ఎర్ర కోట నుంచి మోడీ స్పీచ్...బిగ్ సౌండ్ మిస్ !
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత దేశానికి 79వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఎర్ర కోట నుంచి ప్రసంగించారు సుదీర్ఘంగా ఆయన ఈసారి స్పీచ్ ఇవ్వడం విశేషం.
By: Satya P | 16 Aug 2025 5:04 PM ISTప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత దేశానికి 79వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఎర్ర కోట నుంచి ప్రసంగించారు సుదీర్ఘంగా ఆయన ఈసారి స్పీచ్ ఇవ్వడం విశేషం. అంతే కాదు ఆయన గతంలో ఇచ్చిన లెగ్తీ స్పీచ్ రికార్డుని ఆయనే బద్ధలు కొట్టడం విశేషం. అయితే ఈ స్పీచ్ లో ఏముంది అని ఇపుడు అంతా తరచి చూస్తున్నారు. ఇక వామపక్ష పార్టీలకు అయితే మోడీ స్పీచ్ ఏమాత్రం నచ్చలేదు. దాంతో వారు విమర్శలు చేస్తున్నారు.
మధ్యలో ఆర్ఎస్ఎస్ ఎందుకు :
ప్రధాని స్పీచ్ లోకి ఆర్ఎస్ఎస్ ఎలా వచ్చింది అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నిస్తున్నారు. దేశ స్వాతంత్ర్యానికి ఆర్ఎస్ఎస్ కి ఏ మాత్రం సంబంధం లేదని కూడా ఆయన తేల్చి చెప్పారు. అయినా దేశం కోసం ఎంతో మంది త్యాగాలు చేశారని అల్లూరి, భగత్ సింగ్, చంద్రశేఖర్ అజాద్ వంటి వారి పేర్లు ఎందుకు ప్రస్తావించలేదని కూడా ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఎన్నో పోరాటాలు చేసింది కాంగ్రెస్ సీపీఐ అని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆ పార్టీల గురించి ఆనాటి నాయకుల గురించి చెప్పకుండా ఆర్ఎస్ఎస్ ని పొగడడం ఎందుకు అని నిలదీశారు.
ట్రంప్ కి ధీటైన బదులేది :
మాటకు వస్తే చాలు భారత్ పాకిస్తాన్ ల మధ్య యుద్ధాన్ని తాను ఆపాను అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నారని వామపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక భారత్ మీద పెత్తనం చేయడానికి ట్రంప్ చూస్తున్నారని భారత్ ఎక్కడ ఏ వస్తువులు దిగుమతి చేసుకోవాలో ఆయనే నిర్ణయిస్తున్నారని మండిపడుతున్నారు. భారత దేశం ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టేలా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఉన్నాయని విమర్శిస్తున్నారు. అయినా సరే మోడీ ఏమీ మాట్లాడకపోవడం బాధకరమని ఎత్తి చూపుతున్నారు. భారత్ పాక్ ల మధ్య యుద్ధాన్ని ఇప్పటికి 30 సార్లు ట్రంప్ అంటూంటే ఒక్కసారి అయినా ఆయన పేరు చెప్పి గట్టిగా మోడీ ఎందుకు ఖండించలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఎర్ర కోట మీద నుంచి మోడీ చేసిన ప్రసంగంలో సైతం ట్రంప్ ప్రకటనల మీద ధీటైన జవాబును అంతా ఆశించారని కానీ అలాంటిది ఏదీ లేకుండా పోయిందని అంటున్నారు.
పేదరికం తగ్గిందా :
మరో వైపు చూస్తే దేశంలో పేదరికం తగ్గిందా లేక పెరిగిందా అని ప్రధాని స్పీచ్ తరువాత విమర్శలు చర్చలు కూడా సాగుతున్నాయి. తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో పేదరికం తగ్గిందని ప్రస్తావించారని అయితే ఈ రోజుకీ యాభై కోట్ల మందికి బియ్యం, గోధుమలను ఉచితంగా రేషన్ కార్డుల మీద ఎలా పంపిణీ చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. పేదరికం ఉండబట్టే కదా అని అంటున్నారు. పేదరికం ఒక వైపు ఒప్పుకుంటూనే మరో వైపు బాగా తగ్గిందని చెప్పడం అయోమయానికి దారి తీస్తోందని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే కనుక మోడీ ప్రసంగం అనుకున్న వాడి వేడిగా లేదని అమెరికా పెద్దన్నకు అది గట్టిగా తాకేలా లేదని వామపక్ష నాయకులు అంటున్నారు అంతే కాకుండా దేశంలో అనేక మౌలికమైన సమస్యల విషయంలో కూడా మాట్లాడి ఉండాల్సింది అని అంటున్నారు. అయితే ఆర్ఎస్ఎస్ గురించి జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ గురించి ప్రతిష్టాత్మకమైన ఎర్ర కోట నుంచి మోడీ ప్రస్తావించడం పట్ల కుడి భావజాలం బలంగా నమ్మిన వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ అద్భుతమైన ఎన్జీవో సంస్థ అని వారు గుర్తు చేస్తున్నారు. అలాగే దేశం కోసం శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానం చేసారు అని గుర్తు చేస్తున్నారు. వారి పేర్లు స్వాతంత్ర్య వేళ చోటు చేసుకోవడం మంచి పరిణామమే అని అంటున్నారు.
