Begin typing your search above and press return to search.

జయలలిత మ్యాజిక్ స్టాలిన్ రిపీట్ చేస్తారా ?

తమిళనాడులో ఎన్నికల నగారా మోగింది. తమిళనాడులో ఎన్నికలు రసవత్తరంగా జరగబోతున్నాయి. అయిదేళ్ల పాటు అధికారంలో ఉంటూ ఎన్నికలలో ప్రజా తీర్పుని డీఎంకే పార్టీ కోరబోతోంది.

By:  Satya P   |   16 March 2026 9:13 AM IST
జయలలిత మ్యాజిక్ స్టాలిన్ రిపీట్ చేస్తారా ?
X

తమిళనాడులో ఎన్నికల నగారా మోగింది. తమిళనాడులో ఎన్నికలు రసవత్తరంగా జరగబోతున్నాయి. అయిదేళ్ల పాటు అధికారంలో ఉంటూ ఎన్నికలలో ప్రజా తీర్పుని డీఎంకే పార్టీ కోరబోతోంది. 2011 తరువాత డీఎంకే ఈ విధంగా ప్రజల వద్దకు వస్తోంది. అనాడు కరుణానిధి సీఎం గా ఉన్నారు. స్టాలిన్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. 2011లో విపక్షంలో అయిదేళ్ల పాటు ఉన్న జయలలిత నాయకత్వంలోని అన్నా డీఎంకేని కరుణానిధి స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే ఢీ కొట్టింది. అయితే వరసగా రెండోసారి అధికారంలోకి రావాలనుకున్న డీఎంకే పట్టుదలను జనాలు ఆమోదించలేకపోయారు. జయలలితకు పట్టం కట్టారు.

జయలితకే సాధ్యం :

ఇక 2016లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జయలలిత నాయకత్వంలోని అన్నా డీఎంకే వరుసగా రెండోసారి అధికారం అందుకుని ఒక్ మ్యాజిక్ ని క్రియేట్ చేసింది. అప్పటిదాకా ఏ పార్టీ అయినా అయిదేళ్ళు మాత్రమే అధికారంలో ఉండేది, ప్రజలు వెంటేనే దించేసేవారు. కానీ జయలలిత తనదైన పని తీరుతో జనామోదం పొంది మరోసారి గద్దెనెక్కారు. అలా కరుణానిధి బతికి ఉండగా స్టాలిన్ ని సీఎం గా చూసుకోలేకపోయారు అని అంటారు.

స్టాలిన్ చేతిలోనే :

ఇక తమిళనాడు ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి. అంటే ఇప్పటికి సరిగ్గా నెల రోజులు మాత్రమే సమయం ఉంది. మరి స్టాలిన్ రెండోసారి అధికారంలోకి వస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఆనాడు డీఎంకే అధికారంలో ఉంటే కరుణానిధి సీఎం గా స్టాలిన్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఇపుడు స్టాలిన్ సీఎం గా ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఈసారి కనుక డీఎంకే అధికారంలోకి వస్తే ఉదయనిధి ముఖ్యమంత్రి అవుతారు అని ప్రచారంలో ఉంది అంటే కరుణానిధి స్టాలిన్ ని సీఎం గా ఎలా చూసుకోవాలని ఆశ పడ్డారో అలా స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధిని సీఎం గా చూసుకోవాలని ఆశిస్తున్నారు. మరి జయలలిత మాదిరిగా స్టాలిన్ వరసగా రెండోసారి గెలిచి అధికారంలోకి రాగలరా అన్నదే చర్చగా ఉంది.

సంక్లిష్ట రాజకీయం :

తమిళనాడులో చూస్తే సంక్లిష్టమైన రాజకీయం ఉంది. మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. సినీ నటుడు విజయ్ పార్టీ పెట్టారు. ఆయన రంగంలో ఉన్నారు. అన్నా డీఎంకే బీజేపీ కాంబో సైతం స్ట్రాంగ్ ఉంటూ సవాల్ చేస్తోంది. ఇక అయిదేళ్ల పాలన తరువాత ఎటూ యాంటీ ఇంకెంబెన్సీ ఉండనే ఉంది. దాంతో స్టాలిన్ వీటిని అధిగమించాల్సి ఉంది. అయితే మైనస్ పాయింట్లతో పాటు అనుకూల అంశాలు ఉన్నాయి. అవేంటి అంటే విపక్షంలో స్టాలిన్ తో ఢీ కొట్టే వారు లేకపోవడం. స్టాలిన్ అనుభవం సీఎంగా ఆయన ఇమేజ్ ఇవన్నీ వర్కౌట్ అయ్యేలా ఉంటే కనుక జయలలిత మ్యాజిక్ ని ఆయన రిపీట్ చేయగలరు అని విశ్లేషణలు ఉన్నాయి.

బలమైన కోటలు :

ఇక మొదటి నుంచి డీఎంకేకి బలమైన కోటలు ఉన్నాయి. గత ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసినా డీఎంకే సొంతంగా 133 నియోజకవర్గాలను గెలుచుకుంది, అయితే కూటమి మొత్తం 159 నియోజకవర్గాలలో విజయం సాధించింది. ఇక ఆనాడు ఎన్డీయే కూటమి 75 నియోజకవర్గాలను చేజిక్కించుకోగా, అందులో అన్నాడీఎంకే 66 స్థానాల్లో విజయం సాధించింది. అన్నా డీఎంకేకి గ్రామీణ ప్రాంతాలలో గట్టి పట్టు ఉంటే డీఎంకేకి అర్బన్ ప్రాంతాలలో అనుకూలత ఉంది. ఇక వివిధ వర్గాలలో తీసుకుంటే రెండు పార్టీలకు సమాన ఆదరణ ఉంది.

పార్టీ ఎవరు ఓట్లు చీలుస్తుంది :

ఎన్డీయే గెలిస్తే మాజీ సీఎం పళని స్వామి ముఖ్యమంత్రి అవుతారు. ఆయన పాలనలో మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే బలమైన నాయకుడిగా జనాలు ఆయనను గుర్తించాల్సి ఉందని అంటున్నారు. స్టాలిన్ విషయంలో ఆ పరిస్థితి లేదు, కేంద్రంలో బీజేపీని ఢీ కొట్టే నేతగా ఇండియా కూటమిలో కీలక నేతగా ఉన్నారు. దాంతో పాటు డీఎంకే కూటమి ఈసారి మరిన్ని పార్టీలను చేర్చుకుని పటిష్టం అయింది. విజయ్ పార్టీకి యూత్ లో మంచి ఆదరణ ఉంది. ఆ పార్టీ ఎవరు ఓట్లు చీలుస్తుంది అన్న దాని మీద కూడా ప్రధాన పార్టీల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయని అంటున్నారు.