సెంటిమెంటుతో కొట్టిన మోడీ.. బీహార్ ప్రచారంలోకి ప్రధాని!
అందరూ అనుకున్నట్టుగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన ఎన్నికల ప్రచారాన్ని సెంటిమెంటుతో ప్రారంభించారు.
By: Garuda Media | 25 Oct 2025 9:17 AM ISTఅందరూ అనుకున్నట్టుగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన ఎన్నికల ప్రచారాన్ని సెంటిమెంటుతో ప్రారంభించారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కారుకు, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ప్రాణప్రదంగా మారాయి. ఈ ఎన్నికల్లో విజయం దక్కించుకోవడం ద్వారా తమ పట్టును నిలబెట్టుకునేందుకుఇరు పక్షాలు తీవ్ర యత్నాలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గత కొన్నాళ్లుగాతీవ్ర వివాదంగా ఉన్న ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మహాఘట్‌బంధన్ క్లారిటీ ఇచ్చేసింది. ఆర్జేడీ యువ నేత తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా స్వయంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
దీంతో ఇండీ కూటమి బలం పుంజుకుంటుందని.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వికి మంచి మార్కులు పడతాయని కూడా అందరూ అనుకున్నారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా బీజేపీ అగ్రనేత, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు. బీహార్‌లో శుక్రవారం పర్యటించిన ఆయన.. సమస్తిపూర్ జిల్లాకు వచ్చారు. ఇక్కడి కర్పూరి గ్రామానికి చేరుకున్న ప్రధాని.. మా జీ సీఎం, ప్రఖ్యాత ఉద్యమ నేత.. కర్పూరి ఠాకూర్‌కు నివాళులర్పించారు. కర్పూరీ ఠాకూర్‌కు మరణానంతరం ఈ ఏడాది జనవరి లో `భారతరత్న` ఇవ్వడం తెలిసిందే. దీనిని గుర్తు చేసిన ప్రధాన మంత్రి.. కర్పూరి సేవలను ప్రశంసించారు.
`నాయి` సామాజిక వర్గానికి చెందిన కర్పూరీ ఠాకూర్‌కు.. బలమైన మద్దతు దారులు ఉన్నారు. అంతేకాదు.. ప్రజల్లోనూ ఆయ నకు సానుభూతి ఉంది. దీనిని తమవైపు తిప్పుకొనే ఉద్దేశంతోనే కేంద్రంలోని మోడీ సర్కారు భారతరత్న ప్రకటించిందన్న వాద న కూడా వినిపించింది. దీనిని నిజం చేశారా? అన్నట్టుగా ప్రధాని మోడీ.. నేరుగా కర్పూరీ ఠాకూర్ గ్రామానికి వెళ్లి.. ఆయనకు నివాళులర్పించి.. ఆయన కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం.. ప్రచారం ప్రారంభించారు. ప్రజలు ఎన్డీయే వైపే ఉన్నారని చెప్పారు. కర్పూరీ ఠాకూర్ లాంటి నాయకులు.. రాష్ట్రానికి ఎంతో మేలు చేశారని తెలిపారు.
ఇదేసమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలోనూ ప్రధాని మోడీ స్పష్టత ఇచ్చారు. ఇప్పటి వరకు ఇండీ కూటమి మాత్రమే తేజస్విని ప్రకటించగా.. తాజాగా బీజేపీ ఈసీటును కావాలని కోరుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఇలాంటి సమయంలో మోడీ స్వయంగా తమ సీఎం అభ్యర్థి సుశాన్‌బాబే(నితీష్‌కుమార్)నని స్పష్టం చేశారు. నితీష్ కుమార్ నేతృత్వంలోనే ఎన్డీయే కూటమి ఎన్నికలకు వెళ్తుందని.. ఆయన నేతృత్వంలోనే విజయం దక్కించుకుని.. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కూడా మోడీ చెప్పడం గమనార్హం. సో.. మొత్తానికి, ఇరు పక్షాల మధ్య `సీఎం సీటు`పై ఉన్న వివాదం సమసిపోయింది. ఇక, ఇప్పుడు ప్రజలు ఎవరిని తేల్చుకుంటారనేది చూడాలి.
