బీఆర్ ఎస్‌ను ఆ దేవుడు కూడా కాపాడలేడు: కవిత షాకింగ్ కామెంట్స్
ఈ సందర్భంగా మరోసారి మాజీ మంత్రి హరీష్‌రావుపై కవిత నిప్పులు చెరిగారు. హరీష్ రావును 'బబుల్ షూటర్'గా ఆమె అభివర్ణించారు.
By: Garuda Media | 3 Jan 2026 6:44 PM ISTబీఆర్ ఎస్ మాజీ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన తండ్రి, మాజీముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేతపైనే ఆయన గురి పెట్టి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాకపోతే.. ఇక, బీఆర్ ఎస్ పార్టీని ఆ దేవుడు కూడా కాపాడలేడు.. అని వ్యాఖ్యానించారు. ఎన్నాళ్లు ఆయన సభకు దూరంగా ఉంటే.. అంతగా.. పార్టీ డైల్యూట్ అవుతుందన్నారు. సభకు వచ్చి.. తమ సమస్యలపై ప్రస్తావించాలన్న ఉద్దేశంతోనే ఎమ్మెల్యేగా ప్రజలు ఓటేస్తారని చెప్పారు. కేసీఆర్ ఇప్పటికైనా సభకు రావాలని ఆమె సూచించారు.
ప్రస్తుతం నీటి వివాదంపై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని.. తమకు న్యాయం చేయాలని కూడా కోరుతున్నారని చెప్పారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ సభకు వచ్చి.. జల వివాదాలపై నిజాలు ఏంటో ప్రజలకు చెప్పాలని అన్నారు. లేకపోతే.. ప్రజలుఏవగించుకుంటారని.. పార్టీ పరిస్థితి కూడా దిగజారుతుందని అన్నారు. ఈ సందర్భంగా మరోసారి మాజీ మంత్రి హరీష్‌రావుపై కవిత నిప్పులు చెరిగారు. హరీష్ రావును 'బబుల్ షూటర్'గా ఆమె అభివర్ణించారు. ఆయన వల్లే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడిందన్నారు. కాగా.. కేసీఆర్ హయాంలో హరీష్ రావు.. జలవనరుల మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యవహారాన్ని ప్రస్తావించిన కవిత.. "బబుల్ షూటర్‌ను నమ్మడం వల్లే ఇబ్బందులు వచ్చాయి." అని హరీష్ రావుపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తన రాజీనామాపైనా ఆమె వ్యాఖ్యానించారు. తాను నిబంధనల ప్రకారమే రాజీనామా చేశానని.. కానీ ఆమోదించడం లేదన్నారు. చివరి ప్రయత్నంగా మరో నాలుగు రోజులు వేచి చూస్తానని చెప్పారు. అప్పటికీ ఆమోదం పొందకపోతే.. న్యాయ పోరాటానికి దిగుతానని చెప్పారు. ఇదేసమయంలో తన రాజీనామాకు గల కారణాలను కూడా మండలి సభ్యులకు వివరించనున్నట్టు కవిత చెప్పారు. ఏదేమైనా.. తన భవిష్యత్తు రాజకీయాలు భిన్నంగా ఉంటాయని ఆమె చెప్పడం గమనార్హం.
