మోడెర్నా .. ఒక్క రోజులో 172 శాతం పెరిగిన షేర్
అమెరికాలోని కేంబ్రిడ్జ్ మసాచుసెట్స్ లో ఈ సంస్థను 2010లో ప్రారంభించారు.
By: Tupaki Desk | 20 Aug 2026 10:32 AM ISTఅమెరికాకు చెందిన మోడెర్నా సంస్థ తాజాగా స్టాక్ మార్కెట్లో సంచలనం రేపుతున్నది. ఒకే రోజులో ఈ సంస్థ షేర్ ధర ఏకంగా 172 శాతం పెరగడమే దీనికి కారణం. స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇది అత్యధిక పెరుగుదల అని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలోని కేంబ్రిడ్జ్ మసాచుసెట్స్ లో ఈ సంస్థను 2010లో ప్రారంభించారు.
మోడెర్నా సంస్థ తన భాగస్వామ్య సంస్థ మెర్క్ తో కలిసి ప్రయోగాత్మక వ్యక్తిగత ఎంఆర్ఎన్ఎ క్యాన్సర్ వ్యాక్సిన్ తయారు చేస్తున్నది. తాజాగా ఫేస్-3 క్లినికల్ ట్రయల్స్‌లో విజయం సాధించినట్లు సంస్థ ప్రకటించింది. దీంతో స్టాక్ మార్కెట్‌లో మోడెర్నా సంస్థ షేర్ ధర ఒక్కరోజే దాదాపు 172 శాతం వరకు పెరిగింది.
చర్మ క్యాన్సర్ రోగులపై నిర్వహించిన ఫేస్ 3 ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ సఫలమైంది. మెర్క్ సంస్థకు చెందిన ఇమ్యునోథెరపీ డ్రగ్ కీట్రుడా తో కలిపి ఈ వ్యాక్సిన్‌ను అందించినప్పుడు, క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టకుండా మరియు ఇతర శరీర భాగాలకు వ్యాపించకుండా నివారించడంలో సానుకూల ఫలితాలు కనిపించాయి.
ఈ వ్యాక్సిన్ విజయవంతం కావడంతో మోడెర్నా మార్కెట్ విలువ ఒకే రోజులో దాదాపు 30 బిలియన్ డాలర్లు పెరిగింది. మోడెర్నా భాగస్వామ్య సంస్థ అయిన మెర్క్ షేర్లు కూడా రికార్డ్ స్థాయిలో 13 శాతం పెరిగాయి. కోవిడ్ 19 వ్యాక్సిన్ తర్వాత బయోఫార్మా రంగంలో క్యాన్సర్‌పై సాధించిన ఈ విజయం చారిత్రాత్మకంగా నిలిచిపోతుంది.
