుట్ అని కూడా అంటూ ఎవరికి తోచిన విధంగా వారు ఊహాగానాలు వ్యాప్తి చేశారు. ప్రస్తుతం చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఈ నెల 11 నాటికి కానీ ఢిల్లీకి చేరుకోరు. ఇక 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఎపుడు అంటే లేటెస్ట్ న్యూస్ చూస్తే ఇప్పట్లో కాదు అని వస్తోంది. అంతే కాదు వాయిదా పడింది అని కూడా చెబుతున్నారు.

నివేదికలు అన్నీ దగ్గర :

ఇక మంత్రుల పనితీరు మీద నివేదికలు అన్నీ దగ్గర పెట్టుకుని మధింపు చేసే కార్యక్రమం ఒక వైపు జోరుగా సాగుతోంది. ఇంకొక వైపు చూస్తే ఇంకా చాలా పార్టీలు ఎన్డీయేకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధపడుతున్న నేపథ్యం ఉంది. దాంతో వారికి చోటు కల్పించాలని కూడా చూస్తున్నారు. లేటెస్ట్ గా చూస్తే మహారాష్ట్రలో శరద్ పవార్ ఎన్సీపీ నుంచి కూడా ఎన్డీయేకు మద్దతు దక్కవచ్చు అని అంటున్నారు. ఈ క్రమంలో అన్నీ చూసుకుని ఆ మీదట మంత్రివర్గాన్ని విస్తరించాలని ఆదరాబాదరాగా చేయడం ఎందుకు అని కేంద్ర పెద్దలు ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. ధర్మేంద్ర ప్రధాని రాజీనామా అంటూ ఆ మధ్య అంతా కాక్రోచ్ పార్టీ చేసిన ఆందోళనలు కూడా ఇపుడు చప్పబడ్డాయి. నీట్ పరీక్షలు కూడా మళ్ళీ పెట్టేశారు. దాంతో తాపీగానే అన్నీ బేరీజు వేసుకుని మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని చూస్తున్నారు అని తెలుస్తోంది.

సెప్టెంబర్ లోనే విస్తరణ :

ఢిల్లీలో చూస్తే లేటెస్ట్ గా చక్కర్లు కొడుతున్న వార్త ఏంటి అంటే సెప్టెంబర్ లో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని. అప్పటిదాకా ఆ ఊసే ఉండదని. అలా ఎందుకు అంటే ప్రస్తుతం వర్షాకాల సమావేశాలు ఉన్నాయి. హడావుడిగా మంత్రివర్గ విస్తరణ చేసి కొత్త సమస్యలు తెచ్చుకోవడమే అవుతుందని అంటున్నారు. అసంతృప్తులతో ఇబ్బందులు వస్తాయని ఊహిస్తున్నారు. అలాగే కొత్త మంత్రులతో పార్లమెంట్ లో విపక్షాలను ఎదుర్కోవడం కొంత ఇరకాటంగా ఉంటుంది అని అంటున్నారు. అదే పాత వారినే ఉంచితే శాఖల మీద వారికి అవగాహన ఉంటుంది కాబట్టి పార్లమెంట్ లో ధీటుగా అధికార పక్షం నిలబడుతుందని అంటున్నారు.

ఈలోగా బీజేపీ జాతీయ కార్యవర్గంలో చాలా పదవుల భర్తీ ఉంటుందని చెబుతున్నారు. అలా పదవులు అందుకున్న వారికి కేంద్ర మంత్రి పదవుల నుంచి తప్పించవచ్చు అని చెబుతున్నారు. ఆగస్టు 13 వరకూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతాయి. ఆ మీదట కొంత సమయం తీసుకుని అన్నీ లెక్కలు చూసుకుని ప్రాంతీయ రాజకీయ సామాజిక సమీకరణలు సరి చూసుకుని పకడ్బందీగానే కేంద్ర మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని కేంద్ర పెద్దలు ఆలోచిస్తున్నారు అన్నది లేటెస్ట్ మ్యాటర్. అందువల్ల ఇప్పట్లో తీసివేతలు ఉండవు, దాంతో ఎవరికైతే పదవీ గండం ఉందని వార్తలు వస్తున్నాయో వారంతా కొంత కాలం పాటు బిగ్ రిలీఫ్ ఫీల్ అవవచ్చు అని అంటున్నారు.