Begin typing your search above and press return to search.

స్టాలిన్ : వీవీ ప్యాట్లు లెక్కిస్తే విజయం వరిస్తుందా ?

‘తమిళనాడు ప్రజల తీర్పును అంగీకరిస్తున్నాం. విజేతలకు అబినందనలు. తమిళనాడులో ఇప్పటి వరకు డీఎంకే ఆరుసార్లు అధికారంలో ఉన్నది.

By:  Tupaki Political Desk   |   25 Aug 2026 3:28 PM IST
స్టాలిన్ : వీవీ ప్యాట్లు లెక్కిస్తే విజయం వరిస్తుందా ?
X

‘తమిళనాడు ప్రజల తీర్పును అంగీకరిస్తున్నాం. విజేతలకు అబినందనలు. తమిళనాడులో ఇప్పటి వరకు డీఎంకే ఆరుసార్లు అధికారంలో ఉన్నది. మేము చూడని విజయం లేదు. చూడని ఓటమి లేదు. ఈ ఎన్నికల్లో మా కూటమికి 1.54 కోట్ల ఓట్లు వచ్చాయి. టీవీకేకు, డీఎంకేకు శచ్చిన ఓట్ల తేడా కేవలం 3.52 శాతం మాత్రమే. ప్రజల నమ్మకం బలంగా ఉందని భావిస్తున్నాం’. తమిళనాడు ఎన్నికల్లో ఓటమి అనంతరం మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్, డీఎంకే పార్టీ వెల్లడించిన స్పందన ఇది.

గత ఏప్రిల్ లో జరిగిన తమిళనాడు ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకు గాను 233 స్థానాలలో పోటీ చేేసిన విజయ్ నాయకత్వంలోని టీవీకే 108, స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే 176 స్థానాలలో పోటీ చేసి 59, ఇక 172 స్థానాలలో పోటీ చేసిన అన్నాడీఎంకె 47 స్థానాలలో, కాంగ్రెస్ 5, వీసీకే 2, సీపీఐ 2, సీపీఎం 2, ఐయూఎంఎల్ 2, డీఎండీకె 1, పీఎంకె 4, బీజేపీ 1, ఎఎంఎంకె 1 స్థానంలో విజయం సాధించాయి. వాస్తవంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 స్థానాలు కావాలి. డీఎంకె భాగస్వామ్య పక్షాలు మద్దతు ఇవ్వడంతో విజయ్ నాయకత్వంలోని టీవీకె అధికారంలోకి వచ్చింది.

అయితే ఎన్నికల్లో డీఎంకే ఓటమిని హుందాగా అంగీకరించిన డీఎంకె అధినేత, మాజీ సీఎం స్టాలిన్ వ్యక్తిగతంగా తన ఓటమిని మాత్రం అంగీకరించలేకపోతున్నాడు. ఈ ఎన్నికల్లో చెన్నై జిల్లాలోని కొలత్తూరు నియోజకవర్గం నుండి స్టాలిన్ పోటీ చేశారు. టీవీకె అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో 8,795 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్ కు 74,202 ఓట్లు వచ్చాయి.

14 ఏళ్ల వయసులో 1967లో తన మామ మురసోలీ మారన్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో క్రియాశీల రాజకీయాల వైపు అడుగులు వేసిన స్టాలిన్ ఇప్పటి వరకు ఎన్నికల్లో 10 సార్లు పోటీ చేసి, ఏడు సార్లు విజయం సాధించి, మూడు సార్లు ఓడిపోయాడు. 1984లో థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన తొలిసారి ఓటమి పాలయ్యారు. 1989లో అదే నియోజకవర్గం నుండి గెలిచి, 1991లో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 1996, 2001, 2006లలో వరసగా అదే నియోజకవర్గం నుండి విజయం సాధించాడు. 2011లో కొలత్తూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి 2016, 2021లలో వరసగా గెలిచారు. తాజాగా 2026 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మూడు దశాబ్దాల తరువాత ఇది తొలి ఓటమి కాగా, అదీ సీఎం హోదాలో ఓడిపోవడం గమనార్హం.

ఈ నేపథ్యంలోనే ఆయన మద్రాసు హైకోర్టులో ఎన్నికల్లో జరిగిన సాంకేతిక తప్పిదాలను ప్రస్తావిస్తూ వీఎస్ బాబు ఎన్నికను రద్దు చేసి, తనను విజేతగా ప్రకటించాలని కోరుతున్నారు. 286 పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలు, వీవీ ప్యాట్ మిషన్లు వంద శాతం లెక్కించాలని, పేర్కొన్నారు. 28వ పోలింగ్ స్టేషన్లో 12 ఓట్ల తర్వాత వీవీ ప్యాట్ ఎర్రర్ 2.7 చూయించిందని, పోలింగ్ స్టేషన్ 75లో మరో వీవీ ప్యాట్ యంత్రం పనిచేయలేదని, వంద శాతం వీటిని లెక్కించాలని, తనను విజేతగా ప్రకటించాలని ఆయన కోరుతున్నారు. మరి వీవీ ప్యాట్ లను లెక్కిస్తే విజయం సాధ్యం అవుతుందా ? అన్నది చర్చానీయాంశంగా మారింది. ఈ విషయంలో కోర్టు తీర్పు ఎలా వస్తుందో వేచిచూడాలి.