టీడీపీ ఎమ్మెల్యే కూన క్రేజ్ పెరుగుతోందా...?
రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్కరకమైన పరిస్థితి నెలకొంది.
By: Garuda Media | 21 Nov 2025 12:43 PM ISTరాష్ట్రంలో ఎమ్మెల్యే లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్కరకమైన పరిస్థితి నెలకొంది. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకుంటే.. మరికొన్ని చోట్ల మాత్రం వివాదాల ముసురు నుంచి ఎమ్మెల్యేలు బయట పడుతున్నారు. ఇలాంటి వాటిలో ఎమ్మెల్యేలకు తిరిగి ఆదరణ పెరుగుతోంది. ప్రభుత్వ విప్, సీనియర్ ఎమ్మెల్యే కూన రవికుమార్.. గ్రాఫ్ మళ్లీ పుంజుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఇటీవల ఈయనపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
ఓ స్కూల్ టీచర్‌ను బెదిరించారని.. ఫోన్ లో దుర్భాషలాడారని కూనపై విమర్శలు వచ్చాయి. కొన్నాళ్ల పాటు ఆయన సైలెంట్ అయ్యారు. ఈ క్రమంలోనే సదరు టీచర్ కేసు కూడా పెట్టారు. అయితే.. తర్వాత వాస్తవాలు వెలుగు చూశాయి. దీంతో సదరు కేసును టీచర్ వెనక్కి తీసుకున్నారు. ఇక, ఆ తర్వాత.. నియోజకవర్గంలో పర్యటనలు పెట్టుకున్న కూన రవికుమార్.. వైసీపీ నాయకులు.. తనపై చేస్తున్న విమర్శలను తప్పుడు ప్రచారాలను కూడా ఖండించారు.
అదే సమయంలో పార్టీ నాయకులకు చేరువ అయ్యారు. సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేస్తున్నవారిని ఓ కంట కనిపెడుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తు న్నారు. ఆముదాల వలస నియోజకవర్గంలో గతానికి భిన్నంగా రాజకీయాలు కూడా సాగుతున్నాయి. వైసీపీ సైలెంట్ అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ హవా మరింత పెంచేలా కూన ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ విజయం దక్కించుకోవడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు.
ఈ పరిణామాల తో గత కొన్నాళ్లుగా కూనపై వచ్చిన విమర్శలు దాదాపు తెరమరుగయ్యాయని పార్టీ నాయ కులు చెబుతున్నారు. ''అవన్నీ తప్పుడు ఆలోచనలు. తప్పుడు ప్రచారాలు. ఇప్పుడు అంతా సర్దుకుంది.'' అని కూన ప్రధాన అనుచరుడు చెప్పారు. ప్రజల్లో కూడా.. నిరంతరం.. ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఫలితంగా తన గ్రాఫ్‌ను చెడకుండా ఆయన చూసుకుంటున్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. తద్వారా సాధారణ సమస్యలకు అప్పటికప్పుడే పరిష్కారం చూపిస్తున్నారు.
