Begin typing your search above and press return to search.

జైలుకెళ్తే రాజీనామా చేయాల్సిందే...మోడీ మార్క్ అల్టిమేటం !

ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు జైలుకు వెళ్ళగానే కేవలం యాభై గంటలలోనే వారి ఉద్యోగం ఆటోమేటిక్ గానే పోతుందని మోడీ చెప్పుకొచ్చారు.

By:  Satya P   |   22 Aug 2025 3:23 PM IST
జైలుకెళ్తే  రాజీనామా చేయాల్సిందే...మోడీ మార్క్ అల్టిమేటం !
X

జైలుకు వెళ్ళే వారు తమ పదవులకు రాజీనామా చేయాల్సిందే అని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. అవినీతి చేసి జైలుకి వెళ్ళిన వారు తమ పదవులు అక్కడ నుంచి అనుభవిస్తామంటే అసలు కుదరదని ఆయన అంటున్నారు. రాజకీయ అవినీతిని సహించలేని ఒక చట్టం తీసుకుని వస్తున్నామని ఆయన చెప్పారు. అవినీతిపరులు జైలు నుంచి పాలిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అవినీతిని సహించదు అని ఆయన హెచ్చరించారు.

ప్రభుత్వ ఉద్యోగికి ఒక నీతి :

ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు జైలుకు వెళ్ళగానే కేవలం యాభై గంటలలోనే వారి ఉద్యోగం ఆటోమేటిక్ గానే పోతుందని మోడీ చెప్పుకొచ్చారు. అలాంటిది అవినీతి చేసి జైలుకు వెళ్ళి అక్కడ నుంచి పాలిస్తామంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. పదవులకు రాజీనామాలు చేయమంటే ఏ మాత్రం సహించేది లేదని అన్నారు. ప్రభుత్వాలను జైలు నుంచి ఎందుకు నడపాలని మోడీ నిలదీశారు.

ప్రధాని నుంచి మంత్రుల దాకా :

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుని రాబోతున్న చట్టంలో ప్రధానుల నుంచి మంత్రుల దకా అంతా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం పదవులు పోతాయని మోడీ స్పష్టం చేశారు. అందరికీ ఒకే న్యాయం అన్నారు. అవినీతి ఎక్కడా ఉండరాదు అన్నది విధానం అని చెప్పారు. అందుకే 130 రాజ్యాంగ సవరణకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పూనుకుందని ఆయన చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక నిబద్ధతతో కూడుకున్న విధానం అనుసరిస్తోంది అని చెప్పారు.

కాంగ్రెస్ కి ఎందుకు వ్యతిరేకత :

అవినీతి లేని పాలన అవినీతికి తావు లేని రాజకీయం చేయడానికి తాము ఒక బిల్లుని తీసుకుని రావాలనుకుంటే దాని మీద కాంగ్రెస్ కి ఎందుకు అంత వ్యతిరేకత అన్నది అర్థం కావడం లేదని మోడీ అన్నారు. ఇది పూర్తిగా తప్పుడు వాదమని కాంగ్రెస్ ని ఆయన నిందించారు. అవినీతి చేసిన వారు మంత్రులుగా ముఖ్యమంత్రులుగా కొనసాగాలా అని ఆయన ప్రశ్నించారు ఈ రకమైన వైఖరిని అంతా మానుకోవాలని హితవు పలికారు.

బీహార్ నుంచే రాహుల్ తో ఢీ :

ఇదిలా ఉండగ్గా నరేంద్ర మోడీ బీహార్ లోని గయలో ఏకంగా 13 వేల కోట్ల రూపాయలు విలువ చేసే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యాంగ సవరణ బిల్లు మీద బీహార్ నుంచే కాంగ్రెస్ కి రాహుల్ కి జవాబు ఇచ్చారు. రాహుల్ గాంధీ ఓటు అధికార్ యాత్ర అక్కడ నుంచే చేపడుతున్న నేపథ్యంలో మోడీ అవినీతి వ్యతిరేకత మీద తమ విధానం ఇది అని చెప్పడం విశేషం. అలా సరికొత్త డిబేట్ కి రాహుల్ ని ఆహ్వానించినట్లు అయింది అంటున్నారు.

బీహార్ కి వరాలు :

ఇదే సందర్భంలో ప్రధాని మోడీ బీహార్ కి ఎన్నో వరాలు ప్రకటించారు. బీహార్ లో వేగవంతమైన అభివృద్ధి కోసం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మోదీ అంటున్నారు. బీహార్‌లో ప్రారంభించిన ప్రాజెక్టులు బీహార్ పరిశ్రమలను బలోపేతం చేస్తాయని యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని ఆయన అన్నారు. గత పదకొండు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా నాలుగు కోట్లకు పైగా పేద కుటుంబాలకు శాశ్వత గృహాలు అందించామని, బీహార్‌లో 38 లక్షల ఇళ్లు నిర్మించామని మోదీ ప్రస్తావించారు.

ఆ క్రెడిట్ ని బీహార్ కి :

అంతే కాదు ఆపరేషన్ సిందూర్ భారతదేశ రక్షణ విధానంలో కొత్త గీతను గీసిందని ప్రధాని మోదీ అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగినప్పుడు, ఉగ్రవాదులకు వారి ఊహకు మించి శిక్ష పడుతుందని తాను చెప్పానని మోదీ ప్రస్తావించారు. బీహార్ నుండి తీసుకున్న ప్రతిజ్ఞ నెరవేరిందని నేడు ప్రపంచం చూస్తోందని ఆయన అంటూ ఆ క్రెడిట్ ని బీహార్ కి ఇచ్చేశారు. అలాగే బీహార్‌లో రైల్వేల అభివృద్ధిపై ఎన్డీఏ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వేగంగా పనిచేస్తోందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. మొత్తానికి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ఈ విధంగా ప్రారంభించరు అని అంటున్నారు.